
ముంబై: పుల్వామాలో జరిగిన ఉగ్రదాడికి నిరసనగా పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ప్రస్తుత ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఫొటోలను క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా(సీసీఐ) తొలగించింది. బ్రాబోర్న్ స్టేడియంలో ఉన్న ఇమ్రాన్ ఖాన్ ఫొటోలను తీసివేయాల్సిందిగా మేనేజింగ్ కమిటీ నిర్ణయించింది. ‘ఆల్ రౌండర్’ విభాగంలో ఇమ్రాన్ ఖాన్ ఫొటోను, క్రికెట్ జట్టు విభాగంలో పాకిస్తాన్ ఫొటోలను అక్కడ ఉంచారు. ఆ టీమ్‌లో ఇమ్రాన్ కూడా ఉండటంతో ఈ ఫొటోలను అక్కడ నుంచి తీసేశారు. భారతీయ ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని ఈ చర్యలు తీసుకున్నామని మేనేజింగ్ కమిటీ సీనియర్ ఒకరు తెలిపారు. దీనిపై ఆయన మాట్లాడుతూ..‘ఈ ఘోర దాడి వెనక ఏ దేశ హస్తం ఉందో మాకు తెలుసు. మా దేశ ప్రజల మనోభావాలే మాకు ముఖ్యం. వాటిని దృష్టిలో ఉంచుకుని పాక్ ప్రధానిగా ఉన్న ఇమ్రాన్ ఫొటోలను తొలగించాం’ అని పేర్కొన్నారు.
మన దేశ జవాన్లపై దాడి జరిగి 40 మంది అమరులైనప్పటికీ ఈ ఘటనపై ఇమ్రాన్ మౌనం వహించడాన్ని సీసీఐ తీవ్రంగా ఖండించింది. ఉగ్రవాదాన్ని అరికట్టడానికి భారత్ ఒక అడుగు ముందుకేస్తే, తాము పది అడుగులు ముందకేస్తామని ఇమ్రాన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వ్యాఖ్యానించారు. అయితే తాజాగా పాక్ అండతోనే భారత జవాన్లపై ఉగ్రదాడి జరిగిందని భావిస్తున్న తరుణంలో ఇమ్రాన్ మాత్రం నోరు మెదకపోవడం చర్చనీయాంశమైంది.
Comments
Please login to add a commentAdd a comment