
భారతీయ వృద్ధుడిపై దాడి కేసు చెల్లదట
వాషింగ్టన్: అమెరికాలో భారత సంతతికి చెందిన వృద్ధుడిపై ఇద్దరు పోలీసులు అత్యంత దారుణంగా దాడిచేసిన కేసును స్థానిక కోర్టు కొట్టిపారేసింది. దాంతోపాటు ఈ కేసును చెల్లని విచారణగా పేర్కొనడం గమనార్హం. గతేడాది ఫిబ్రవరిలో సురేష్ భాయ్ పటేల్ (57) అనే వృద్ధుడిని ఇద్దరు పోలీసు అధికారులు అడ్డుకుని ప్రశ్నించగా... ఆయన ఇంగ్లీష్లో సమాధానం ఇవ్వలేకపోయారు. ఆగ్రహించిన పోలీసులు వృద్ధుడిపై దాడిచేయగా, ఓ వ్యక్తి ఈ దృశ్యాలను చిత్రీకరించాడు.
వీడియోతో ఈ ఘటన వెలుగులోకి రావడంతో దాడికి పాల్పడిన వారిలో ఎరిక్ పార్కర్ అనే అధికారిని సస్పెండ్ చేసి, అరెస్టు చేసి అనంతరం బెయిల్ మీద విడుదల చేశారు. మాడిసన్ నగర పోలీసు చీఫ్ లారీ మున్సీ బాధితుడికి క్షమాపణలు కూడా చెప్పారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు పటేల్ సమాధానం చెప్పలేకపోవడం వల్లే ఇలా జరిగిందని అంటున్నారు. ఈ ఘటనపై ఎఫ్బీఐ విచారణ చేపట్టింది. ఫెడరల్ చట్టాలను ఏమైనా ఉల్లంఘించారేమో తేల్చేందుకు ఈ విచారణ జరిపారు.
అమెరికన్ కోర్టు ఈ చెల్లని కేసును చెల్లని రెండు సార్లు విచారణ చేశామని తాజాగా పేర్కొంది. గతేడాది సెప్టెంబర్లో తొలిసారి, నవంబర్ నెలలో రెండోసారి ఈ కేసు చెల్లదంటూ కింది స్థాయి కోర్టు తీర్పు ఇచ్చింది. తనకు ఇంగ్లీష్ రాదంటూ ఆ వృద్ధుడు చెబుతున్నట్లు ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. గతేదాడి ఈ వీడియో యూట్యూబ్లో హల్చల్ చేసిన విషయం తెలిసిందే. మనవడు పుట్టడంతో చూడాలని.. కొడుకు, కోడలికి సాయంగా ఉండాలని వచ్చిన పటేల్ పోలీసుల దాడిలో తీవ్రంగా గాయపడి అప్పటినుంచి చికిత్స పొందుతున్నారు.