తాతయ్య లేచారు.. మాట్లాడుతున్నారు! | Fast improving Sureshbhai can speak now: Attorney | Sakshi
Sakshi News home page

తాతయ్య లేచారు.. మాట్లాడుతున్నారు!

Published Sun, Feb 15 2015 9:29 AM | Last Updated on Fri, Aug 24 2018 8:39 PM

తాతయ్య లేచారు.. మాట్లాడుతున్నారు! - Sakshi

తాతయ్య లేచారు.. మాట్లాడుతున్నారు!

అమెరికాలో ఇద్దరు పోలీసు అధికారుల దాడిలో తీవ్రంగా గాయపడి, పక్షవాతానికి గురైన భారతీయ వృద్ధుడు సురేష్భాయ్ పటేల్ (57) ఆరోగ్యం మెరుగుపడుతోంది. ఆయన లేచి కూర్చుంటున్నారని, మాట్లాడుతున్నారని ఆయన తరఫున వాదిస్తున్న న్యాయవాది హెన్రీ ఎఫ్. షెరాడ్ తెలిపారు. సురేష్భాయ్ కోలుకోవడానికి మాత్రం చాలా కాలం పడుతుందన్నారు. ఆయన చేతి పట్టు, కుడికాలు బాగున్నాయని, ఎడమకాలు మాత్రం ఇంకా స్వాధీనంలోకి రాలేదని చెప్పారు. ప్రస్తుతానికి ఆయన మాట్లాడుతున్నారని, తింటున్నారని చెప్పారు. ఈ దాడిలో ప్రధానంగా చేతులు, కాళ్లమీదే ఎక్కువ ప్రభావం పడిందన్నారు.

చిరునామా, గుర్తింపు వివరాలు అడిగినప్పుడు ఇంగ్లీషు భాష సరిగ్గా రాకపోవడంతో సురేష్భాయ్ పటేల్ సరిగ్గా చెప్పలేకపోయారు. దాంతో ఇద్దరు పోలీసు అధికారులు ఆయనను కిందపడేసి విపరీతంగా కొట్టారు. ఈ ఘటన ఈనెల 6వ తేదీన మాడిసన్ నగరంలో జరిగింది. కాగా, ఈ దాడిపై ఎన్నారైలు తీవ్రంగా స్పందించారు. ఆయన చికిత్స కోసం ఇప్పటివరకు రూ. 93 లక్షల విరాళాలు సేకరించారు. ఆయనకు ఆరోగ్య బీమా లేకపోవడంతో మొత్తం బిల్లు చెల్లించాల్సి వస్తోంది. ఇటీవలే మనవడు పుట్టడంతో కొడుక్కి, కోడలికి సాయంగా వచ్చిన పటేల్కు.. ఆరోగ్యబీమా చేయించలేదు. ఆయన చికిత్సకు సుమారు కోటిన్నర వరకు అవుతుందని అంచనా. దాడికి పాల్పడిన వారిలో ఎరిక్ పార్కర్ అనే అధికారిని సస్పెండ్ చేసి, అరెస్టు చేసినా, బెయిల్ మీద విడుదల చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement