భారతీయ వృద్ధుడిపై దాడి: అమెరికా పోలీసు అరెస్టు
అమెరికాలో భారత సంతతికి చెందిన వృద్ధుడిపై అత్యంత దారుణంగా దాడిచేసిన ఇద్దరు పోలీసు అధికారుల్లో ఒకరిని అరెస్టు చేశారు. ఈ ఘటనపై ఎఫ్బీఐ విచారణ జరపనుంది. ఫెడరల్ చట్టాలను ఏమైనా ఉల్లంఘించారేమో తేల్చేందుకు ఈ విచారణ జరుపుతారు. సురేష్ భాయ్ పటేల్ (57) అనే వృద్ధుడికి ఇంగ్లీషు రాదు. దాంతో పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయారు. అంతే, ఇద్దరు పోలీసు అధికారులు అతడిని పట్టుకుని దారుణంగా దాడిచేశారు. దీనిపై మాడిసన్ నగర పోలీసు చీఫ్ లారీ మున్సీ క్షమాపణలు చెప్పారు.
పటేల్ కుటుంబానికి, ఎన్నారైలు అందరికీ మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నానని, భవిష్యత్తులో ఇలా జరగకుండా చూసుకుంటామని ఆయన అన్నారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు పటేల్ సమాధానం చెప్పలేకపోవడం వల్లే ఇలా జరిగిందని అంటున్నారు. దాడి చేసిన ఇద్దరిలోపార్కర్ అనే పోలీసు అధికారి మూడో డిగ్రీ దాడికి పాల్పడటంతో అతడిని అరెస్టు చేశామని, ఉద్యోగం నుంచి కూడా తొలగించాలని సిఫార్సు చేశామని అంటున్నారు. మరోవైపు.. వృద్ధుడిపై దాడి వీడియో ఇంటర్నెట్లో విస్తృతంగా ప్రచారం అవుతోంది. పటేల్ కాళ్లను కాళ్లతో తన్ని కింద పడేసి మరీ కొట్టడం స్పష్టంగా కనిపిస్తోంది.