మురికివాడ.. మురికి నీటిలో..
ఇది నైజీరియాలోని లాగోస్‌లో ఉన్న మకోకో మురికివాడ. ఇలాంటి మురికివాడ ప్రపంచంలో మరెక్కడా లేదేమో.. ఎందుకంటే.. ఇది నీటిపై తేలియాడే మురికివాడ. ఇక్కడి ప్రజలు అత్యంత దయనీయ స్థితిలో దుర్భర జీవితాన్ని గడుపుతుంటారు. ఎక్కువ మంది మత్స్యకారులే. 18వ శతాబ్దంలో చిన్న బెస్త గ్రామంగా మొదలైన మకోకో.. ఇప్పుడు భారీ మురికివాడగా మారిపోయింది. ఈ ఇళ్లన్నీ కర్రలతో కట్టినవే. ఇప్పుడక్కడ లక్షన్నర నుంచి 2 లక్షల మంది నివసిస్తున్నారు.
ఒక ఇంటి నుంచి మరో ఇంటికి వెళ్లాలన్నా.. చిన్నచిన్న పడవలను ఆశ్రయించాల్సిందే. ఈ సరస్సు అట్లాంటిక్ సముద్రానికి సమీపంలో ఉంది. సరస్సు నీరంతా కలుషితమైపోయి.. ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండి ఉంటుంది. పారిశుద్ధ్య సమస్యను కారణంగా చూపుతూ.. ఇవి అక్రమ నిర్మాణాలని పేర్కొంటూ.. 2012లో అక్కడి ప్రభుత్వం ఈ మురికివాడలోని కొన్ని ఇళ్లను కూల్చివేసింది. తర్వాత మీడియాలో గగ్గోలు రేగడంతో ఆపేసింది. ఇటీవల వీరికి నీటిపై తేలియాడే స్కూలును సర్కారు కట్టించింది. త్వరలోనే వీరందరినీ వేరే చోటికి తరలించి, పునరావాసం కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.