slum
-
మురికి వాడ నుంచి ఏకంగా రూ. 900 కోట్ల సామ్రాజ్యానికి యజమానిగా!
ఆమె ఎలాంటి డిగ్రీలు చేయలేదు. మురికి వాడల్లో పెరిగింది. అడుగడుగున అవమానాలు, కష్టాలు కడగళ్లే. అన్నింటిని ఓర్చుకుని మెరుగుపడుతుందనుకునే లోపే ఓ పెనువిషాదం అగాధంలో పడేసింది. ఒకరకంగా అదే ఆమెలో కసి పెంచి చిన్న చితక ఉద్యోగాలు కాదు వ్యాపారవేత్తగా కోట్లు గడించాలనుకునే ఆలోచనకు తెరతీసింది. అదే ఆమెను నేడు 900 కోట్ల సామ్రజ్యానికి అధిపతి చేసింది. పైగా రియల్ స్మమ్డాగ్ మిలియనీర్‌గా ప్రశంసలుందుకునేలా చేసింది కూడా. ఆమె పేరు కల్పనా సరోజ్. మహారాష్ట్రలోని విదర్భలో దళిత కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి కానిస్టేబుల్ కావడంతో పోలీస్ క్వార్టర్స్‌లోనే ఆమె కుటుంబ నివశించేది. అయితే దళిత కుటుంబం కావడంతో సమాజంలో దారుణమైన వివక్షణు ఎదుర్కొంది. ఆమెకు మగ్గురు సోదరీమణలు, ఇద్దరు సోదరులు ఉన్నారు. చిన్నతనంలో పాఠశాలల్లో జరిగే ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడానికి వీల్లేకుండా నిషేధించారు టీచర్లు. కనీసం తోటి విద్యార్థులతో కూర్చోకూడదు, తినకూడదు. అందుకు పాఠశాల టీచర్లు, తోటి విద్యార్థుల తల్లిదండ్రులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేవారు కాదు. అయినప్పటికీ తనను చదువుకోడానికి అంగీకరించడమే గొప్ప బహుమతిగా భావించింది కల్పనా సరోజ్. ప్రతిభావంతురాలైనప్పటికీ దళితురాలు కావడంతో చిన్నతనంలోనే పెళ్లి చేసేశారు ఆమె కుటుంబ సభ్యులు. భర్తతో కలిసి ముంబైకు చేరుకుంది. అక్కడ అత్తారింట్లో మొత్తం పదిమంది వ్యక్తులు ఉండే కుటుంబంలో ఆమె గొడ్డు చాకిరీ చేయాల్సి వచ్చేది. దీంతో ఆమెకు పోషకాహరం లోపం తలెత్తి నీరసించిపోయింది. ఆమె స్థితిని చూసి చలించిపోయినన తండ్రి అక్కడ నుంచి ఆమెను తీసుకొచ్చేశాడు. అయితే చుట్టుపక్కల వాళ్లు కూతుర్ని పుట్టింట్లో పెట్టుకుంటారా! అని ఈసడించడం మొదలుపెట్టారు. ఈ అవమానాలను తట్టుకోలేక ఏకంగా రెండు బాటిళ్ల ఎలుకల మందు తాగేసింది కల్పనా సరోజ్. ఆమె అత్త దీన్ని గమనించడంతో కొద్దిలో ప్రాణాపాయం తప్పింది. దేవుడిచ్చిన ఈ రెండో అవకాశాన్ని ఆత్మనూన్యతతో వృధా చేసుకోకూడదని గట్టిగా నిర్ణయించుకుంది. మళ్లీ ముంబైకి తిరిగొచ్చి తన మేనమామతో కలిసి ఉండాలని నిశ్చయించుకుంది. అప్పుడే అసిస్టెంట్ టైలర్‌గా పనిచేస్తూ ఆ వృత్తిలో మంచిగా రాణించింది. దీంతో ఒక గదిలో గడిపే ఆమె కుటుంబం కాస్త ఫ్లాట్‌లోకి వెళ్లింది. పరిస్థితి మెరుగుపడుతుందని అనుకునేలోపు చెల్లి అనారోగ్యం ఆమె కుటుంబాన్ని ఓ కుదుపు కుదిపేసింది. ఆమె వైద్యానికి సరిపడా డబ్బులు లేకపోవడంతోనే మరణించిందన్న విషయం ఆమెలో గట్టి కసిని పెంచింది. ఏదో చిన్నా చితకా ఉద్యోగాలతో సరిపెట్టకూడదు తాను వ్యాపారవేత్తగా ఎదగాల్సిందేనని గట్టిగా డిసైడ్ అయ్యిపోయింది కల్పనా సరోజ్. ఊహించని ములుపు.. అప్పుడే ప్రభుత్వం అందించే పథకాల గురించి తెలుసుకుంది. వెంటనే లోన్‌కి అప్లై చేసి చిన్న ఫర్నీచర్ వ్యాపారాన్ని ప్రారంభించింది. అత్యాధునిక ఫర్నిచర్లను చాలా చౌక రేటుకే విక్రయిస్తు లాభాలు గడిస్తుంది. ఓ పక్క టైలరింగ్ కూడా కొనసాగించింది. అలా రోజుకి దాదాపు పదహారు గంటలు పనిచేసేది. సరిగ్గా ఆ టైంలో రియల్ ఎస్టేట్ వివాదంలో చిక్కుకుంది. రెండేళ్ల పాటు న్యాయపోరాటం చేసి భూమికి సంబంధించిన లిటిగేషన్‌ను పరిష్కరించింది. ఇదే ఆమెకు అప్పులో ఊబిలో చిక్కుకున్న మెటల్ ఇంజనీరింగ్ కంపెనీ కమానీ ట్యూబ్స్ కార్మికులు బాధ్యతను స్వీకరించే అవకాశం తెచ్చిపెట్టింది. ఇది ఆమె తన తొలి ఆరర్డర్గా భావించి పదిమంది సభ్యులతో కూడిన బృందంతో ఆ కంపెనీని మళ్లీ లాభాల బాట పట్టించింది. ఆ తర్వాత ఆ కంపెనీకే చైర్ పర్సన్‌గా బాధ్యతలు చేపట్టింది. అలా ఇవాళ సుమారు 900 కోట్ల సామ్రాజ్యాని అధిపతి అయ్యింది కల్పనా సరోజ్. పైగా డిగ్రీలు, ఎంబీయేలు నన్ను ఈ స్థితికి తీసుకురాలేదని, కేవలం పట్టుదల, ఆత్మవిశ్వాసమే తనను ఈ స్థాయికి తీసుకొచ్చాయని సగర్వంగా చెబుతోంది కల్పనా సరోజ్. ఆమె స్థైర్యానికి, తెగువకు హ్యాట్సాఫ్ అనాల్సిందే కదూ!. (చదవండి: మహిళలు తప్పక తెలుసుకోవాల్సిన పది సేఫ్టీ యాప్‌లు ఇవే..!) -
తాజ్‌మహల్‌ను తలదన్నేలా స్లమ్ టూరిజంనకు ఆదరణ.. మురికివాడలకు పర్యాటకుల క్యూ
ఆసియా ఖండంలోనే అతిపెద్ద స్లమ్ ఏరియా ధారావి(ముంబై). దీనిని సుందరంగా మార్చే బాధ్యతను ఆదానీ గ్రూప్ తన చేతుల్లోకి తీసుకుంది. అయితే మహారాష్ట్రలోని రాజకీయ ప్రతిపక్షాలు ఈ ప్రాజెక్టు నుంచి అదాని గ్రూపును తొలగించాలని డిమాండ్ చేస్తున్నాయి. కాగా ఇటీవలి కాలంలో ఈ భారీ స్లమ్ ఏరియాకు పర్యాటకులు తాకిడి మరింతగా పెరిగింది. ప్రతీయేటా వేలాదిమంది విదేశీయులు ఈ స్లమ్ ఏరియాను సందర్శించేందుకు వస్తున్నారు. ఇక్కడి పేదల దుర్భర పరిస్థితులను అసక్తిగా గమనిస్తున్నారు. దేశంలోని తాజ్‌మహల్‌ను చూసేందుకు వచ్చేవారికన్నా ఈ స్లమ్ ఏరియాకే అధికంగా పర్యాటకులు వస్తున్నారని పలు నివేదికలు చెబుతున్నాయి. 18వ శతాబ్ధంలో కొందరు మత్స్యకారులు తమ పరిస్థితులకు అనుగుణంగా ఇక్కడ ఆవాసం ఏర్పాటు చేసుకున్నారు. కూలీనాలీ చేసుకుంటూ ఇక్కడే ఉంటూ వచ్చారు. తరువాతి కాలంలో వివిధ వృత్తుల వారు ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్నారు. 20 వ శతాబ్ధం నాటికి ఇక్కడ పరిస్థితుల్లో మార్పు వచ్చింది. స్కూళ్లు, ఆధ్యాత్మిక ప్రదేశాలు, ఆసుపత్రులు.. ఇలా అన్ని సౌకర్యాలు ఈ ప్రాంతంలో సమకూరాయి. ప్రస్తుతం ఇది ఆసియాలో అతి పెద్ద మురికివాడగా పేరొందింది. సుమారు 550 ఎకరాల్లో విస్తరించిన ధారావి.. లెక్కకుమించిన గుడిసెలు కలిగిన బస్తీలతో నిండిపోయి ఉంటుంది. ఇక్కడి ఒక్కో గుడిసెలోనూ 10 మందికిపైగా వ్యక్తులు ఉంటున్నారు. దీనిని పరిశీలించి చూస్తే ఇక్కడి జనాభా ఎంత అధికమో తెలుస్తుంది. ధారావి మురికివాడలో 10 లక్షలకుపైగా జనాభా ఉండవచ్చని అంచనా. ఇక్కడికి వచ్చే టూరిస్టులు గంటల తరబడి ఇక్కడే ఉంటూ, ఇక్కడి పరిస్థితులను గమనిస్తుంటారు. పేదలు ఎలా జీవిస్తుంటారు? వారి దినచర్య ఎలా ఉంటుందనేది వీరు గమనిస్తారు. ఈ నేపధ్యంలో పలు అంశాలకు సంబంధిచిన వీడియోలు తీసి, సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. కాగా ఇటువంటి మురికి వాడలు మనదేశంలోనే కాకుండా ఆఫ్రికాదేశాలైన యుగాండా, కెన్యా, కేప్టౌన్లలోనూ కనిపిస్తాయి. ఇది కూడా చదవండి: నది దగ్గర తన పనిలో మునిగిన పాల వ్యాపారి.. కలెక్టర్ ఫొటోతో గుట్టు రట్టు -
14 ఏళ్ల బాలిక ఘనత.. స్లమ్ నుంచి లగ్జరీ బ్యూటీ బ్రాండ్ అంబాసిడర్‌గా..
టాలెంట్ ఏ ఒక్కరి సొత్తు కాదు.. ప్రతిభకు డబ్బుతో సంబంధం లేదు. గుడిసెలు, గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారిలోనూ విశేష ప్రతిభ దాగి ఉంటుంది. కానీ టాలెంట్‌ను నిరూపించుకునేందుకు సమయం, అవకాశాలు, వేదికలు కావాలి.. అంతేగాదు సరైన ప్రోత్సాహం ఉండాలి. తాజాగా టాలెంట్ ఉంటే చాలు ఏదైనా సాధించవచ్చని నిరూపించింది మురికి వాడల్లో నివసించే 14 ఏళ్ల అమ్మాయి. చిన్న వయసులోనే గొప్ప విజయాన్ని అందుకొని తనలాంటి మరెంతో మందికి ఆదర్శంగానూ నిలిచింది. ముంబై ధారవి స్లమ్ వాడల్లో నివసించే మలీషా ఖర్వా.. ప్రఖ్యాతి గాంచిన లగ్జరీ బ్యూటీ బ్రాండ్ ఫారెస్ట్ ఎసెన్షియల్స్ సంస్థ కొత్తగా ప్రారంభించిన ‘ది యువతి కలెక్షన్’కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికైంది. స్లమ్ ఏరియాలో ఉండే మలీషా ఇప్పుడు ‘యువతి కలెక్షన్’ను ముందుండి నడిపించనుంది. ఇది యువ శక్తిని పెంపొందించే లక్ష్యంతో మొదలు పెడుతున్న ఓ సామాజిక కార్యక్రమం. ఈ మేరకు ఏప్రిల్‌లో మలీషాను తమ సంస్థలోకి స్వాగతం పలుకుతూ ఓ అందమైన వీడియో షేర్ చేసింది ఫారెస్ట్ ఎసెన్షియల్స్. #BecauseYourDreamsMatter అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో బ్రాండ్ స్టోర్‌లోకి వెళ్లి అక్కడ ప్రదర్శనకు ఉంచిన తన ఫోటోలను చూస్తూ ఆనందంతో మురిసిపోతుంది. ఈ వీడియో.. నెటిజన్ల మనసు దోచుకుంటోంది. దీనికి 5 మిలియన్ల వ్యూస్, 4 లక్షలకు పైగా కామెంట్లు వచ్చాయి. ‘అందాన్ని చూసే ధృక్పథంలో మార్పు అవసరం. ఇది సామాన్యుడికి దక్కిన విజయం. ఇంత గొప్ప ఘనత అందుకున్న మలీషాకు అభినందనలు. భవిష్యత్తులో ఆమె మరింత ఎత్తుకు ఎదగాలి’ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. దీనిపై మలీషా మాట్లాడుతూ.. ఫారెస్ట్ ఎసెన్షియల్స్‌తో తన ప్రచారం ఇప్పటి వరకు తనకు దక్కిన పెద్ద గౌరవమని తెలిపింది. భవిష్యత్తులో మోడల్‌గా రాణించాలనుకుంటున్నట్లు పేర్కొంది. అందుకు చదవును నిర్లక్ష్యం చేయనని.. చదువే తన మొదటి ప్రధాన్యమని తెలిపింది. View this post on Instagram A post shared by @forestessentials కాగా మూడేళ్ల కిత్రం 2020లో మలీషా ప్రతిభను హాలీవుడ్ డైరెక్టర్ రాబర్ట్ హాఫ్మన్ గుర్తించారు. ఆమె కోసం గో ఫండ్ మీ పేజ్ క్రియేట్ చేశాడు. ప్రస్తుతం ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 2, 25,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇటీవల అనేక మోడలింగ్ ప్రదర్శనలు ఇచ్చింది. ర్సాలా ఖురేషి, జాన్ సాగూ రూపొందించిన ‘లివ్ యువర్ ఫెయిరీటేల్’ అనే షార్ట్ ఫిల్మ్‌లో కూడా నటించింది. -
మురికివాడల్లో మొఘలుల వారసురాలు!
-
మురికివాడల్లో మొఘలుల వారసురాలు!
భారతదేశ చరిత్రలో ఒక మరిచిపోలేని ఘట్ట మొఘల్ సామ్రాజ్యం. సువిశాల భారతదేశంలో మొఘల్ రాజ్యం ప్రపంచంలోనే గొప్ప సామ్రాజ్యంగా కీర్తించబడింది. మొఘల్ సామ్రజ్యం కూడా అపార సిరిసంపదలతో తులతూగేది. ప్రతిఏటా 4000 టన్నుల బంగారు అభరాణాలు రాజ్యానికి వచ్చే ఆదాయంలో ఒక భాగం అంటే ఎన్ని లక్షల కోట్ల ఆదాయమో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. బాబర్, హుమాయున్, అక్బర్, షాజహాన్, ఔరంగజేబు ఇలా వీరందరూ మొఘల్ సామ్రాజ్యాన్ని ఏకచత్రాధిపత్యంగా పాలించారు. మరి ఇంతటి కుబేరులైన మొఘల్ వారసులు ఇప్పుడెలా ఉండాలి? వారసత్వంగా వచ్చిన ఆస్తిపాస్తులతో దర్జాగా బతుకుతుండాలి. కానీ మురికివాడల్లో, పూరి గుడిసెల్లో బతుకుతున్నారంటే నమ్ముతారా? నమ్మకపోతే ఇది చదవండి... ఓడలు బండ్లు అవుతాయి... బండ్లు ఓడలవుతాయి! అన్నట్లుగానే ఎన్నో సకల సౌకర్యాలు అనుభవించిన మొఘలుల వారసురాలు ఈ రోజు చిన్న పూరిగుడిసెలో బతుకు వెల్లదీస్తోంది. ఔరంగజేబు మనువరాలైన సుల్తనా బేగం కోల్‌కతాలోని చిన్న గదిలో ఆరుగురు పిల్లలతో ఉంటోంది. మొఘలుల చివరి మహరాజు బహదూర్ షా జాఫర్‌కు స్వయంగా ఈమె కోడలు. ఈ బహదూర్ షా జాçఫర్ స్వయాన ఔరంగజేబు మనువడు. అంటే సుల్తానా బేగం ఔరంగజేబుకు మనుమరాలు అవుతుంది. అంటే మొఘల్ మహారాణుల్లో సుల్తానా చివరివ్యక్తి అన్నమాట. చివరికి మిగిలింది మహారాణి అన్న బిరుదే కానీ పిడికెడు ఆస్తి కూడా రాలేదు. బ్రిటిషర్లకు ఎదురు తిరగడంతో..... బహదూర్ షా జాఫర్ బ్రిటిషర్లకు ఎదరు తిరిగాడు. 1857 సిపాయిల తిరుగుబాటు సమయంలో ఒక వర్గం సైన్యానికి ఈయన నాయకత్వం వహించాడు. బ్రిటిష్‌వారి చేతిలో పరాజయం పాలైన బహదూర్ షా ప్రాణభయంతో రంగూన్ పారిపోయాడు. ఆ తర్వాత ఇక తిరిగిరాలేదు. బ్రిటిష్ ప్రభుత్వం బహదూర్ షా ప్యాలెస్‌ను స్వాధీనం చేసుకుంది. అప్పటినుంచి ప్యాలెస్ దూరమైన ఈయన కుటుంబం రానురాను పేదరికంలోకి వెళ్లిపోయింది. ప్రభుత్వానికి విన్నవించిన సుల్తానా భేగం.. ఎర్రకోట, తాజ్ మహాల్, షాలిమర్ గార్డెన్‌లాంటి తమ ఆస్తులను ప్రదర్శనకుపెట్టి ఏటా కోట్ల రూపాయల గడిస్తున్నారు. కానీ తమకు కనీసం బతికేందుకు అవసరమయ్యే ఖర్చులను ప్రభుత్వం కేటాయించడంలేదని సుల్తానా బేగం ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో వెంటనే కోల్‌కతాలో ఒక ప్లాట్, రూ.50,000 ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందజేసింది. ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు ఖర్చయిపోయాయి. ఫ్లాట్‌ను రౌడీలు కబ్జా చేశారు. దీంతో ప్రస్తుతం పెన్షన్‌గా వచ్చే రూ.6000తో కాలం వెళ్లదీస్తోంది. అయితే కోల్‌కతాలో ఆరువేలతో బతకడం అంటే చాలా కష్టమైన పనే. గతాన్ని నెమరెసుకుంటూ.. ఒకవేళ బహదూర్ షా రంగూన్ పారిపోకుండా ఉంటే సుల్తానా భేగం ఢిల్లీలోని జాఫర్మహాల్లో ఉండేది. కానీ విధి కలిసిరాకపోవడం, ప్రభుత్వాలు స్పందించకపోవడంతో మహారాణిగా బతకాల్సిన సుల్తానా బేగం.. దుర్భర జీవితాన్ని అనుభవిస్తోంది. – సాక్షి స్కూల్ ఎడిషన్ -
వినుడు వినుడు ఈ మర్కట గాథా..
బ్యాంకాక్: తిండికోసం ఓ ఇంట్లోదూరిన కోతి.. 25 ఏళ్లు అక్కడే బందీ అయిపోయింది! కోతుల బాధ భరించలేక, కోతులపై కోపం పెంచుకున్న ఓ ఇంటాయన ఆ కోతిని పట్టుకుని గాలిమాత్రమే చొరబడే బోనులో బంధించాడు. విలవిలలాడినా వదిలిపెట్టలేదు. వలవలా ఏడ్చినా కరుణించలేదు. పాతికేళ్ల సుదీర్ఘ శిక్ష అనంతరం పోయినవారమే ఆ కోతికి విముక్తి లభించింది. ఈ మర్కటపురాణం పూర్వాపరాల్లోకి వెళితే.. బ్యాంకాక్ మురికివాడలో నివసించే ఓ వ్యక్తి 1991లో ఓ కోతిని బంధించాడు. రెండు ఇళ్ల మధ్య ఉన్న చిన్న సందులో ఇనుపతీగలతో బోను తయారుచేసి అందులో కోతిని ఉంచాడు. గుర్తొచ్చినప్పుడు తినడానికి ఏదైనా ఇచ్చేవాడు. బుధ్ధిపుట్టినప్పుడు పండో ఫలమో ఇచ్చేవాడు. కాల క్రమంలో ఆ కోతి స్థానికులకు చేరువైంది. వాళ్లంతా ఆ కోతిని 'జోయ్' అని ముద్దుగా పిలిచేవారు. కరుణించిన దానయ్య.. ఇదిలా ఉండగా దారినపోయే దానయ్య ఒకరు కోతి బోనులో ఉండటాన్ని చూసి చలించిపోయి, వైల్డ్ లైఫ్ ఫ్రెండ్స్ ఫౌండేషన్ వాళ్లకు సమాచారం చేరవేశాడు. ఆ సంస్థ సభ్యులు వెంటపెట్టుకొచ్చిమరీ కోతిని విడిపించాడు. విముక్తిపొందే సమయానికి కోతి చిక్కి శల్యమైపోయింది. శరీరంలో నీటి నిల్వలు బాగా తగ్గిపోవడంతో కనీసం నిలబడలేకపోయింది. 'జైలు లాంటి బోను నుంచి అది బయటపడి వారం అవుతోంది. ఇప్పుడిప్పుడే మిగతా కోతులతో కలిసేప్రయత్నం చేస్తోంది' అంటూ కోతి బాగోగులను ఫేస్బుక్ ద్వారా వెల్లడింస్తున్నారు వైల్డ్ లైఫ్ సభ్యులు. -
స్లమ్ నుంచి డాక్టర్ స్థాయికి...
ముంబై స్లమ్‌ల గురించి చెబితే.. ముందుగా ఎవరికైనా స్లమ్ డాగ్ మిలీయనీర్ సినిమా గుర్తుకొస్తుంది. మురికివాడల్లో పుట్టినా.. మట్టిలో మాణిక్యాల్లా మారి, ఆణిముత్యాల్లా జీవితాలను మలుచుకున్నవారు ఎందరికో స్ఫూర్తిని కలిగిస్తుంటారు. ఆ కోవకు చెందినవాడే ముంబైకి చెందిన డాక్టర్ సువాస్ దార్వేకర్. 'హ్యూమన్స్ ఆఫ్ బాంబే' ఫేస్బుక్ పేజీలో 'హౌ టు లివ్ లైఫ్' అంటూ ఆయన చెప్పిన విశేషాలు ఇప్పుడు ఎందరికో ఆదర్శంగా మారాయి. పేదరికాన్ని జయించి మంచి ప్రొఫెషనల్‌గా మారాలంటే దాని వెనుక ఎంతో పట్టుదల, కృషి ఉండాలి. చుట్టపక్కలవారు, స్నేహితుల సహాయ సహకారాలూ అవసరం అవుతాయనేందుకు దార్వేకర్ జీవితం పెద్ద ఉదాహరణ. అందుకే ముంబైలో వ్యర్థాల నుంచి వెలుగులు నింపే చంద్రుడిలా తయారైన డాక్టర్ సువాస్ దార్వేకర్ కథ... జీవితాలను మంచి మార్గంలోకి ఎలా మలచుకోవాలో తెలిపే ఓ పాఠంగా మారింది. పిల్లలు పెరిగే సమయంలో తండ్రి చనిపోవడం, పేదరికానికి తోడు కుటుంబంలోని వారంతా దృష్టి దోషంతో బాధపడటం.. ఒక్కోరోజు భోజనం దొరకడం కూడా కష్టంగా ఉండే పరిస్థితుల్లో నిజంగా దార్వేకర్ జీవితం... సినిమా కష్టాలను మించిపోయింది. పాఠశాల ఫీజు కట్టలేక తీవ్ర ఒత్తిడి ఎదుర్కొనే సమయంలో స్నేహితులు ఉపాధ్యాయులు ఆదుకోవడం కూడా తన జీవితంలో మార్పు తెచ్చేందుకు సహాయపడిందంటూ ఫేస్ బుక్ పేజీలో దార్వేకర్ తన కథను పోస్ట్ చేశాడు. వీధిదీపాల కింద చదువుకుంటూ, డబ్బుకోసం చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ, ఎట్టకేలకు పాఠశాల స్థాయి దాటగలిగిన దార్వేకర్.... ఇంటర్మీడియెట్ చివరి దశలో ఉండగా 50 రూపాయల ఫీజు లేక ఇంటికి బయల్దేరాల్సి వచ్చింది. అదే సమయంలో బస్టాప్ లో కనిపించిన స్నేహితుడికి పరిస్థితిని వివరించడంతో అతడు వెంటనే 50 రూపాయలు తీసివ్వడం ఎంతో సహాయపడింది. ఆ స్నేహితుడి రుణం తీర్చుకోలేనిదంటూ ఫేస్బుక్ పేజీలో దార్వేకర్ చెప్పడం అతడి కృతజ్ఞతా భావాన్ని తెలుపుతుంది. అటువంటి గడ్డు పరిస్థితికి చింతిస్తూ కూర్చోలేదు. కృషి ఉంటే మనుషులు రుషులౌతారన్న చందంగా పట్టుదలతో చదివి డాక్టర్ దార్వేకర్ గా మారాడు. ముంబైలో సొంతంగా ఓ క్లినిక్ ప్రారంభించి తన గతజీవితాన్ని మరచిపోకుండా మురికివాడల్లో నివసించేవారికి సేవలందిస్తూ.. అండగా నిలిచేందుకు నిర్ణయించుకున్నాడు. ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన దార్వేకర్ కథ ఇప్పుడు ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. -
కొండ చరియలు విరిగిపడి 13 మంది మృతి
కరాచీ : పాకిస్థాన్ నౌకాశ్రయ నగరం కరాచీలో మంగళవారం దారుణం చోటు చేసుకుంది. నగరంలోని గులిస్థాన్ -ఐ- జవహర్ ప్రాంతంలోని మురికివాడపై కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 13 మంది మరణించారని కరాచీ కమిషనర్ షోయిబ్ సిద్ధిఖి వెల్లడించారు. ఈ ఘటన ఈ రోజు తెల్లవారుజామున 2.00 గంటల ప్రాంతంలో చోటు చేసుకుందని తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే రెస్క్యూ టీం ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి... శిథిలాల కింద మృతదేహలను వెలికి తీసినట్లు చెప్పారు. అయితే మృతల్లో ఏడుగురు చిన్నారులు ఉన్నారని పేర్కొన్నారు. మృతులంతా పంజాబ్ రాష్ట్రంలోని బహ్వాల్ పూర్, రేహ్మాయార్ ఖాన్ జిల్లాల్లోకు చెందిన వారని చెప్పరు. మృతదేహాలను స్వస్థలాలకు తరలించినట్లు చెప్పారు. ఈ ఘటనపై పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబానికి ఆయన ప్రగాఢ సంతాపం తెలిపారు. -
పేదల ‘గూడు’ చెదిరింది
* ‘ఆర్‌ఏవై’ రద్దుతో రాష్ట్ర ప్రాజెక్టులకు కేంద్రం మంగళం * కార్యరూపం దాల్చని ఆరు ప్రాజెక్టుల రద్దు * విడుదలైన తమ వాటా నిధులు తిరిగివ్వాలంటూ లేఖ * త్వరలో ప్రారంభించే పథకం కింద రాష్ట్రానికి అవకాశం! సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మురికివాడల్లో నివసిస్తున్న పేదలు కలలుగన్న ‘గూడు’ చెదిరింది! కేంద్రం నిర్ణయం, రాష్ట్రం జాప్యం కారణంగా వివిధ పట్టణాల్లో ప్రారంభం కావాల్సిన పక్కా ఇళ్ల నిర్మాణం ఆదిలోనే అటకెక్కింది. పట్టణ ప్రాంతాల్లో మురికివాడల నిర్మూలన లక్ష్యంతో గత యూపీఏ ప్రభుత్వం 2011లో ప్రారంభించిన రాజీవ్ ఆవాస్ యోజన (ఆర్‌ఏవై/రే)ను రద్దు చేసిన ప్రస్తుత మోదీ ప్రభుత్వం... ఈ పథకం కింద ఇప్పటికే రాష్ట్రానికి మంజూరైన ఏడు ఇళ్ల నిర్మాణ ప్రాజెక్టుల్లో ఇంకా పనులు ప్రారంభంకాని ఆరు ప్రాజెక్టులను రద్దు చేసింది. పనులు ప్రారంభమైన ఏకైక ప్రాజెక్టు ‘కేశవనగర్’ను మాత్రమే కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర గృహనిర్మాణ, పట్టణ పేదరిక నిర్మూలనశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ఇటీవల లేఖ పంపింది. పైగా ఈ ప్రాజెక్టులకు మంజూరు చేసిన తమ వాటా నిధులను తిరిగి ఇవ్వాలని కోరింది. దేశవ్యాప్తంగా కేవలం 188 ప్రాజెక్టులనే కొనసాగించిన కేంద్రం ఇంకా కార్యరూపం దాల్చని మిగిలిన ప్రాజెక్టులను రద్దు చేసేసింది. అయితే 2022 నాటికి ప్రజలందరికీ ఇళ్ల నిర్మాణం లక్ష్యంలో భాగంగా త్వరలో ప్రకటించనున్న ‘హౌస్ ఫర్ ఆల్’ పథకం కింద రాష్ట్రానికి మళ్లీ అవకాశం కల్పిస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. కొంప ముంచిన పనుల జాప్యం ‘మిషన్ సిటీస్’లోని మురికివాడల ప్రజల కోసం రెండు, మూడంతస్తుల (జీ+2, జీ+3) గృహ సమూదాయాలను నిర్మించడం, మౌలిక సౌకర్యాలను కల్పించడమే రాజీవ్ ఆవాస్ యోజన ఉద్దేశం. గడిచిన మూడేళ్లలో రూ. 300 కోట్ల అంచనా వ్యయంతో తెలంగాణకు ఏడు ఆర్‌ఏవై ప్రాజెక్టులు మంజూరయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో కేశవ్‌నగర్‌లో రూ. 58.74 కోట్లతో 334 ఇళ్ల నిర్మాణానికి మంజూరైన ప్రాజెక్టు మాత్రమే ఇటీవల కార్యరూపం దాల్చింది. వరంగల్, ఖమ్మం, రామగుండం పట్టణాలకు మంజూరైన మరో ఆరు ప్రాజెక్టుల కింద ఇంకా పనులు ప్రారంభించకపోవడంతో కేంద్రం వాటిని రద్దు చేసేసింది. కేంద్ర ప్రభుత్వ వాటా కింద విడుదలైన రూ.161.56 కోట్ల నిధుల్లో గత రెండేళ్లుగా నిరుపయోగంగా ఉంచిన రూ.70 కోట్లను తిరిగివ్వాలని రాష్ట్రాన్ని కోరింది. ప్రతిపాదనలు పంపినా లభించని సీఎంవో ఆమోదం ఆర్‌ఏవై కింద మంజూరైన ప్రాజెక్టులను తమ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోకు అనుగుణంగా డబుల్ బెడ్ రూమ్ గృహాలతో నిర్మించాలని దాదాపు ఏడాది కింద సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఆర్‌ఏవై మార్గదర్శకాల ప్రకారం సింగిల్ బెడ్రూమ్ ఇంటికి రూ.5 లక్షల వ్యయం చేయాల్సి ఉండగా అదనపు బెడ్రూమ్ నిర్మాణం వల్ల ఈ ఖర్చు రూ.7 లక్షలకు పెరగనుందని అధికారులు అంచనా వేశారు. దాదాపు ఆర్నెల్ల కిందే సీఎం కార్యాలయానికి ఈ మేరకు సవరించిన ప్రతిపాదనలు వెళ్లినా ఆమోదముద్ర పడలేదు. కేశవ్‌నగర్ ప్రాజెక్టుకే ప్రభుత్వం ప్రత్యేక జీవో ద్వారా అనుమతులిచ్చింది. మిగిలిన ఆరు ప్రాజెక్టులపై నిర్ణయం తీసుకోలేకపోయింది. దీంతో రెండేళ్ల కిందే మంజూరైన ఈ ప్రాజెక్టులు ప్రారంభం కాకుండానే రద్దయ్యాయి. -
హైదరాబాద్‌లో సరికొత్త ప్రయోగం
-
మురికివాడల్లో పరిస్థితులు మెరుగుపడాలి
సదస్సులో వక్తల మనోగతం సాక్షి, సిటీబ్యూరో: నగరాల్లోని మురికి వాడల్లో పరిస్థితులను మెరుగు పరచాల్సిన అవసరం ఉందని పలువురు ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. మెట్రో పోలిస్ సదస్సులో భాగంగా బుధవారం ‘అర్బన్ పూర్ అండ్ బ్యాలెన్స్ ఆఫ్ ఈక్విటీ’ అనే అంశంపై చర్చ జరిగింది. ఇందులో యూఎస్ఎఫ్ వ్యవస్థాపకురాలు డాక్టర్ మ్యాగీ కాజల్, నిదాన్ అండ్ నాస్వి వ్యవస్థాపకులు అర్బింద్ సింగ్, చింతన్ డెరైక్టర్ భారతి చతుర్వేది, ప్రముఖ ఆర్కిటెక్ట్ కీర్తిషా, ఏపీఐఐసీ ఎండీ జయేశ్‌రంజన్, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ తదితరులు ప్రసంగించారు. పలువురు మాట్లాడుతూ మురికి వాడల్లో కాలుష్యం పెరిగిపోవడంతో అనారోగ్యకర వాతావరణం నెలకొంటుందని, వర్షం వస్తే ఆ కాలనీలు నీట మునిగిపోతున్నాయన్నారు. ఇళ్లు నిర్మించి ఇచ్చినంత మాత్రానో... మరో సదుపాయం కల్పించినంతమాత్రానో వారి పరిస్థితులు మారవన్నారు. సమాజంలో ఉండే మిగతా వారిలా పేదలకు కూడా తగిన సదుపాయాలను అందుబాటులో తేవాలని వక్తలు సూచించారు. ముఖ్యంగా వారి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడాలని, సాంఘిక న్యాయం, సమానత్వం కూడా ఉన్నప్పుడే మురికి వాడలు ఉండవన్నారు. ఎందరో పేదలు ఫుట్‌పాత్‌లపైనే జీవనాన్ని సాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కోల్‌కత్తాలో 25 ఏళ్లగా ఫుట్‌పాత్‌లపైనే జీవితాలు వెళ్లదీస్తున్న మహిళలెందరో ఉన్నారని తెలిపారు. ఈ పరిస్థితులు మారేందుకు ప్రభుత్వాలు, సంస్థలు తగిన కృషి చేయాల్సి ఉందని సూచించారు. పేదల కోసం అనేక కార్యక్రమాలు: కమిషనర్ హైదరాబాద్ నగరంలోని పేదల కోసం తాము వివిధ కార్యక్రమాలు చేపట్టినట్టు జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ తెలిపారు. మురికి వాడల ప్రజలు క లుషిత జలాల వల్ల పలు వ్యాధుల బారిన పడుతుండటాన్ని గుర్తించినట్టు చెప్పారు. ఇందుకోసం మంచి నీటిని అందించేందుకు 150 ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ద్వారా 600 మందికి కూడా ఉపాధి అవకాశాలుంటాయన్నారు. అంతేగాక డ్రైవర్ కమ్ ఓనర్, ఈవ్యాన్, నైట్‌షెల్టర్లు, రూ.5లకే భోజనం వంటి కార్యక్రమాలను ఆయన వివరించారు. -
మురికివాడలకు మంచిరోజులు
సాక్షి, ముంబై: రాష్ట్రవ్యాప్తంగా 2000 జనవరి ఒకటో తేదీ వరకు ఏర్పడిన మురికివాడలకు రక్షణ కల్పించే బిల్లుకు గవర్నర్ కె.శంకర్నారాయణన్ ఆమోదం తెలిపారు. ఫలితంగా మురికివాడల పునరాభివృద్ధి చట్టం అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం ముంబైలోని దాదాపు మూడు లక్షల గుడిసెలకు రక్షణ లభించనుంది. అంతేగాక మురికివాడలవాసులకు ఉచితంగా ఇళ్లు పొందేందుకు అవకాశం లభించనుంది. మురికివాడల రక్షణకు చట్టం తెస్తామంటూ కాంగ్రెస్, ఎన్సీపీ ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వం 2004 శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఇప్పుడు నెరవేరింది. త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఈ చట్టం ఉపకరిస్తుందని అధికారపక్షం భావిస్తోంది. చట్టం అమ లు వల్ల ముంబై, ఠాణే, పుణే, నాగపూర్, ఔరంగాబాద్ లాంటి ప్రధాన నగరాల్లో వెలసిన మురికివాడలను క్రమబద్ధీకరించడంతోపాటు అక్కడ సదుపాయాల కల్పనకు అవకాశం ఉంటుంది. ముం బైలో పెరిగిన మురికివాడలకు అడ్డుకట్ట వేసేందుకు 2001లో డీఎఫ్ కూటమి ప్రభుత్వం ఈ బిల్లును తయారు చేసింది. 1995 జనవరి ఒకటి తేది వరకు వెలిసిన గుడిసెలకు ఇది రక్షణ కల్పిస్తుందని అప్పుడు పేర్కొ న్నా, దీనిని 2000 వరకు పొడగించారు. అయితే 2004లో శాసనసభ ఎన్నికలు సమీపించడంతో మురికివాడల పేదల బిల్లు అమలు కోసం ఆందోళనలు మొదలుపెట్టారు. కాంగ్రెస్ ప్రధాన ఓటు బ్యాంకు మురికివాడలే కావడంతో, వీరిని సంతృప్తి పరిచేందుకు బిల్లు అమలుపై దృష్టి సారించారు. ఎన్నికల సమయంలో విడుదల చేసిన తమ మేనిఫెస్టోలో గుడిసెలకు రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చా రు. ఫలితంగా అప్పుడు కాంగ్రెస్ లబ్ధిపొందిన విష యం తెలిసిందే. ముంబైలో కాంగ్రెస్ సభ్యుల సంఖ్య పెరిగింది. మిత్రపక్షమైన ఎన్సీపీతో కలిసి మళ్లీ అధికారంలోకి వచ్చింది. తరువాత మాట మార్చి ఈ బిల్లును పక్కన బెట్టారు. అయినా 2009 లో శాసనసభ ఎన్నికల్లో మళ్లీ ఇదే అంశం తెరపైకి వచ్చింది. పేదల ఓట్లను తమవైపునకు మలచుకోవడంలో సఫలీకృతమై మళ్లీ అధికారంలో కి వచ్చారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికలకు ముందు అంటే ఫిబ్రవరిలో నిర్వహించిన ఆర్థిక బడ్జెట్ సమావేశాల్లో బిల్లుకు ఆమోదం తెలిపారు. 2000 జనవరి ఒకటో తేదీలోపు వెలసిన గుడిసెలకు మహారాష్ట్ర మురికివాడల అభివృద్ధి చట్టం ప్రకారం రక్షణ లభిస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. తదనంతరం ఈ బిల్లును గవర్నర్ వద్దకు ఆమోదం కోసం పంపిం చారు. అప్పటికే లోక్‌సభ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఇది పెండింగులోనే ఉండిపోయింది. లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం ఓటర్లు డీఎఫ్ కూట మిని ఘోరంగా ఓడించారు. గవర్నర్ ఇటీవల ఈ బిల్లుకు పచ్చజెండా ఊపారు. శాసనసభ ఎన్నికల్లో తమకు మురికివాడల రక్షణ చట్టం మేలు చేస్తుందని డీఎఫ్ భావిస్తోంది. -
మురికివాడ.. మురికి నీటిలో..
ఇది నైజీరియాలోని లాగోస్‌లో ఉన్న మకోకో మురికివాడ. ఇలాంటి మురికివాడ ప్రపంచంలో మరెక్కడా లేదేమో.. ఎందుకంటే.. ఇది నీటిపై తేలియాడే మురికివాడ. ఇక్కడి ప్రజలు అత్యంత దయనీయ స్థితిలో దుర్భర జీవితాన్ని గడుపుతుంటారు. ఎక్కువ మంది మత్స్యకారులే. 18వ శతాబ్దంలో చిన్న బెస్త గ్రామంగా మొదలైన మకోకో.. ఇప్పుడు భారీ మురికివాడగా మారిపోయింది. ఈ ఇళ్లన్నీ కర్రలతో కట్టినవే. ఇప్పుడక్కడ లక్షన్నర నుంచి 2 లక్షల మంది నివసిస్తున్నారు. ఒక ఇంటి నుంచి మరో ఇంటికి వెళ్లాలన్నా.. చిన్నచిన్న పడవలను ఆశ్రయించాల్సిందే. ఈ సరస్సు అట్లాంటిక్ సముద్రానికి సమీపంలో ఉంది. సరస్సు నీరంతా కలుషితమైపోయి.. ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండి ఉంటుంది. పారిశుద్ధ్య సమస్యను కారణంగా చూపుతూ.. ఇవి అక్రమ నిర్మాణాలని పేర్కొంటూ.. 2012లో అక్కడి ప్రభుత్వం ఈ మురికివాడలోని కొన్ని ఇళ్లను కూల్చివేసింది. తర్వాత మీడియాలో గగ్గోలు రేగడంతో ఆపేసింది. ఇటీవల వీరికి నీటిపై తేలియాడే స్కూలును సర్కారు కట్టించింది. త్వరలోనే వీరందరినీ వేరే చోటికి తరలించి, పునరావాసం కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.