పేదల ‘గూడు’ చెదిరింది | The state of Poor families living in slums | Sakshi
Sakshi News home page

పేదల ‘గూడు’ చెదిరింది

Published Mon, Jun 8 2015 4:30 AM | Last Updated on Sun, Sep 3 2017 3:23 AM

పేదల ‘గూడు’ చెదిరింది

పేదల ‘గూడు’ చెదిరింది

* ‘ఆర్‌ఏవై’ రద్దుతో రాష్ట్ర ప్రాజెక్టులకు కేంద్రం మంగళం
* కార్యరూపం దాల్చని ఆరు ప్రాజెక్టుల రద్దు
* విడుదలైన తమ వాటా నిధులు తిరిగివ్వాలంటూ లేఖ
* త్వరలో ప్రారంభించే పథకం కింద రాష్ట్రానికి అవకాశం!

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మురికివాడల్లో నివసిస్తున్న పేదలు కలలుగన్న ‘గూడు’ చెదిరింది! కేంద్రం నిర్ణయం, రాష్ట్రం జాప్యం కారణంగా వివిధ పట్టణాల్లో ప్రారంభం కావాల్సిన పక్కా ఇళ్ల నిర్మాణం ఆదిలోనే అటకెక్కింది.

పట్టణ ప్రాంతాల్లో మురికివాడల నిర్మూలన లక్ష్యంతో గత యూపీఏ ప్రభుత్వం 2011లో ప్రారంభించిన రాజీవ్ ఆవాస్ యోజన (ఆర్‌ఏవై/రే)ను రద్దు చేసిన ప్రస్తుత మోదీ ప్రభుత్వం... ఈ పథకం కింద ఇప్పటికే రాష్ట్రానికి మంజూరైన ఏడు ఇళ్ల నిర్మాణ ప్రాజెక్టుల్లో ఇంకా పనులు ప్రారంభంకాని ఆరు ప్రాజెక్టులను రద్దు చేసింది. పనులు ప్రారంభమైన ఏకైక ప్రాజెక్టు ‘కేశవనగర్’ను మాత్రమే కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర గృహనిర్మాణ, పట్టణ పేదరిక నిర్మూలనశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ఇటీవల లేఖ పంపింది.

పైగా ఈ ప్రాజెక్టులకు మంజూరు చేసిన తమ వాటా నిధులను తిరిగి ఇవ్వాలని కోరింది. దేశవ్యాప్తంగా కేవలం 188 ప్రాజెక్టులనే కొనసాగించిన కేంద్రం ఇంకా కార్యరూపం దాల్చని మిగిలిన ప్రాజెక్టులను రద్దు చేసేసింది. అయితే 2022 నాటికి ప్రజలందరికీ ఇళ్ల నిర్మాణం లక్ష్యంలో భాగంగా త్వరలో ప్రకటించనున్న ‘హౌస్ ఫర్ ఆల్’ పథకం కింద రాష్ట్రానికి మళ్లీ అవకాశం కల్పిస్తామని కేంద్రం హామీ ఇచ్చింది.
 
కొంప ముంచిన పనుల జాప్యం
‘మిషన్ సిటీస్’లోని మురికివాడల ప్రజల కోసం రెండు, మూడంతస్తుల (జీ+2, జీ+3) గృహ సమూదాయాలను నిర్మించడం, మౌలిక సౌకర్యాలను కల్పించడమే రాజీవ్ ఆవాస్ యోజన ఉద్దేశం. గడిచిన మూడేళ్లలో రూ. 300 కోట్ల అంచనా వ్యయంతో తెలంగాణకు ఏడు ఆర్‌ఏవై ప్రాజెక్టులు మంజూరయ్యాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో కేశవ్‌నగర్‌లో రూ. 58.74 కోట్లతో 334 ఇళ్ల నిర్మాణానికి మంజూరైన ప్రాజెక్టు మాత్రమే ఇటీవల కార్యరూపం దాల్చింది.

వరంగల్, ఖమ్మం, రామగుండం పట్టణాలకు మంజూరైన మరో ఆరు ప్రాజెక్టుల కింద ఇంకా పనులు ప్రారంభించకపోవడంతో కేంద్రం వాటిని రద్దు చేసేసింది. కేంద్ర ప్రభుత్వ వాటా కింద విడుదలైన రూ.161.56 కోట్ల నిధుల్లో గత రెండేళ్లుగా నిరుపయోగంగా ఉంచిన రూ.70 కోట్లను తిరిగివ్వాలని రాష్ట్రాన్ని కోరింది.
 
ప్రతిపాదనలు పంపినా లభించని సీఎంవో ఆమోదం
ఆర్‌ఏవై కింద మంజూరైన ప్రాజెక్టులను తమ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోకు అనుగుణంగా డబుల్ బెడ్ రూమ్ గృహాలతో నిర్మించాలని దాదాపు ఏడాది కింద సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఆర్‌ఏవై మార్గదర్శకాల ప్రకారం సింగిల్ బెడ్‌రూమ్ ఇంటికి రూ.5 లక్షల వ్యయం చేయాల్సి ఉండగా అదనపు బెడ్‌రూమ్ నిర్మాణం వల్ల ఈ ఖర్చు రూ.7 లక్షలకు పెరగనుందని అధికారులు అంచనా వేశారు.

దాదాపు ఆర్నెల్ల కిందే సీఎం కార్యాలయానికి ఈ మేరకు సవరించిన ప్రతిపాదనలు వెళ్లినా ఆమోదముద్ర పడలేదు. కేశవ్‌నగర్ ప్రాజెక్టుకే ప్రభుత్వం ప్రత్యేక జీవో ద్వారా అనుమతులిచ్చింది. మిగిలిన ఆరు ప్రాజెక్టులపై నిర్ణయం తీసుకోలేకపోయింది. దీంతో రెండేళ్ల కిందే మంజూరైన ఈ ప్రాజెక్టులు ప్రారంభం కాకుండానే రద్దయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement