- సదస్సులో వక్తల మనోగతం
సాక్షి, సిటీబ్యూరో: నగరాల్లోని మురికి వాడల్లో పరిస్థితులను మెరుగు పరచాల్సిన అవసరం ఉందని పలువురు ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. మెట్రో పోలిస్ సదస్సులో భాగంగా బుధవారం ‘అర్బన్ పూర్ అండ్ బ్యాలెన్స్ ఆఫ్ ఈక్విటీ’ అనే అంశంపై చర్చ జరిగింది. ఇందులో యూఎస్‌ఎఫ్ వ్యవస్థాపకురాలు డాక్టర్ మ్యాగీ కాజల్, నిదాన్ అండ్ నాస్వి వ్యవస్థాపకులు అర్బింద్ సింగ్, చింతన్ డెరైక్టర్ భారతి చతుర్వేది, ప్రముఖ ఆర్కిటెక్ట్ కీర్తిషా, ఏపీఐఐసీ ఎండీ జయేశ్‌రంజన్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ తదితరులు ప్రసంగించారు.
పలువురు మాట్లాడుతూ మురికి వాడల్లో కాలుష్యం పెరిగిపోవడంతో అనారోగ్యకర వాతావరణం నెలకొంటుందని, వర్షం వస్తే ఆ కాలనీలు నీట మునిగిపోతున్నాయన్నారు. ఇళ్లు నిర్మించి ఇచ్చినంత మాత్రానో... మరో సదుపాయం కల్పించినంతమాత్రానో వారి పరిస్థితులు మారవన్నారు. సమాజంలో ఉండే మిగతా వారిలా పేదలకు కూడా తగిన సదుపాయాలను అందుబాటులో తేవాలని వక్తలు సూచించారు.
ముఖ్యంగా వారి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడాలని, సాంఘిక న్యాయం, సమానత్వం కూడా ఉన్నప్పుడే మురికి వాడలు ఉండవన్నారు. ఎందరో పేదలు ఫుట్‌పాత్‌లపైనే జీవనాన్ని సాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కోల్‌కత్తాలో 25 ఏళ్లగా ఫుట్‌పాత్‌లపైనే జీవితాలు వెళ్లదీస్తున్న మహిళలెందరో ఉన్నారని తెలిపారు. ఈ పరిస్థితులు మారేందుకు ప్రభుత్వాలు, సంస్థలు తగిన కృషి చేయాల్సి ఉందని సూచించారు.
పేదల కోసం అనేక కార్యక్రమాలు: కమిషనర్
హైదరాబాద్ నగరంలోని పేదల కోసం తాము వివిధ కార్యక్రమాలు చేపట్టినట్టు జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ తెలిపారు. మురికి వాడల ప్రజలు క లుషిత జలాల వల్ల పలు వ్యాధుల బారిన పడుతుండటాన్ని గుర్తించినట్టు చెప్పారు. ఇందుకోసం మంచి నీటిని అందించేందుకు 150 ఆర్‌ఓ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ద్వారా 600 మందికి కూడా ఉపాధి అవకాశాలుంటాయన్నారు. అంతేగాక డ్రైవర్ కమ్ ఓనర్, ఈవ్యాన్, నైట్‌షెల్టర్లు, రూ.5లకే భోజనం వంటి కార్యక్రమాలను ఆయన వివరించారు.