14 ఏళ్ల బాలిక ఘనత.. స్లమ్‌ నుంచి ల‌గ్జ‌రీ బ్యూటీ బ్రాండ్‌ అంబాసిడర్‌గా.. | Sakshi
Sakshi News home page

Maleesha Kharwa: 14 ఏళ్ల బాలిక ఘనత.. స్లమ్‌ నుంచి ల‌గ్జ‌రీ బ్యూటీ బ్రాండ్‌ అంబాసిడర్‌గా..

Published Mon, May 22 2023 6:57 PM

Princess From Slum: Maleesha Kharwa Becomes Face Of Luxury Beauty Brand - Sakshi

టాలెంట్‌ ఏ ఒక్కరి సొత్తు కాదు.. ప్రతిభకు డబ్బుతో సంబంధం లేదు. గుడిసెలు, గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారిలోనూ విశేష ప్రతిభ దాగి ఉంటుంది. కానీ టాలెంట్‌ను నిరూపించుకునేందుకు సమయం, అవకాశాలు, వేదికలు కావాలి..  అంతేగాదు సరైన ప్రోత్సాహం ఉండాలి. తాజాగా టాలెంట్‌ ఉంటే చాలు ఏదైనా సాధించవచ్చని నిరూపించింది మురికి వాడల్లో నివసించే 14 ఏళ్ల అమ్మాయి. చిన్న వయసులోనే గొప్ప విజయాన్ని అందుకొని తనలాంటి మరెంతో మందికి ఆదర్శంగానూ నిలిచింది.

ముంబై ధారవి స్లమ్‌ వాడల్లో నివసించే మలీషా ఖర్వా..  ప్రఖ్యాతి గాంచిన లగ్జరీ బ్యూటీ బ్రాండ్‌ ఫారెస్ట్‌ ఎసెన్షియల్స్‌ సంస్థ కొత్తగా ప్రారంభించిన ‘ది యువతి కలెక్షన్‌’కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఎంపికైంది. స్లమ్‌ ఏరియాలో ఉండే మలీషా ఇప్పుడు ‘యువతి కలెక్షన్‌’ను ముందుండి నడిపించనుంది. ఇది యువ శక్తిని పెంపొందించే లక్ష్యంతో మొదలు పెడుతున్న ఓ సామాజిక కార్యక్రమం.

ఈ మేరకు ఏప్రిల్‌లో మలీషాను తమ సంస్థలోకి స్వాగతం పలుకుతూ ఓ అందమైన వీడియో షేర్‌ చేసింది ఫారెస్ట్ ఎసెన్షియ‌ల్స్. #BecauseYourDreamsMatter అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో బ్రాండ్‌ స్టోర్‌లోకి వెళ్లి అక్కడ ప్రదర్శనకు ఉంచిన తన ఫోటోలను చూస్తూ ఆనందంతో మురిసిపోతుంది. ఈ వీడియో.. నెటిజ‌న్ల మ‌న‌సు దోచుకుంటోంది. దీనికి 5 మిలియన్ల వ్యూస్‌, 4 లక్ష‌ల‌కు పైగా కామెంట్లు వచ్చాయి.

‘అందాన్ని చూసే ధృక్పథంలో మార్పు అవసరం. ఇది సామాన్యుడికి దక్కిన విజయం. ఇంత గొప్ప ఘనత అందుకున్న మలీషాకు అభినందనలు. భవిష్యత్తులో ఆమె మరింత ఎత్తుకు ఎదగాలి’ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. దీనిపై మలీషా మాట్లాడుతూ.. ఫారెస్ట్‌ ఎసెన్షియల్స్‌తో తన ప్రచారం ఇప్పటి వరకు తనకు దక్కిన పెద్ద గౌరవమని తెలిపింది. భవిష్యత్తులో మోడల్‌గా రాణించాలనుకుంటున్నట్లు పేర్కొంది. అందుకు చదవును నిర్లక్ష్యం చేయనని.. చదువే తన మొదటి ప్రధాన్యమని తెలిపింది.

కాగా మూడేళ్ల కిత్రం 2020లో మలీషా ప్రతిభను హాలీవుడ్‌ డైరెక్టర్‌ రాబర్ట్‌ హాఫ్మన్ గుర్తించారు. ఆమె కోసం గో ఫండ్‌ మీ పేజ్‌ క్రియేట్‌ చేశాడు.  ప్రస్తుతం ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 2, 25,000 మంది ఫాలోవర్స్‌ ఉన్నారు. ఇటీవల అనేక మోడలింగ్‌ ప్రదర్శనలు ఇచ్చింది. ర్సాలా ఖురేషి, జాన్ సాగూ రూపొందించిన ‘లివ్ యువర్ ఫెయిరీటేల్’ అనే  షార్ట్ ఫిల్మ్‌లో కూడా నటించింది.

 

Advertisement
 
Advertisement
 
Advertisement