స్లమ్ నుంచి డాక్టర్ స్థాయికి...
ముంబై స్లమ్‌ల గురించి చెబితే.. ముందుగా ఎవరికైనా స్లమ్ డాగ్ మిలీయనీర్ సినిమా గుర్తుకొస్తుంది. మురికివాడల్లో పుట్టినా.. మట్టిలో మాణిక్యాల్లా మారి, ఆణిముత్యాల్లా జీవితాలను మలుచుకున్నవారు ఎందరికో స్ఫూర్తిని కలిగిస్తుంటారు. ఆ కోవకు చెందినవాడే ముంబైకి చెందిన డాక్టర్ సువాస్ దార్వేకర్. 'హ్యూమన్స్ ఆఫ్ బాంబే' ఫేస్‌బుక్ పేజీలో 'హౌ టు లివ్ లైఫ్' అంటూ ఆయన చెప్పిన విశేషాలు ఇప్పుడు ఎందరికో ఆదర్శంగా మారాయి.
పేదరికాన్ని జయించి మంచి ప్రొఫెషనల్‌గా మారాలంటే దాని వెనుక ఎంతో పట్టుదల, కృషి ఉండాలి. చుట్టపక్కలవారు, స్నేహితుల సహాయ సహకారాలూ అవసరం అవుతాయనేందుకు దార్వేకర్ జీవితం పెద్ద ఉదాహరణ. అందుకే ముంబైలో వ్యర్థాల నుంచి వెలుగులు నింపే చంద్రుడిలా తయారైన డాక్టర్ సువాస్ దార్వేకర్ కథ... జీవితాలను మంచి మార్గంలోకి ఎలా మలచుకోవాలో తెలిపే ఓ పాఠంగా మారింది. పిల్లలు పెరిగే సమయంలో తండ్రి చనిపోవడం, పేదరికానికి తోడు కుటుంబంలోని వారంతా దృష్టి దోషంతో బాధపడటం.. ఒక్కోరోజు భోజనం దొరకడం కూడా కష్టంగా ఉండే పరిస్థితుల్లో నిజంగా దార్వేకర్ జీవితం... సినిమా కష్టాలను మించిపోయింది. పాఠశాల ఫీజు కట్టలేక తీవ్ర ఒత్తిడి ఎదుర్కొనే సమయంలో స్నేహితులు ఉపాధ్యాయులు ఆదుకోవడం కూడా తన జీవితంలో మార్పు తెచ్చేందుకు సహాయపడిందంటూ ఫేస్ బుక్ పేజీలో దార్వేకర్ తన కథను పోస్ట్ చేశాడు.
వీధిదీపాల కింద చదువుకుంటూ, డబ్బుకోసం చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ, ఎట్టకేలకు పాఠశాల స్థాయి దాటగలిగిన దార్వేకర్.... ఇంటర్మీడియెట్ చివరి దశలో ఉండగా 50 రూపాయల ఫీజు లేక ఇంటికి బయల్దేరాల్సి వచ్చింది. అదే సమయంలో బస్టాప్ లో కనిపించిన స్నేహితుడికి పరిస్థితిని వివరించడంతో అతడు వెంటనే 50 రూపాయలు తీసివ్వడం ఎంతో సహాయపడింది. ఆ స్నేహితుడి రుణం తీర్చుకోలేనిదంటూ ఫేస్‌బుక్ పేజీలో దార్వేకర్ చెప్పడం అతడి కృతజ్ఞతా భావాన్ని తెలుపుతుంది. అటువంటి గడ్డు పరిస్థితికి చింతిస్తూ కూర్చోలేదు. కృషి ఉంటే మనుషులు రుషులౌతారన్న చందంగా పట్టుదలతో చదివి డాక్టర్ దార్వేకర్ గా మారాడు. ముంబైలో సొంతంగా ఓ క్లినిక్ ప్రారంభించి తన గతజీవితాన్ని మరచిపోకుండా మురికివాడల్లో నివసించేవారికి సేవలందిస్తూ.. అండగా నిలిచేందుకు నిర్ణయించుకున్నాడు. ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన దార్వేకర్ కథ ఇప్పుడు ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.