నెలకు రూ.1.70లక్షలు ఇస్తుందట!
స్విట్లర్లాండ్ ప్రజలకు ఆ దేశ ప్రభుత్వం భారీ ఆఫర్ ను ప్రకటించనుంది. తన పౌరులకు నెలకు కచ్చితమైన ఆదాయాన్ని సమకూర్చేలా ప్రణాళికలు రచిస్తోందిట. స్విట్జర్లాండ్ ప్రభుత్వం తీసుకు వస్తున్న ఈ కొత్త చట్టం ప్రకారం పౌరులు అందరికి బేషరతుగా 2,500 ఫ్రాంక్లు (ఒక స్విస్ ఫ్రాంక్ ఒక డాలర్ ప్రస్తుతం సమానం) చెల్లించే ప్రతిపాదనను పరిశీలిస్తోందట. అంటే ఏ పనీ చేయకపోయినా నెలకు సుమారు లక్షా 70 వేల రూపాయలు ఒక్కో కుటుంబానికి కచ్చితమైన వేతనం లభించనుంది. అంతేకాదు పిల్లలకు కూడా 625 డాలర్లను చెల్లించేందుకు యోచిస్తోందట.
కళాకారులు, రచయితలు, ఇతర మేధావులు ఈ పథకాన్ని ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. అయితే ఈ ప్రతిపాదన పట్ల స్థానిక రాజకీయ పార్టీలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఈ చర్య వల్ల ప్రజల్లో పనిచేయాలనే కాంక్ష తగ్గుతుందని ఆరోపిస్తున్నాయి. అటు ఈ స్టయిఫండ్ వల్ల యువతలో సోమరితనం పెరిగి, నైపుణ్యత తగ్గుతుందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ బలహీనపడుతుందని వాదిస్తున్నారు. ఇదే సమయంలో ఓ ధనిక దేశంలో ఈ తరహా అవకాశాన్ని ప్రజలకు దగ్గర చేయడం గొప్ప ప్రయోగం అవుతుందని యూనివర్శిటీ ఆఫ్ లుసానే పొలిటికల్ సైన్స్ విభాగం ప్రొఫెసర్ ఆండ్రియాస్ లాడ్నర్ వివరించారు.
ప్రభుత్వ అంచనాల ప్రకారం ఈ పథకానికి గాను సంవత్సరానికి రెండువందల బిలియన్ డాలర్లు ఖర్చుకానుంది. దీనిపై దేశవ్యాప్తంగా జూన్ 5 న ప్రజాభిప్రాయ సేకరణ జరగనుంది. మరోవైపు ఆర్థిక వేతన హామీ పథకంపై ప్రజల అభిప్రాయాన్ని సేకరిస్తున్న మొట్టమొదటి దేశంగా స్విస్ అవతరించింది. కాగా ప్రపంచ బ్యాంకు అంచనాల ప్రకారం2014 లో స్విట్లర్లాండ్ వ్యక్తి సగటు ఆదాయంలో అయిదవ స్థానాన్ని అక్రమించింది.