
ఫిన్‌లాండ్ బాటలో భారత్
హెల్సింకీ: ఉత్తర ఐరోపా దేశమైన ఫిన్‌లాండ్‌లో నిరుద్యోగ భృతిని విజయవంతంగా అమలు చేస్తున్నారు. అంతర్జాతీయ ప్రాథమిక ఆదాయాన్ని పరిగణలోకి తీసుకొని నిరుద్యోగ భృతిని నెలకు 585 డాలర్లుగా నిర్ణయించారు. 2000 సంవత్సరంలో ప్రవేశపెట్టిన ఈ నిరుద్యోగ భృతి ఇప్పటికీ విజయవంతంగా కొనసాగుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ప్రపంచంలోనే అంతర్జాతీయ ప్రాథమిక ఆదాయాన్ని జాతీయ ఆదాయ ప్రమాణంగా తీసుకున్న ఏకైక దేశం ఫిన్‌లాండ్ మాత్రమే. ఇప్పుడు ఇదే బాటలో అంతర్జాతీయ ప్రాథమిక ఆదాయాన్ని ప్రమాణంగా తీసుకోవాలని భారత్‌తోపాటు కెన్యా, నెదర్లాండ్ దేశాలు ఆలోచిస్తున్నాయి. నిరుద్యోగ భృతిని ఇవ్వడం ద్వారా నిరుద్యోగులు ఉద్యోగాలు వెతుక్కోరంటూ వచ్చిన వాదనలో నిజం లేదని, ఉద్యోగం వెతుక్కునే దిశగా నిరుద్యోగులను ఈ స్కీమ్ ప్రోత్సహిస్తోందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
పార్ట్‌టైమ్ జాబ్‌లు చేసే వారికి నిరుద్యోగ భృతిని మినహాయించడం లేదుగనుక ఎక్కువ మంది నిరుద్యోగులు పార్ట్‌టైమ్ ఉద్యోగాలవైపు మళ్లుతున్నారని ఆ వర్గాలు తెలిపాయి. అయితే నిరుద్యోగ భృతిని పొందుతున్న నిరుద్యోగులు పెద్ద ఉద్యోగాలనే కోరుకుంటున్నారని, చిన్న ఉద్యోగాలు చేయడానికి ఇష్టపడడం లేదని సామాజిక శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. నిరుద్యోగ భృతికి ఎలాంటి పన్నులు విధించడం లేనందున, చిన్న ఉద్యోగాలు చేయడం వల్ల వచ్చే జీతంలో పన్నులు పోతే నిరుద్యోగ భృతికన్నా తక్కువ వస్తుందన్నది వారి ఆందోళన వారు విశ్లేషిస్తున్నారు.