అమెరికా దూరమవుతోందా ?
భారత్, అమెరికా మధ్య జులై 6న జరగాల్సిన అత్యంత కీలక సమావేశం 2+2 చర్చలను (ఇరు దేశాలకు చెందిన విదేశాంగ మంత్రులు, రక్షణ మంత్రుల మధ్య ముఖాముఖి చర్చలు) అమెరికా రెండోసారి వాయిదా వేసింది. అనివార్య కారణాలతో ఈ ద్వైపాక్షిక చర్చల్ని వాయిదా వేస్తున్నట్టు అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో మన విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌కు ఫోన్‌లో తెలియజేశారు. ఈ పరిణామంతో భారత, అమెరికా మధ్య దూరం పెరుగుతోందన్న అనుమానాలకు తావిస్తోంది. రెండోసారి చర్చల వాయిదాపై కొంతమంది అంతర్జాతీయ పరిశీలకులు వివిధ కారణాలను విశ్లేషిస్తున్నారు.
వాణిజ్య యుద్ధం :
యూరోపియన్ యూనియన్, చైనా, భారత్ వంటి దేశాలపై అమెరికా వాణిజ్య యుద్ధాన్ని ప్రకటించి వివిధ దిగుమతులపై భారీగా సుంకాలు పెంచేసింది. భారత్ కూడా అమెరికా నుంచి దిగుమతయ్యే వ్యవసాయ పరికరాలు, ఇనుము, ఉక్కు వంటి 29 ఉత్పత్తులపై సుంకాన్ని పెంచి దెబ్బకి దెబ్బ తీసింది. చాలా ఉత్పత్తులపై భారత్ 100 శాతం సుంకాలు విధిస్తోందంటూ వివిధ సందర్భాల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు మోటార్ బైక్స్‌ని ఉత్పత్తి చేసే ప్రఖ్యాత హార్లీ డేవిడ్‌సన్ కంపెనీ అమెరికా వెలుపల కూడా తమ కార్యకలాపాలను ప్రారంభిస్తామని ప్రకటించింది. భారత్‌లోనే ఆ కంపెనీ తన వ్యాపారాన్ని విస్తరిస్తుందని ఊహాగానాలు చెలరేగడం ట్రంప్ సర్కార్‌కి మింగుడు పడడం లేదు. అప్పటికీ మోటార్ సైకిల్స్‌పై 50శాతం వరకు భారత్ పన్ను తగ్గించింది. అయితే భారత్ పూర్తిగా సుంకాలు రద్దు చేయాలని ట్రంప్ పట్టుబడుతున్నారు.
రష్యాతో సత్సంబంధాలు :
రష్యా నుంచి ఆయుధాలు ముఖ్యంగా ఎస్400 క్షిపణి రక్షణ వ్యవస్థ కొనుగోలు చేయాలన్న భారత్ నిర్ణయం అమెరికాకు ఆందోళన కలిగిస్తోంది. రెండేళ్ల క్రితం జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా ప్రమేయం ఉందన్న అనుమానంతో అమెరికా రష్యాపై ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షల చట్టం ప్రకారం రష్యాతో ఎవరు సత్సంబంధాలు కలిగినా వారిపై తీవ్ర చర్యలు తీసుకునే వీలు ఉంది. అమెరికా హెచ్చరికల్ని ఖాతరు చేయకపోవడంతోభారత్‌పై కూడా ఆంక్షలు విధించే అంశాన్ని అమెరికా, కాంగ్రెస్ పరిశీలిస్తోంది.
చమురు శత్రుత్వం :
ఇరాన్ అణు ఒప్పందం నుంచి అమెరికా వైదొలిగిన తర్వాత ఆ దేశం నుంచి ముడి చమురు దిగుమతులు మానేయాలంటూ భారత్‌పై ట్రంప్‌సర్కార్ ఒత్తిడి పెంచుతోంది. నవంబర్ 4 కల్లా చమురు దిగుమతుల్ని పూర్తిగా నిలుపుదల చేయాలని లేదంటే ఆంక్షలు విధిస్తామంటూ ట్రంప్ డెడ్‌లైన్ విధించారు. ఆ హెచ్చరికలపై భారత్ స్పందించకపోవడం అమెరికాకు కంటగింపుగా మారింది. ఐక్యరాజ్యసమితి నిర్ణయాలను తప్ప మరే దేశం ఆదేశాలను పట్టించుకోమన్నది భారత్ విధానం. ఈ కారణంగా భారత్ ఇరాన్ నుంచి చమురు దిగుమతులు ఆపకపోవచ్చునని అమెరికా కాంగ్రెస్‌కు చెందిన పరిశోధనా సంస్థ నివేదిక స్పష్టం చేసింది. ఇలా వివిధ అంశాల్లో ఇరు దేశాల మధ్య విభేదాలు చోటు చేసుకున్న నేపథ్యంలో అమెరికా భారత్‌తో ద్వైపాక్షిక చర్చల్ని వాయిదా వేయడం ఇరు దేశాల మధ్య దూరం పెరుగుతోందని కొందరు చేస్తున్న వాదనలకు బలం చేకూరుతోంది.
చైనాతో సంబంధాలు మెరుగవుతాయా ?
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య ఉద్రిక్తతల్ని పెంచి పోషిస్తూ ఉండడం ఆసియాలో అనూహ్యమైన పరిస్థితులకు దారి తీస్తోంది. భారత్, చైనా మధ్య సంబంధాలు కాస్త మెరుగయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత్‌తో పాటు ఇతర ఆసియా దేశాల నుంచి దిగుమతి చేసుకునే 8,549 ఉత్పత్తులపై చైనా భారీగా సుంకాలు తగ్గించడమో, పూర్తిగా తొలగించడమో చేస్తోంది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, భారత్ ప్రధాని నరేంద్ర మోదీ ఏప్రిల్‌నుంచి ఇప్పటివరకు రెండు సార్లు సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. వాణిజ్య సహకారం పెంచుకోవాలని నిర్ణయించారు. సరిహద్దు, ఇతర సమస్యలపై రెండు దేశాల మధ్య అగాధం అలాగే ఉన్నప్పటికీ, ట్రంప్ వ్యవహారశైలి కారణంగా ఇరు దేశాల మధ్య కొన్ని అంశాల్లో సామరస్య పూర్వక వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని అంతర్జాతీయ వ్యవహారాలను పరిశీలించే లండన్ కాలేజీ ప్రొఫెసర్ హర్ష్ పంత్ అభిప్రాయపడ్డారు.
- సాక్షి నాలెడ్జ్ సెంటర్
Comments
Please login to add a commentAdd a comment