నల్లధనం వెల్లడికి స్విస్ ఆమోదం
2015 నాటి ఒప్పందం ఖరారు
బెర్న్/న్యూఢిల్లీ: మరో రెండేళ్లలో స్విస్ ఖాతాల్లో నల్లధనం దాచుకున్న అక్రమార్కుల వివరాలు బహిర్గతం కానున్నాయి. ఆ మేరకు నల్లధనం వివరాల్ని తక్షణం భారత్‌తో పంచుకునేలా ఆటోమెటిక్ సమాచార మార్పిడి ఒప్పందాన్ని శుక్రవారం స్విట్జర్లాండ్ అధికారికంగా ఖరారు చేసింది. వివరాలు ఎంత రహస్యం, భద్రంగా ఉంచాల్సినవైనా వాటిని భారత్‌కు అందించేందుకు ‘ఆటోమెటిక్ ఎక్సే్ఛంజ్ ఫైనాన్సి యల్ అకౌంట్’(ఏఈఓఐ) ఒప్పందం వీలుకల్పిస్తుంది.
పన్ను అంశాలపై కుదుర్చుకున్న అంతర్జాతీయ ఒప్పందం ‘ఏఈఓఐ’ అమలు వివరాల్ని స్విస్ ఫెడరల్ కౌన్సిల్ వెల్లడిస్తూ.. ‘ఈ సమాచార మార్పిడి 2018 నుంచి అమల్లోకి వస్తుంది. తొలి దశ వివరాల్ని 2019లో భారత్‌తో పంచుకోవచ్చ’ని పేర్కొంది. శుక్రవారం కౌన్సిల్ ఆమోదించిన ముసాయిదా నివేదిక ప్రకారం ‘తాజా నిర్ణయంపై ఇక రిఫరెండం ఉండదు. అందువల్ల ఒప్పందం అమలులో విధానపరంగా ఎలాంటి జాప్యం జరిగే అవకాశముండద’ని స్పష్టం చేశారు.
అన్నీ నిర్ధారించుకున్నాక.. అవసరమైతేనే: స్విట్జర్లాండ్
నల్లధనానికి సంబంధించిన సమాచారం ఆయా దేశాలకు అవసరమా? కాదా? అన్న విషయం సరిచూసుకున్నాకే ఫెడరల్ కౌన్సిల్ సమాచారాన్ని అందించనుంది. నల్లధనం వివరాలు తెలపాలంటూ చాలాకాలంగా స్విట్జర్లాండ్‌తో భారత్ చర్చలు కొనసాగిస్తోంది. ఏఈఓఐ ఒప్పందంఅమలుపై చర్చలు ఫలించడంతో నల్లధనం వెల్లడికి మార్గం సుగమమైంది.