Swiss accounts
-
ఆ ఖాతాల వివరాలు ఇవ్వలేం..చాలా గోప్యం
సాక్షి, న్యూఢిల్లీ: స్విస్ బ్యాంకుల్లో నల్లధనం దాచుకున్న భారతీయుల ఖాతాల వివరాలు వెల్లడి చేయలేనమని కేంద్ర ఆర్థికశాఖ తేల్చి చెప్పింది. సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆర్థికమంత్రిత్వ శాఖ ఇలా స్పష్టం చేసింది. భారత్, స్విట్జర్లాండ్ మధ్య ఉన్న ఒప్పందాల మేరకు ఈ వివరాలను అందించలేమని తెలిపింది. అలాగే ఇతర విదేశీ దేశాలనుంచి వచ్చిన నల్లధనం వివరాలను వెల్లడించడానికి కూడా మంత్రిత్వ శాఖ నిరాకరించింది. గోప్యతా నిబంధనలపై స్విట్జర్లాండుతో కుదిరిన ఒప్పందం నేపథ్యంలో ఈ వివరాలు ఇవ్వలేమని చెప్పింది. రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం సంబంధిత సమాచారం గోప్యంగా ఉంచాల్సి ఉందని తెలిపింది. పన్ను సంబంధిత సమాచారం, విదేశీ ప్రభుత్వాల నుండి కోరిన / పొందిన సమాచారాన్ని బహిర్గతం చేయలేమంది. స్విట్జర్లాండ్ బ్యాంకుల్లోని భారతీయుల ఖాతాలకు సంబంధించిన నుంచి వచ్చిన సమాచార వివరాలను అందించాలని పీటీఐకి జర్నలిస్టు మంత్రిత్వ శాఖను కోరారు. ఈ వివరాలతో సహా నల్లధనంపై విదేశాల నుండి వచ్చిన సమాచారం వివరాలను అందించాలని కూడా ఆర్టీఐ ద్వారా కోరారు. దీనికి ప్రతిస్పందనగా ఈ విషయాన్ని ఆర్థిక శాఖ వెల్లడించింది. -
వీడనున్న ‘స్విస్’ లోగుట్టు
న్యూఢిల్లీ: స్విట్జర్లాండ్‌లోని బ్యాంకుల్లో భారతీయులకు సంబంధించిన ఖాతాల వివరాలు నేటి నుంచి భారతీయ పన్ను అధికారులకు అందుబాటులోకి రానున్నాయి. ఇరుదేశాల ఆటోమేటిక్ సమాచార మార్పిడి ఒప్పందం ఆదివారం నుంచి అమల్లోకి రానుండటంతో స్విస్ ఖాతాల వివరాలు భారత్‌కు తెలియనున్నాయి. నల్లధనంపై ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి ఇది దోహదపడుతుందని, దీంతో స్విస్ బ్యాంకుల లోగుట్టు శకం ఎట్టకేలకు ముగిసినట్లు అవుతుందని కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (సీబీడీటీ) తెలిపింది. దీనిపై సీబీడీటీ ఆదాయపు పన్ను విభాగానికి ఓ విధానాన్ని రూపొందించింది. స్విట్జర్లాండ్ అంతర్జాతీయ ఫైనాన్స్ విభాగానికి చెందిన ఉన్నతాధికారి నికోలస్ మారియో ఈనెల 29, 30 తేదీల్లో భారత రెవెన్యూ కార్యదర్శి ఏబీ పాండే, సీబీడీటీ చైర్మన్ పీసీ మోదీలతో భేటీ అయి దీనిపై చర్చించారు. ఆర్థిక ఖాతాల సమాచార మార్పిడి కార్యక్రమం సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వస్తుందని చెప్పారు. పన్నుకు సంబంధించిన భారత్ కోరిన కొన్ని ప్రత్యేక కేసుల సమాచార మార్పిడి ప్రక్రియను వేగవంతం చేయడంపైనా ఇరుదేశాల అధికారులు చర్చించారు. స్విట్జర్లాండ్‌లో 2018 సంవత్సరంలో భారతీయులు నిర్వహించిన అన్ని ఆర్థిక లావాదేవీల వివరాలను భారత్ అందుకుంటుందని సీబీడీటీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇందులో 2018లో క్లోజ్ అయిన ఖాతాల వివరాలు కూడా ఉంటాయని తెలిపింది. -
స్విస్ షాక్ : రూ.283 కోట్లు ఫ్రీజ్
సాక్షి, న్యూఢిల్లీ : పీఎన్బీ కుంభకోణం విచారణలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వేల కోట్లకు పంజాబ్ నేషనల్ బ్యాంకును ముంచేసి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి స్విస్ అధికారులు భారీ షాకిచ్చారు. కోట్ల రూపాయల విలువైన వివిధ బ్యాంకు ఖాతాలను సీజ్ చేశారు. పీఎన్బీ స్కాంను విచారిస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విజ్ఞప్తి మేరకు వారు ఈ చర్య చేపట్టారు. మనీలాండరింగ్ నివారణ (పిఎంఎల్ఎ) చట్టం కింద ఈడీ అభ్యర్థన మేరకు స్విట్జర్లాండ్‌లోని నాలుగు బ్యాంకు ఖాతాలను అక్కడి అధికారులు సంభింపచేశారు. నీరవ్‌మోదీ, ఆయన సోదరి పుర్వీ మోదీకు చెందిన ఖాతాలతో సహా మొత్తం నాలుగు అకౌంట్లలోని రూ. 283.16 కోట్ల రూపాయలను స్విస్ అధికారులు ఫ్రీజ్ చేశారు. భారతీయ బ్యాంకుల నుండి అక్రమంగా స్విస్ బ్యాంకు ఖాతాల్లో మళ్లించారని స్విస్ అధికారులకు ఈడీ తెలిపింది. కాగా లెటర్స్ ఆఫ్ అండర్‌టేకింగ్ (ఎల్‌ఒయు) ద్వారా పీఎన్బీలో రూ. 14వేల కోట్ల మేర అక్రమాలకు పాల్పడ్డాడు. ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చీ రాగానే నీరవ్‌మోదీ, బంధువులతో సహా లండన్‌కు పారిపోయాడు. దీనిపై కేసు నమోదు చేసిన ఈడీ, సీబీఐ దర్యాప్తును కొనసాగిస్తున్నాయి. అటు భారత ప్రభుత్వం నీరవ్ పాస్‌పోర్టును రద్దు చేసింది. రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసిన సీబీఐ లండన్ పోలీసుల సహాయంతో, ఈ ఏడాది మార్చి నెలలో మోదీని అరెస్టు చేసింది. వాండ్స్‌వర్త్ జైలులో ఉన్న మోదీ బెయిల్ పిటిషన్లను పలుసార్లు లండన్ కోర్టు తిరస్కరించింది. ఆర్థికనేరగాళ్ల చట్టం కింద మోదీని స్వదేశానికి రప్పించేందుకు భారత ప్రభుత్వం తీవ్రంగా ప్రయ్నత్నిస్తోంది. మరోవైపు ఇదే కేసులో మరో కీలక నిందితుడు, నీరవ్ మోదీ మామ మెహుల్ చోక్సీ కూడా ఆంటిగ్వాకు పారిపోయాడు. అయితే చోక్సీని అప్పగించేందుకు తాము సిద్దంగా ఉన్నామని ఆంటిగ్వా ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. -
స్విస్ మనీపై పియూష్ స్పందన
సాక్షి,న్యూఢిల్లీ: స్విస్ బ్యాంకుల్లో భారతీయుల డిపాజిట్లు భారీగా పుంజుకోవడంపై ఆర్థికశాఖ ఇంచార్జ్‌గా ఉన్న కేంద్ర మంత్రి పియూష్ గోయల్ తొలిసారి స్పందించారు. ఈ మొత్తం డిపాజిట్లు నల్ల ధనమే అవుతుందని ఎలా భావిస్తామంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కానీ స్విస్ బ్యాంకుల్లో అక్రమ డిపాజిట్ దారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా స్విట్జర్లాండ్ నుంచి బ్యాంకు ఖాతాల వివరాల సేకరణ ప్రారంభించనున్నట్లు ఆయన చెప్పారు. ఈ సంవత్సరాంతానికి తుది సమాచారం ప్రభుత్వానికి అందుతుందని తెలిపారు. స్విస్‌బ్యాంకుల్లో భారతీయుల డిపాజిట్ల మొత్తాన్ని నల్లధనమా, లేక అక్రమ లావాదేవీయా అనేది ఇపుడే నిర్ధారించలేమంటూ చెప్పొకొచ్చారు. స్విస్ ప్రభుత్వం 2018 జనవరి 1 నుంచి డిసెంబర్ 31, 2018 వరకు మొత్తం డేటాను అందజేస్తుందనీ, దాని ప్రకారం పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు. . ఇందులో సుమారు 40 శాతం లిబరైజ్డ్ రెమిట్టెన్స్ పథకం (ఎల్ఆర్ఎస్) కారణంగా నెలకొన్న డిపాజిట్లేనని గోయల్ చెప్పారు. ఒక వ్యక్తి సంవత్సరానికి 2,50,000 డాలర్లు డిపాజిట్ చేసుకునే అవకాశం కల్పించే ఎల్ఆర్ఎస్ పథకాన్ని మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం ప్రవేశపెట్టిందేనని గుర్తు చేశారు. నల్లధనాన్ని అడ్డుకునేందుకు గత మూడేళ్లలో తమ ప్రభుత్వం తీసుకున్న వివిధ చర్యల మూలంగా స్విస్ బ్యాంక్ డిపాజిట్లు తగ్గుముఖం పడుతున్నాయన్నారు. -
నల్లధనం వెల్లడికి స్విస్ ఆమోదం
2015 నాటి ఒప్పందం ఖరారు బెర్న్/న్యూఢిల్లీ: మరో రెండేళ్లలో స్విస్ ఖాతాల్లో నల్లధనం దాచుకున్న అక్రమార్కుల వివరాలు బహిర్గతం కానున్నాయి. ఆ మేరకు నల్లధనం వివరాల్ని తక్షణం భారత్‌తో పంచుకునేలా ఆటోమెటిక్ సమాచార మార్పిడి ఒప్పందాన్ని శుక్రవారం స్విట్జర్లాండ్ అధికారికంగా ఖరారు చేసింది. వివరాలు ఎంత రహస్యం, భద్రంగా ఉంచాల్సినవైనా వాటిని భారత్‌కు అందించేందుకు ‘ఆటోమెటిక్ ఎక్సే్ఛంజ్ ఫైనాన్సి యల్ అకౌంట్’(ఏఈఓఐ) ఒప్పందం వీలుకల్పిస్తుంది. పన్ను అంశాలపై కుదుర్చుకున్న అంతర్జాతీయ ఒప్పందం ‘ఏఈఓఐ’ అమలు వివరాల్ని స్విస్ ఫెడరల్ కౌన్సిల్ వెల్లడిస్తూ.. ‘ఈ సమాచార మార్పిడి 2018 నుంచి అమల్లోకి వస్తుంది. తొలి దశ వివరాల్ని 2019లో భారత్‌తో పంచుకోవచ్చ’ని పేర్కొంది. శుక్రవారం కౌన్సిల్ ఆమోదించిన ముసాయిదా నివేదిక ప్రకారం ‘తాజా నిర్ణయంపై ఇక రిఫరెండం ఉండదు. అందువల్ల ఒప్పందం అమలులో విధానపరంగా ఎలాంటి జాప్యం జరిగే అవకాశముండద’ని స్పష్టం చేశారు. అన్నీ నిర్ధారించుకున్నాక.. అవసరమైతేనే: స్విట్జర్లాండ్ నల్లధనానికి సంబంధించిన సమాచారం ఆయా దేశాలకు అవసరమా? కాదా? అన్న విషయం సరిచూసుకున్నాకే ఫెడరల్ కౌన్సిల్ సమాచారాన్ని అందించనుంది. నల్లధనం వివరాలు తెలపాలంటూ చాలాకాలంగా స్విట్జర్లాండ్‌తో భారత్ చర్చలు కొనసాగిస్తోంది. ఏఈఓఐ ఒప్పందంఅమలుపై చర్చలు ఫలించడంతో నల్లధనం వెల్లడికి మార్గం సుగమమైంది.