
సాక్షి,న్యూఢిల్లీ: స్విస్ బ్యాంకుల్లో భారతీయుల డిపాజిట్లు భారీగా పుంజుకోవడంపై ఆర్థికశాఖ ఇంచార్జ్‌గా ఉన్న కేంద్ర మంత్రి పియూష్ గోయల్ తొలిసారి స్పందించారు. ఈ మొత్తం డిపాజిట్లు నల్ల ధనమే అవుతుందని ఎలా భావిస్తామంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కానీ స్విస్ బ్యాంకుల్లో అక్రమ డిపాజిట్ దారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా స్విట్జర్లాండ్ నుంచి బ్యాంకు ఖాతాల వివరాల సేకరణ ప్రారంభించనున్నట్లు ఆయన చెప్పారు. ఈ సంవత్సరాంతానికి తుది సమాచారం ప్రభుత్వానికి అందుతుందని తెలిపారు.
స్విస్‌బ్యాంకుల్లో భారతీయుల డిపాజిట్ల మొత్తాన్ని నల్లధనమా, లేక అక్రమ లావాదేవీయా అనేది ఇపుడే నిర్ధారించలేమంటూ చెప్పొకొచ్చారు. స్విస్ ప్రభుత్వం 2018 జనవరి 1 నుంచి డిసెంబర్ 31, 2018 వరకు మొత్తం డేటాను అందజేస్తుందనీ, దాని ప్రకారం పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు. . ఇందులో సుమారు 40 శాతం లిబరైజ్డ్ రెమిట్టెన్స్ పథకం (ఎల్ఆర్ఎస్) కారణంగా నెలకొన్న డిపాజిట్లేనని గోయల్ చెప్పారు. ఒక వ్యక్తి సంవత్సరానికి 2,50,000 డాలర్లు డిపాజిట్ చేసుకునే అవకాశం కల్పించే ఎల్‌ఆర్‌ఎస్ పథకాన్ని మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం ప్రవేశపెట్టిందేనని గుర్తు చేశారు. నల్లధనాన్ని అడ్డుకునేందుకు గత మూడేళ్లలో తమ ప్రభుత్వం తీసుకున్న వివిధ చర్యల మూలంగా స్విస్ బ్యాంక్ డిపాజిట్లు తగ్గుముఖం పడుతున్నాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment