ఆ డిపాజిట్లు.. నల్లధనమేనా?
- సుమారు నాలుగు లక్షల కోట్లపై ఐటీ నజర్
-
పన్ను ఎగవేతలపై ముమ్మరంగా దర్యాప్తు
న్యూఢిల్లీ: రూ. 500, వెయ్యినోట్లను రద్దుచేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత దేశవ్యాప్తంగా బ్యాంకులలో నమోదైన డిపాజిట్లపై ఆదాయపన్ను శాఖ (ఐటీ) నజర్ పెట్టింది. నోట్ల ద్దు తర్వాత 50రోజుల గడువులోగా డిపాజిట్ అయిన మొత్తాలను సమగ్రం విశ్లేషిస్తోంది. దేశవ్యాప్తంగా డిపాజిట్ అయిన పాత నగదులో రూ. 3 నుంచి నాలుగు లక్షల కోట్లు పన్ను ఎగ్గొట్టిన ధనం ఉండవచ్చునని ఐటీ నిపుణులు భావిస్తున్నారు. ఈ నాలుగు లక్షల కోట్ల డిపాజిట్ల వివరాలు పరిశీలించి.. ఆయా డిపాజిటర్లకు నోటీసులు పంపాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు ఇచ్చినటు ఐటీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
'నోట్ల రద్దు తర్వాత దాదాపు 60 లక్షల బ్యాంకు ఖాతాలలో రూ. 2 లక్షలకు మించి డిపాజిట్లు నమోదయ్యాయి. వీటి వివరాలన్నీ విశ్లేషించగా.. నిశితంగా ఈ పరిశీలంచగా.. ఈ 60 లక్షల ఖాతాలలో రూ. 7.34 లక్షల నగదు డిపాజిట్ అయినట్టు తేలింది. ఇక ఈశాన్య రాష్ట్రాలలోని వివిధ బ్యాంకు ఖాతాలలో ఏకంగా రూ. 10,700 కోట్ల అనుమానిత డిపాజిట్లు నమోదైనట్టు ఐటీ గుర్తించింది. సహకార బ్యాంకులలో డిపాజిట్ అయిన రూ. 16వేల కోట్లపైనా ఐటీ, ఈడీ అధికారులు విచారణ జరుపుతున్నారు' అని ఆయన వివరించారు. ఇక ఎప్పుడూ నిష్క్రియాత్మకంగా ఉండే ఖాతాలలో ఏకంగా రూ. 25వేల కోట్ల డిపాజిట్ అయ్యాయని ఆయన చెప్పారు. ఇక, నవంబర్ 8న జరిగిన నోట్ల రద్దు తర్వాత ఏకంగా రూ. 80వేల కోట్లు రుణాలు బ్యాంకులకు తిరిగి చెల్లించడం జరిగిందని ఆ అధికారి పీటీఐకి తెలిపారు.