ఇస్లామాబాద్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ విమర్శలు గుప్పించారు. శాంతినే కోరుకుంటామని చెప్పుకునే బీజేపీ ప్రభుత్వం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పాకిస్తాన్ ప్రతిపాదనను పట్టించుకోవడం లేదని అన్నారు. శాంతి చర్చలకు ఆహ్వానించినా స్పందించడం లేదని చెప్పారు. ‘బీజేపీ ప్రభుత్వం ముమ్మాటికీ ముస్లిం వ్యతిరేకి, పాకిస్తాన్ వ్యతిరేకి’ అని మండిపడ్డారు. సార్వత్రిక ఎన్నికలు ముగిశాక తిరిగి శాంతి చర్చల విషయమై భారత్‌ను తిరిగి సంప్రదిస్తామని అన్నారు. అమెరికాకు చెందిన ఓ వార్త చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇమ్రాన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ముంబయ్ దాడులకు సంబంధించిన కేసుపై కూడా పాక్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఆగస్టులో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే.. నరేంద్రమోదీతో శాంతి చర్చలకు సుముఖంగా ఉన్నట్టు ఇమ్రాన్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇదిలాఉండగా.. సెప్టెంబర్ మాసంలో న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ఇరు దేశాల విదేశాంగ శాఖ మంత్రుల మధ్య శాంతి చర్చలు జరగాల్సి ఉండగా ఊహించని పరిణామాల నేపథ్యంలో రద్దయ్యాయి. చర్చలకు ముందురోజు జమ్మూ, కశ్మీర్‌లో ఓ భారత జవాన్‌ను ఉగ్రవాదులు హతమార్చడంతో ఆ చర్చలు రద్దయ్యాయి. ఓ పక్క చర్చలంటూ.. మరోపక్క తీవ్రవాదంతో రగులుతున్న పాకిస్తాన్‌తో చర్చలు జరిపేదిలేదంటూ భారత్ స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment