ఇండియాలా మనకెందుకు సాధ్యం కాదు: ట్రంప్
వాషింగ్టన్: అమెరికాలో ఆర్థికాభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ప్రస్తుత అధ్యక్షుడు బరాక్ ఒబామాపై రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ మరోసారి విమర్శలు గుప్పించారు. ఓ పక్క భారత్, చైనా లాంటి దేశాలు 8 శాతం, 7 శాతం వృద్ధితో దూసుకుపోతుంటే అమెరికా అది ఎందుకు సాధ్యం కాలేదని ప్రశ్నించారు. మాంచెస్టర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన ప్రసంగించారు. ఒక సంవత్సరంలో కనీసం మూడు శాతం వృద్ధి కూడా సాధించలేక పోయారని.. అది ఒక్క ఒబామా పాలనలోనే అని అన్నారు. ఈ ఏడాది మూడవ త్రైమాసికంలో ఫలితాలు భయానకంగా ఉన్నాయని ట్రంప్ చెప్పారు.
తాను అధికారంలోకి వస్తే నాలుగు శాతం ఆర్థిక వృద్ధి సాధించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అమెరికా ఆర్థికంగా ఉన్నతమైన దేశంగా మళ్లీ అవతరించాల్సిన అవసరం ఆసన్నమైందన్నారు. హిల్లరీ నిర్ణయాల కారణంగా దేశంలో ఐఎస్‌ఐఎస్ ప్రాభల్యం మరింత పెరుగుతుందని.. ఇప్పటికే కొందరు ఉగ్రవాదులు దేశంలో తిష్టవేసి ఉన్నారని పేర్కొన్నారు. సిరియా శరణార్థుల విషయంలోనూ ఆమె నిర్ణయాలు దేశానికి ముప్పు తెచ్చేలా ఉన్నాయని ట్రంప్ వివరించారు.