చవకబారు ఎత్తుగడలు
డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించి ఆరునెలలు పూర్తయింది. ఎన్నికల ప్రచారంలోనూ, అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాతా ఆయన చాలా వాగ్దా నాలే చేశారు. అందులో పేద వర్గాలకు ఉపయోగపడుతూ ‘ఒబామా కేర్’గా ప్రసిద్ధి చెందిన ఆరోగ్య పరిరక్షణ చట్టం రద్దు ప్రధానమైనది. మరొకటి ఇరాన్‌తో కుదిరిన అణు ఒప్పందం రద్దు. సామాన్య పౌరులు చెల్లిస్తున్న పన్నుల్లో కోత పెడతానని, సంపన్న వర్గాలపై ఉన్న పన్నుల్ని పెంచుతానని హామీ ఇచ్చారు. అమెరికాలోని ప్రముఖ సంస్థలన్నీ స్థానికులకే ఉద్యోగాలిచ్చేలా బలవంతంగా ఒప్పించానన్నారు. వీటిల్లో ఇంతవరకూ ఏ ఒక్కటీ నెరవేరలేదు.
‘ఒబామా కేర్’ రద్దుకు చేసిన ప్రయత్నం రెండోసారి కూడా విఫలమైంది. ఒబామా హయాంలో ఇరాన్‌తో కుదిరిన అణు ఒప్పందాన్ని రద్దు చేసేందుకు చేసిన ప్రయత్నాలకు ఒకసారి కాదు... రెండుసార్లూ ఆ గతే పట్టింది. సామాన్య పౌరులకు పన్నుల భారం తగ్గలేదు. సంపన్నులకు అదనపు పన్నులు వచ్చిపడలేదు. జీఎం, ఫోర్డ్, కారియర్‌లాంటి ప్రముఖ సంస్థలు చాలా ఉద్యోగాలను మెక్సికో, చైనాలకు తర లించాయి. ఇన్ని రకాలుగా విఫలమైన ట్రంప్ తన చేతగానితనాన్ని కప్పిపుచ్చు కునేందుకు ఇరాన్‌పై అమల్లో ఉన్న ఆంక్షల జాబితాను మరింత పెంచారు. ‘విద్వే షపూరిత కార్యకలాపాలు’ సాగిస్తున్నందుకు ఈ కొత్త ఆంక్షలు విధిస్తున్నట్టు ప్రక టించారు. ఈ తాజా ఆంక్షల కారణంగా మన దేశంతోసహా పలు దేశాలు ఇరాన్‌తో సాగిస్తున్న వ్యాపార కార్యకలాపాలకు ఇబ్బందులెదురవుతాయి.
దాదాపు 3 కోట్ల మంది వరకూ లబ్ధి పొందుతున్న ఆరోగ్య పరిరక్షణ చట్టం అంటే ట్రంప్‌కు, పాలక రిపబ్లికన్ పార్టీకి మొదటినుంచీ మంట. తాను తీసుకు రాదల్చుకున్న కొత్త చట్టంతో పౌరులందరికీ తక్కువ వ్యయంతో ఆరోగ్య బీమా అందుబాటులోకొస్తుందని ఎన్నికల ప్రచార సమయంలో ట్రంప్ ఊదరగొట్టారు. అధ్యక్షుడైన కొత్తలోనూ ఆ మాటే అన్నారు. అయితే ఆయన ప్రభుత్వం రూపొందించిన బిల్లు ఉన్న లబ్ధిదారులకు ఎసరు తీసుకురావడంతోపాటు దాన్ని మరింత ఖరీదైన వ్యవహారంగా మారుస్తున్నది. ఇది గనుక చట్టమైతే తమ పార్టీకి అప్రదిష్ట తప్పదని గ్రహించిన అధికార రిపబ్లికన్ పార్టీ సభ్యులు కొందరు డెమొక్రటిక్ సభ్యులతో కలిసి దానికి వ్యతిరేకంగా ఓటేశారు. ఫలితంగా వరసగా రెండో సారి కూడా సెనేట్‌లో ట్రంప్‌కు భంగపాటు తప్పలేదు. కానీ ఇక్కడితో ఆయన వదిలేలా లేరు. చట్టాన్ని రద్దు చేయడం తథ్యమని, అందుకోసం కొత్త వ్యూహాన్ని రూపొందిస్తానని చెబుతున్నారు. ట్రంప్ వ్యూహం బహిరంగమే. పాత చట్టం వచ్చే రెండేళ్లలో రద్దయ్యేలా బిల్లు తీసుకొచ్చి ఆమోదం పొందితే...ఆ తర్వాత తీరిగ్గా కొత్త చట్టానికి సంబంధించిన బిల్లు తీసుకురావచ్చునని ట్రంప్ ఆలోచిస్తున్నారు. పాత చట్టం రద్దయి, కొత్తది అమల్లోకి వచ్చే విధంగా రూపొందిన ప్రస్తుత బిల్లుకు బదులు ఇలా చేస్తే సమస్య ఉండదని ఆయన భావన.
కానీ ఈ చర్య వల్ల బీమా సంస్థల్లో అనిశ్చితి ఏర్పడుతుందని, ఆరోగ్య సేవలపై తీవ్ర ప్రభావం చూపు తుందని, ఫలితంగా సామాన్య పౌరుల్లో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతాయని రిపబ్లికన్‌లు కొందరు ఆందోళనపడ్డారు. అందువల్లే చివరి నిమిషంలో బిల్లును వ్యతిరేకిస్తున్నామని ప్రకటించారు. నిజానికి కొత్త బిల్లుపై అమెరికన్ పౌరుల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. కేవలం 17శాతంమంది మాత్రమే దానికి అనుకూలమని సర్వేలో తేలింది. ఒమామా కేర్ చట్టం రద్దుకు ఇంతగా తహతహలాడటం వెనక ట్రంప్‌కు వేరే ప్రయోజనాలున్నాయి. చట్టం రద్దయితే పన్ను సంస్కరణలు, మౌలిక సదుపాయాల ప్రక్షాళన వంటివి ప్రారంభించాలన్నది ఆయన ఆలోచన. పన్ను సంస్కరణల కోసం సంపన్న వర్గాలనుంచి ఒత్తిళ్లు వస్తున్నాయి. ఇంకా పన్నులెందుకు తగ్గించరని సామాన్యులు అడుగుతున్నారు.
ఇరాన్‌తో ఒబామా హయాంలో కుదిరిన అణు ఒప్పందంపై రిపబ్లికన్లు మొదటినుంచీ మండిపడుతున్నారు. తాము అధికారంలోకొస్తే దాన్ని రద్దు చేస్తా మని పలుమార్లు ప్రకటించారు. అయితే అదంత సులభం కాదు. ఒప్పందంలో అమెరికా, ఇరాన్‌లు మాత్రమే కాదు... రష్యా, జర్మనీ, ఫ్రాన్స్ తదితర దేశాలు కూడా ఉన్నాయి. ఏకపక్షంగా దాన్నుంచి తప్పుకోవడం వల్ల వెనువెంటనే యూరప్ దేశాలతో అమెరికాకు సమస్యలొచ్చిపడతాయి. ఇరాన్‌తో ఆర్ధిక సంబంధాలు మెరుగుపరుచుకోవాలని ఆ దేశాలు తహతహలాడుతున్నాయి. పైగా ఇరాన్ ఒప్పందంలోని షరతులకు అనుగుణంగా నడుచుకుని తన అణు కార్యక్రమాలను నిలిపేసిందని బలంగా నమ్ముతున్నాయి. కేవలం ఇజ్రాయెల్‌ను సంతోషపెట్టడం కోసం ట్రంప్ దీన్ని రద్దు చేయాలని చూస్తున్న సంగతి వాటికి తెలుసు. ఒప్పందం రద్దు కావాలంటే ఇరాన్ పాత దోవన వెళ్తున్నట్టు నిర్ధారణ కావాలి. మూడు నెలలకోసారి అమెరికా భద్రతా విభాగం జరిపే సమీక్ష దాన్ని నిర్ణయిస్తుంది. అయితే ఇరాన్‌వైపు ఉల్లంఘనలేమీ లేవని అది నిర్ధారించుకుంది. అందువల్లే అకారణంగా ఒప్పందాన్ని రద్దు చేసుకుంటే యూరప్ దేశాలతో ఉన్న సంబంధాలు దెబ్బతింటాయని, అది దేశ ప్రయోజనాలకు హాని కలిగిస్తుందని ఉన్నతాధికారులు ట్రంప్‌కు నచ్చజెప్పారు. మూడు నెలలక్రితం కూడా అదే జరిగింది. అందువల్లే అప్పుడూ, ఇప్పుడూ కూడా ఒప్పందం కొనసాగింపుపై ట్రంప్ అయిష్టంగా సంతకం చేస్తూనే అదనపు ఆంక్షలు తీసుకొచ్చారు.
ఇందు వల్ల ఇరాన్ తనంతతానే ఒప్పందానికి దూరమవుతుందని ఆయన ఎత్తు గడ. ట్రంప్‌కూ, ఆయన సన్నిహిత దేశాలైన ఇజ్రాయెల్, సౌదీలకూ ఎంత నచ్చకపోయినా ఇరాన్ పశ్చిమాసియాలో ఇప్పుడు తిరుగులేని శక్తి. ఇరాక్‌లో ఐఎస్‌పై ఏళ్ల తరబడి పోరాడి, అనేక నష్టాలు చవిచూసి అమెరికా చేతులెత్తేస్తే... ఇరాన్ స్వల్ప వ్యవధిలో దానిపై విజయం సాధించి తనేమిటో నిరూ పించుకుంది. ఇంటా బయటా ట్రంప్ చేస్తున్న ఈ విచిత్ర విన్యాసాలకు కళ్లెం పడకపోతే అమెరికా ప్రతిష్ట ఇంకా దిగజారుతుంది. ఆ సంగతి అమెరికా పౌరులు తెలుసుకోవాలి.