న్యూయార్క్: కరీబియన్ దేశాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులకు భారత్ తనవంతు సాయంగా సుమారు రూ.100కోట్ల ఆర్థిక సాయం ప్రకటించింది. సౌరశక్తి, ఇతర సంప్రదాయేతర ఇంధన వనరుల పనులకుగాను మరో రూ.1000 కోట్ల రుణాలు కల్పించనున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. బుధవారం న్యూయార్క్‌లో కరీబియన్ దేశాల సమాఖ్య ‘కరికామ్’తో మోదీ భేటీ అయ్యారు. భారత్‌లో తొలి ‘కరికామ్’ సమావేశంలో మోదీతోపాటు సెయింట్ లూసియా ప్రధాని, కరికామ్ ఛైర్మన్ అలెన్ ఛాస్టెనెట్‌లు పాల్గొన్నారు. భారత్ సాయం ఇరు పక్షాల మధ్య ఉన్న సంబంధాలను ఉన్నతస్థానానికి తీసుకెళ్తుందని అలెన్ వ్యాఖ్యానించారు. గయానాలో ఐటీ రంగంలో ప్రాంతీయ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఏర్పాటు, బెలీజ్‌లో ప్రాంతీయ వృత్తి శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసేందుకు ప్రధాని అంగీకరించినట్లు కరికామ్ ఓ ప్రకటనలో పేర్కొంది. సదస్సు సందర్భంగా మోదీ మాట్లాడారు. కరీబియన్ దేశాలతో ఆర్థిక, రాజకీయ సాంస్కృతిక సంబంధాలను దృఢం చేసుకునేందుకు భారత్ సిద్ధంగా ఉందన్నారు.
ఇరాన్ అధ్యక్షుడితో మోదీ భేటీ: ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహనితో న్యూయార్క్‌లో గురువారం ప్రధాని మోదీ సమావేశమయ్యారు. ప్రాంతీయ పరిస్థితులు, ద్వైపాక్షిక సహకారంపై ఇరువురు నేతలు చర్చించారు. ఐక్యరాజ్య సమితి సాధారణ సభ సమావేశాల నేపథ్యంలో ఈ భేటీ జరిగింది. ఇరాన్, అమెరికాల మధ్య విబేధాలు తీవ్రస్థాయిలో ఉన్న పరిస్థితుల్లో ఈ భేటీ జరగడం విశేషం. సౌదీ అరేబియాలోని చమురు క్షేత్రాలపై దాడులకు ఇరానే కారణమని అమెరికా ఆరోపిస్తోంది. ‘ఇరువురు నేతలు ద్వైపాక్షిక సహకారం, ప్రాంతీయ స్థితిగతులపై చర్చించారు’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ తెలిపారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సు సందర్భంగా కిర్గిజిస్తాన్‌లో ఈ జూన్‌లోనే మోదీ, రౌహనీల మధ్య భేటీ జరగాల్సి ఉన్నా, ఇతర కారణాల వల్ల అది సాధ్యం కాలేదు. ఇటీవలి కాలం వరకు ఇరాక్, సౌదీ అరేబియాల తరువాత ఇరాన్ నుంచే భారత్ ఎక్కువగా చమురును దిగుమతి చేసుకుంటూ ఉండేది.
కరీబియన్ దీవులకు వంద కోట్లు
Published Fri, Sep 27 2019 1:52 AM | Last Updated on Fri, Sep 27 2019 5:34 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment