‘భారత్, అమెరికా కలిస్తే అద్భుతాలే’
వాషింగ్టన్: ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలైన భారత్, అమెరికా పరస్పరం సహకరించుకుంటే ఎన్నో అద్భుతాలను సాధించవచ్చని వైట్‌హౌస్ పేర్కొంది. ఇది ఆ రెండు దేశాలకే కాక మొత్తం ప్రపంచానికి ఎంతో మేలు చేస్తుందని తెలిపింది. లావోస్‌లో 14వ భారత్–ఆసియాన్ సదస్సు, 11వ తూర్పు ఆసియా సదస్సు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమావేశమైన వారం తర్వాత వైట్‌హౌస్ ఈ మేరకు ఒక ప్రకటన చేసింది.
వైట్‌హౌస్ ప్రెస్ సెక్రెటరీ జోష్ ఎర్నెస్ట్ విలేకరులతో మాట్లాడుతూ.. అనేక కీలకాంశాలపై కలసి పనిచేసే అవకాశం ఇరు దేశాలకు ఉందని చెప్పారు. పారిస్ వాతావరణ ఒప్పందంపై ఏకాభిప్రాయం సాధించే విషయంలో అంతర్జాతీయంగా అనేక సందేహాలు వచ్చాయని, అయితే భారత్ నిర్మాణాత్మకమైన పాత్ర పోషించడంతో దానిపై ఏకాభిప్రాయం వచ్చిందని తెలిపారు.
ఇది ప్రధాని మోదీ సాధించిన ఘనత అని, వాతావరణ ఒప్పందంపై ఒబామాతో పాటు ప్రపంచ దేశాల అధినేతలతో నిరంతరం మోదీ సంప్రదింపులు జరపడం వల్లే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. భారత, అమెరికా సంబంధాలు మోదీ, ఒబామా నాయకత్వంలో మరింత బలోపేతం కావడాన్ని అమెరికా అధ్యక్షుడు గర్వంగా భావిస్తున్నారని చెప్పారు.