న్యూజిలాండ్‌కు పాకిన విద్వేషం
భారతీయుణ్ని దేశం నుంచి వెళ్లిపోవాలన్న స్థానికుడు
► అసభ్య పదజాలంతో దూషణ
► తరచూ ఇలాంటివి జరుగుతున్నాయని భారతీయుల ఆవేదన
అక్లాండ్: అమెరికాలో భారతీయులపై జరుగుతున్న విద్వేషపూరిత ఘటనలు ఇప్పుడు న్యూజిలాండ్‌కు పాకాయి. అక్లాండ్‌లో ఓ సిక్కు జాతీయుడిపై స్థానికుడు గతవారం చేసిన జాత్యహంకార వ్యాఖ్యలు ఆలస్యంగా బయటకు వచ్చాయి. అక్లాండ్‌లో ఉండే నరీందర్వీర్ సింగ్ పార్కింగ్‌లో నుంచి కారు తీస్తుండగా ఓ జంట కారులో వచ్చింది. వీరు వెళ్లిపోయేందుకు తను దారి ఇచ్చినప్పటికీ.. కారు నడుపుతున్న వ్యక్తి అసభ్య పదజాలంతో దూషిస్తూ దేశం విడిచి వెళ్లాలని బెదిరించాడని నరీందర్వీర్ వాపోయారు.
‘వారు వెళ్లేందుకు నేను పక్కకు తప్పుకున్నా. కారులోని మహిళ నావైపు వేలు చూపించింది. కారులోని వ్యక్తి నన్ను దూషిస్తూ.. అసభ్యంగా దూషించాడు. ఈ మొత్తాన్ని నేను వీడియో తీశాను. దీంతో అతడు మరింత రెచ్చిపోయి తిట్టాడు. మీ దేశానికి వెళ్లిపోండంటూ బెదిరించాడు. పంజాబీల గురించి చాలా అవమానంగా మాట్లాడాడు’ అని నరీందర్వీర్ తెలిపారు. ఇంతటితో అయిపోయింది కదా అని వెళ్లిపోతుంటే.. అదే జంట రోడ్డు పక్కన కారు ఆపుకుని మరీ మరోసారి తనపై మాటలతో దాడి చేశారని నిగ్గర్ (నల్లజాతీయులు) వెళ్లిపో అని బెదిరించాడని నరీందర్వీర్ వెల్లడించారు.
మరోఘటనలోనూ..: న్యూజిలాండ్‌లో జరిగిన మరో ఘటనలోనూ విక్రమ్‌జిత్ సింగ్ అనే యువకుడిపైనా స్థానికుడొకరు అసభ్యంగా మాట్లాడారు. న్యూజిలాండ్‌లో ఎంత వేగంగా నడపాలో తెలియదా అని గద్దించిన స్థానికుడు.. మీ దేశానికి వెళ్లిపోండి అని బెదిరించాడు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడయ్యాక న్యూజిలాండ్‌లో ఇలాంటి ఘటనలు తరచు ఎదుర్కొనాల్సి వస్తోందని అక్కడి భారతీయలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మా ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు
ఒహయోలో విద్వేషపు వీడియో
న్యూయార్క్: అమెరికాలో భారతీయులపై దాడులను మరువకముందే మరో విద్వేష వీడియో నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. ‘భారత సంతతి ప్రజలు ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు. ఇక్కడ ఉండే మధ్య, ఎగువమధ్య తరగతి అమెరికన్లు ఏమైపోయారు? ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వస్తోంది’ అంటూ స్టీవ్ పుషర్ (66) అనే ప్రోగ్రామర్ ఒహయో పార్క్‌లో రహస్యం గా చిత్రించిన వీడియోను సేవ్‌అమెరికన్ ఐటీజాబ్స్ అనే జాత్యహంకార వెబ్‌సైట్‌లో పోస్ట్ చేశాడు.
ఈ వీడియోలో పార్క్‌లో వాలీబాల్ ఆడుతున్న భారత సంతతి వారిని చూపిస్తూ ‘గతేడాది వరకూ వాళ్లు క్రికెట్ ఆడేవాళ్లు. ఇప్పుడు క్రమంగా అమెరికన్ జీవనశైలికి అనుగుణంగా మారుతున్నారు’ అని ఆక్రోశం వెళ్లగక్కాడు. గతేడాది కంటే ఈ ఏడాది స్థానికులు కోల్పోయిన ఉద్యోగాల సంఖ్యను చూస్తే పిచ్చెక్కిపోతుందన్నాడు. గతంలో ఇక్కడ ఉద్యోగాలు, పనిచేసిన స్థానికుల గురించే బెంగం తా అని విద్వేషాన్ని వెళ్లగక్కాడు. భారత సంతతి మహిళలు వేసుకునే సంప్రదాయ దుస్తులు మతిపోగొడుతున్నాయన్నాడు. కాగా.. భారతీయులపై విద్వేష నేరాలకు సంబం ధించి వేగంగా న్యాయం జరిగేలా చూస్తామ ని భారత్‌కు అమెరికా హామీనిచ్చింది.