అమెరికాలో భారత దౌత్యవేత్త అరెస్టు
చేతులకు సంకెళ్లు వేసి మరీ దేవయాని ఖోబ్రాగాదే కోర్టుకు తరలింపు
రూ. కోటిన్నర పూచీకత్తుతో బెయిల్‌పై విడుదల
వీసా మోసానికి పాల్పడినట్టు అభియోగాలు
వీసా మోసానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై అమెరికాలోని న్యూయార్క్‌లో భారత డిప్యూటీ కాన్సుల్ జనరల్‌గా పనిచేస్తున్న దేవయాని ఖోబ్రాగాదే (39)ను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. తన కుమార్తెను స్కూలు వద్ద దింపేందుకు వెళ్లిన ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అందరూ చూస్తుండగానే చేతికి సంకెళ్లు వేసి తమ వెంట తీసుకెళ్లారు. అనంతరం మాన్‌హట్టన్ ఫెడరల్ కోర్టులో ఆమెను హాజరు పరచగా న్యాయస్థానం 2.5 లక్షల డాలర్ల (సుమారు రూ. 1.55 కోట్లు) పూచీకత్తుపై ఆమెకు బెయిల్ ఇచ్చింది. తన ఇంట్లో పనిచేస్తున్న మహిళకు సంబంధించిన వీసా పత్రాల్లో తప్పుడు సమాచారం ఇచ్చారన్న ఆరోపణలపైనే ఖోబ్రాగాదేను అరెస్ట్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు. కాగా న్యూయార్క్ సదరన్ డిస్ట్రిక్ట్‌కు చెందిన యూఎస్ అటార్నీ అయిన ప్రవాస భారతీయుడు ప్రీత్ భరారా చేసిన ఆరోపణల మేరకు ఆమె అరెస్ట్ జరిగింది.
దేవయాని వీసా మోసానికి పాల్పడ్డారని, తప్పుడు సమాచారమిచ్చారని భరారా ఆరోపించారు. దేవయాని తన ఇద్దరు పిల్లల సంరక్షణ బాధ్యతలను చూసుకోవడానికి భారత్ నుంచి ఓ మహిళను తీసుకొచ్చారని, అయితే ఆమె వీసా(ఏ-3) దరఖాస్తులో తప్పుడు సమాచారమిచ్చారని, అంతేగాక ఆమె పనికి తగిన వేతనాన్ని చెల్లించడం లేదంటూ అభియోగాలు నమోదయ్యాయి. ఈ అభియోగాలు రుజువైతే గరిష్టంగా పదేళ్లు, ఐదేళ్ల చొప్పున జైలుశిక్ష పడేందుకు ఆస్కారముంది. తదుపరి విచారణను కోర్టు జనవరి 13కు వాయిదా వేసింది. ఆమెను అమెరికా విడిచి వెళ్లరాదని ఆదేశించింది. ఈ అరెస్ట్ భారత దౌత్యవర్గాలను దిగ్భ్రాంతిలో ముంచెత్తింది. దీనిపై వాషింగ్టన్‌లోని భారత రాయబార కార్యాలయం స్పందించింది. అమెరికా ప్రభుత్వానికి తన ఆందోళనను తెలియపరిచింది. ఆమె దౌత్యవేత్త హోదాను దృష్టిలో పెట్టుకుని సమస్యను పరిష్కరించాలని కోరింది. దేవయాని గతేడాది న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్‌లో చేరారు. అంతకుముందు జర్మనీ, ఇటలీ, పాక్‌లలో పనిచేశారు.
భారత్ దిగ్భ్రాంతి: ఈ ఘటనపై భారత ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. దీనిపై భారత్‌లోని అమెరికా రాయబారి నాన్సీ పావెల్‌ను శుక్రవారం ఢిల్లీలోని విదేశాంగ కార్యదర్శి సుజాతాసింగ్ పిలిపించి భారత్ నిరసనను తెలియజేశారు. సీనియర్ దౌత్యవేత్తపై ఇంత అమర్యాదకరంగా వ్యవహరించడం సరికాదన్నారు. కాగా తన కుమార్తె అరెస్ట్‌పై ఆమె తండ్రి ఉత్తమ్ ఖోబ్రాగాదే శుక్రవారం ముంబైలో స్పందిస్తూ ఈ సంఘటన జాతి వివక్షకు నిదర్శనమని పేర్కొన్నారు.