
తల్లిని హత్య చేసిన భారతీయ అమెరికన్
వాషింగ్టన్: ఏడాది క్రితం కన్న తల్లిని హత్య చేసిన కేసులో 17 ఏళ్ల భారతీయ అమెరికన్ యువకుడిని నార్త్ కరోలినా పోలీసులు అరెస్టు చేశారు. డ్యూక్ మెడికల్ సెంటర్‌లో పని చేసే నళిని తెల్లప్రోలు (51)ను తన కుమారుడు ఆర్నావ్ ఉప్పలపాటి 2015 డిసెంబర్ 17న గొంతునులిమి, ప్లాస్టిక్ బ్యాగ్ ద్వారా ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశాడు. అయితే ఆర్నావ్ మాత్రం తాను స్కూల్ నుంచి వచ్చే సరికి తన తల్లి మృతదేహం కారు వెనుక సీటులో ఉందని అప్పట్లో వాంగ్మూలం ఇచ్చాడు.
శవపరీక్షలో ఆమెను కొట్టి, గొంతునులిమి చంపినట్లు తేలింది. దీనిపై వివిధ కోణాల్లో దర్యాప్తు జరిపిన పోలీసులు కుమారుడే హత్య చేశాడని నిర్ధారించి అరెస్టు చేశారు. నేరం నిరూపితమైతే నిందితుడికి పెరోల్ లేకుండా జీవిత ఖైదు పడే అవకాశం ఉంది. ఈ ఘటన షాక్‌కు గురిచేసిందని నార్త్ కరోలినా తెలుగు అసోసియేషన్ పేర్కొంది.