
పెద్దావిడ్ని కొట్టి హింసించినందుకు..
వాషింగ్టన్: మతిమరుపుతో బాధపడుతున్న వృద్ధురాలి పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఓ నర్సు ఇబ్బందుల్లో పడింది. అమెరికాలోని ఇల్లినోయిస్ లోని క్లెరిమాంట్ హెల్త్ అండ్ రిహాబిలిటేషన్ మెడకల్ సెంటర్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. భారత సంతతికి చెందిన అమెరికన్ నర్సు హన్సమతి సింగ్(47).. 92 ఏళ్ల వృద్ధురాలిని దుర్భాష లాడింది. అంతేకాదు పెద్దావిడని కూడా చూడకుండా చెంపమీద వాతలు తేలేలా కొట్టింది. ముక్కు కింద గోళ్లు గీసుకుపోవడంతో ఎర్రని వాతలు తేలాయి. ఆమెకు ఆహారం తినిపించే సమయంలో కొట్టి, వేధించింది. బాధితురాలు ఈ విషయాలను పోలీసులకు వివరించింది.
పెద్దావిడ దవడపై నర్సు వేలి గోళ్ల గుర్తులు వాతల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయని పోలీసులు ధ్రువీకరించారు. ఈ కేసులో ఈ సాక్ష్యం చాలంటూ నర్సును అరెస్ట్ చేశారు. సుమారు లక్షా ముప్పయి వేల రూపాయలు జరిమానా ను చెల్లించిన తరువాతనే ఆమెను విడుదల చేశారు. అయితే వృద్ధురాలి ఆరోపణలను నర్సు ఖండించింది. లో బ్లడ్ షుగర్ వ్యాధితో బాధపడుతున్నందువల్ల ఆమెకు బలవంతంగా తినిపించాల్సి వచ్చందని, ఆ సందర్భంగా గాయమైన విషయాన్ని తాను గమనించలేదని తెలిపింది. అంతే తప్ప తాను కొట్టి హింసించలేదని వాదించింది. మరోవైపు వృద్ధురాలి పట్ల అమానుషంగా ప్రవర్తించిన సదరు నర్సును విధుల నుంచి తప్పించనున్నట్టు హెల్త్ సెంటర్ డైరెక్టర్ తెలిపారు.