సోనియా సింగాల్
పెప్సీకో సీఈవో ఇంద్రా నూయీ తర్వాత అంతటి ఘనతను మరో భారత సంతతి మహిళ సాధించారు. భారత సంతతి అమెరికన్ మహిళల్లోనే అత్యున్నత హోదా సాధించారు. ఆమే సోనియా సింగాల్(49). ఫార్చూన్500 కంపెనీల్లో 186వ స్థానంలో ఉన్న ప్రముఖ దుస్తుల తయారీ సంస్థ ‘గాప్ ఇంక్’కు ఆమె సీఈవో అయ్యారు. ఈ కంపెనీ ఆదాయం ఏడాదికి 18 బిలియన్ డాలర్లు. అమెరికాసహా విదేశాల్లో 3,727 స్టోర్లు ఉన్న ఈ సంస్థలో 1.35 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అంతకుముందు ఈమె సన్ మైక్రోసిస్టమ్స్, ఫోర్డ్ మోటార్స్‌లో 15 ఏళ్లపాటు పనిచేశారు. గాప్ ఇంక్‌లో 2004లో చేరిన ఈమె గ్రూప్‌లోని ఓల్డ్ నేవీ సీఈవోగా, గాప్ ఇంక్ యూరప్ ఎండీగా ఉన్నారు.
అమెరికాలో ముగ్గురు శ్వేత జాతి నాయకుల మధ్య ఎన్నికల ప్రచారంలో భాగంగా భిన్నత్వం, లింగ సమానత్వంపై జోరుగా చర్చ సాగుతున్న సమయంలో ఈ నియామకం చోటుచేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఫార్చూన్500 కంపెనీల్లో ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా 33 మంది మహిళలు ప్రస్తుతం సీఈవోలుగా ఉన్నారు. వలస వచ్చిన కుటుంబాల నుంచి మహిళలు సీఈవో స్థాయికి ఎదగడం అరుదు. భారత్‌లో పుట్టిన సోనియా కుటుంబం.. ఆమె చిన్నతనంలో కెనడాకు తర్వాత అమెరికాకు వెళ్లింది. సోనియా కెట్టరింగ్ వర్సిటీ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ, స్టాన్‌ఫోర్డ్ వర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ పొందారు.
Comments
Please login to add a commentAdd a comment