వాషింగ్టన్: భారత రత్న పురస్కార గ్రహిత, మాజీ రాష్ట్రపతి, ప్రఖ్యాత శాస్త్రవేత్త అయిన ఏపీజీ అబ్దుల్ కలాం మరణవార్త విన్న భారతీయ అమెరికన్ల సంఘం సంతాపం వ్యక్తం చేసింది. మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్(ఐఐఎం)లో సోమవారం జరిగిన ఒక కార్యక్రమంలో ప్రసంగిస్తూ సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో తీవ్ర గుండెపోటుతో ఏపీజే అబ్దుల్ కలాం(83) కన్నుమూసిన సంగతి తెలిసిందే.
ఆయన ఇక లేడనే విషయాన్ని తాము జీర్ణించుకోలేకపోతున్నామని వారు విచారం వ్యక్తం చేశారు. నిరాడంబరత, వినయంతో కూడిన కలాం వ్యక్తిత్వం యువ హృదయాలకు కదిలించేలా చేసిందని కొనియాడారు. ఇటీవల కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన రాష్ట్రపతిగా అభివర్ణించారు. కలాం ప్రేరణ కలిగించే తన ప్రసంగాలతో దేశవ్యాప్తంగా పిల్లలు, యువ హృదయాలలో స్ఫూర్తి ప్రదాతగా సుస్థిరమైన స్థానాన్ని సంపాదించారని ప్రశంసించారు.
భారతదేశ ప్రజలు, పిల్లలు అమితంగా ఇష్టపడే ఇలాంటి మహోన్నత వ్యక్తి అవసరం దేశానికి ఎంతైనా ఉందని పేర్కొన్నారు. ప్రపంచంలో నలుమూలల్లో ఉన్న ప్రతి భారతీయుడు గర్వంచదగ్గ మహోన్నత వ్యక్తి అబ్దుల్ కలాం అని చెప్పారు. భారత్ ఓ మహోన్నత వ్యక్తిని కోల్పోయిందని భారతీయ అమెరికన్ ఒకరు పేర్కొన్నారు. కలాం మృతి దేశానికి తీరని లోటు అని, ఆయన స్థానాన్ని భర్తీ చేయడం చాలా కష్టతరమైనదంటూ నాట్స్ పేర్కొంది. కలాంకు తెలుగువాళ్లతో ప్రత్యేకమైన అనుబంధం ఉందని, ఆయన జీవితంలో ఎక్కువ సమయం మన తెలుగుప్రజలతో గడిపారంటూ తానా అసోసియేషన్ ఆనాటి స్మృత్తులను గుర్తుచేసుకుంది.
కలాం మృతిపై భారతీయ అమెరికన్ల సంతాపం
Published Tue, Jul 28 2015 9:34 AM | Last Updated on Mon, Aug 20 2018 3:02 PM
Advertisement