Indian-Americans
-
రేపే అమెరికాకు ప్రధాని మోదీ
వాషింగ్టన్/హూస్టన్: ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆయన ఈ నెల 21 నుంచి 24వ తేదీ దాకా అమెరికాలో పర్యటిస్తారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్, జిల్ దంపతుల ఆహ్వానం మేరకు అగ్రరాజ్యంలో మోదీ పర్యటించబోతున్నారు. ఈ సందర్భంగా పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మోదీ పర్యటన కోసం భారత–అమెరికన్లు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఆయనకు ఘనంగా స్వాగతం పలికేందుకు సన్నద్ధమవుతున్నారు. మోదీకి స్వాగత సందేశాన్ని పంపించడానికి రాజధాని వాషింగ్టన్ డీసీ సహా అమెరికావ్యాప్తంగా 20 నగరాల్లో భారత–అమెరికన్లు తాజాగా ఐక్యతా ప్రదర్శనలు నిర్వహించారు. ఈ ప్రదర్శనల్లో వందలాది మంది ఉత్సాహంగా పాలుపంచుకున్నారు. వాషింగ్టన్ డీసీ, న్యూయార్క్‌లో మోదీ హాజరయ్యే కార్యక్రమంలో పాల్గొనేందుకు టికెట్ల కోసం భారత–అమెరికన్లు ముమ్మరంగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇప్పుడు అమెరికా అంతటా మోదీ పర్యటనపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. రక్షణ బంధాలకు పెద్దపీట రక్షణ రంగంలో పరస్పర సహకారం కోసం భారత్–అమెరికా చేతులు కలుపుతున్నాయి. మోదీ అమెరికా పర్యటనలో ఇదే అంశంపై విస్తృతంగా చర్చలు జరుగనున్నాయి. రక్షణ రంగంలో సహకారంపై ఇరుదేశాలు కీలకమైన ఒప్పందాలు కుదుర్చుకోనున్నట్లు తెలుస్తోంది. ఓ రోడ్డు మ్యాప్‌ను సైతం ఖరారు చేయనున్నట్లు సమాచారం. ఆసియా–పసిఫిక్ ప్రాంతంలో చైనా ప్రాబల్యానికి అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా ఇకపై కలిసి పనిచేయాలని భారత్–అమెరికా ఇప్పటికే నిర్ణయించుకున్నాయి. 24, 25న మోదీ ఈజిప్టు పర్యటన ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 24, 25న ఈజిప్టులో పర్యటిస్తారు. ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్–సిసీ ఆహా్వనం మేరకు ఆయన ఈ పర్యటన తలపెట్టారు. 1997 తర్వాత భారత ప్రధాని ఈజిప్టులో పర్యటిస్తుండడం ఇదే మొదటిసారి కావడం విశేషం. 11వ శతాబ్దం నాటి చారిత్రక అల్–హకీం మసీదును మోదీ సందర్శిస్తారు. దావూదీ బోహ్రా ముస్లిం సామాజికవర్గం సహాయంతో ఈ మసీదును ఇటీవలే పునరుద్ధరించారు. ఈజిప్టులో మొదటి ప్రపంచ యుద్ధంలో ప్రాణత్యాగం చేసిన భారత సైనికులకు హెలియోపోలిస్ వార్ సెమెట్రీలో మోదీ నివాళులరి్పస్తారు. ఈజిప్టు అధ్యక్షుడితో చర్చలు జరుపుతారు. ఈజిప్టులోని భారతీయులతో సమావేశమవుతారు. -
స్త్రీ శక్తి: మడమ తిప్పలేదు... అడుగు ఆపలేదు
పౌరహక్కుల నుంచి పర్యావరణం వరకు ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నారు. జాత్యహంకార బెదిరింపులు ఎన్ని ఎదురైనా ధైర్యమే వజ్రాయుధంగా ముందుకు కదిలారు. కొత్త అడుగుతో చరిత్ర సృష్టించారు. అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ఘన విజయం సాధించి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచిన మన వాళ్ల గురించి.. అరుణా మిల్లర్ మేరీలాండ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా గెలిచిన అరుణా మిల్లర్ హైదరాబాద్‌లో పుట్టింది. భారత సంతతికి చెందిన వ్యక్తి లెఫ్టినెంట్ గవర్నర్ కావడం ఇదే మొదటిసారి. ఈ విషయంలో అరుణ చరిత్ర సృష్టించింది. మేరీలాండ్కు తొలి భారతీయ–అమెరికన్ డెలిగేట్‌గా తన ప్రత్యేకత చాటుకుంది. మిస్సోరీ యూనివర్శిటీలో సివిల్ ఇంజనీరింగ్ చేసిన అరుణ ట్రాన్స్‌పోర్టేషన్ ప్లానర్‌గా, ట్రాఫిక్ ఇంజనీర్‌గా వివిధ ప్రాంతాలలో పనిచేసింది. మిస్సోరీ ఫైర్‌బ్రాండ్‌గా గుర్తింపు పొందిన అరుణ ఆరోగ్య సంరక్షణ నుంచి పర్యావరణ పరిరక్షణ వరకు ఎన్నో కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించింది. పరిమళా జయపాల్ పరిమళా జయపాల్ యూఎస్ హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్(ప్రతినిధుల సభ)కు ఎంపికైన తొలి భారతీయ–అమెరికన్ మహిళ. తాజాగా 7వ డిస్ట్రిక్ట్(వాషింగ్టన్) నుంచి ప్రతినిధుల సభకు ఎంపికైంది. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి క్లిఫ్‌మూన్‌పై విజయం సాధించింది. చెన్నైలో పుట్టిన పరిమళా జయపాల్ ఇండోనేషియా, మలేసియాలో పెరిగింది. తల్లి రచయిత్రి. తండ్రి మార్కెటింగ్ రంగంలో పనిచేశారు. పదహారు సంవత్సరాల వయసులో అమెరికాకు వెళ్లింది పరిమళ. జార్జ్‌టౌన్ యూనివర్శిటీ నుంచి బీఏ, కెలాగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ నుంచి ఎంబీఏ పట్టాలు పుచ్చుకుంది. చదువు పూర్తయిన తరువాత ఒక ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులో ఫైనాన్షియల్ ఎనలిస్ట్‌గా పనిచేసింది. రాజకీయాల్లోకి అడుగుపెట్టడానికి ముందు పౌరహక్కుల ఉద్యమాల్లో చురుగ్గా పనిచేసింది. ‘హేట్ ఫ్రీ జోన్’ అనే సంస్థను ప్రారంభించి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించింది. పరిమళ మంచి రచయిత్రి కూడా. ‘పిల్గ్రిమేజ్: వన్ వుమెన్స్ రిటర్న్ టు ఏ ఛేంజింగ్ ఇండియా’ అనే పుస్తకం రాసింది. ‘నువ్వు మీ దేశానికి వెళ్లి పో’ అంటూ ఆమెకు ఎన్నోసార్లు బెదిరింపు కాల్స్ వచ్చాయి. అయితే ఆమె వాటిని ఎప్పుడూ ఖాతరు చేయలేదు. వెనక్కి తగ్గలేదు. నబీలా సయ్యద్ అమెరికాలో జరిగిన మధ్యంతర ఎన్నికలలో ఇల్లినాయి జనరల్ అసెంబ్లీకి ఎన్నిక కావడం ద్వారా 23 ఏళ్ల ఇండియన్–అమెరికన్ నబీలా సయ్యద్ చరిత్ర సృష్టించింది. డెమోక్రటిక్ పార్టీకి చెందిన నబీలా 51వ డిస్ట్రిక్ట్‌లో రిపబ్లిక్ పార్టీకి చెందిన క్రిస్ బోస్పై ఘన విజయం సాధించింది. ఇల్లినాయి రాష్ట్రంలోని పాలై్టన్ విలేజ్‌లో పుట్దింది నబీలా. హైస్కూల్ రోజుల నుంచి ఉపన్యాస పోటీల్లో చురుగ్గా పాల్గొనేది. వాటి ద్వారా రకరకాల సామాజిక విషయాలను లోతుగా తెలుసుకునే అవకాశం వచ్చింది. కాలేజిలో ఎన్నో చర్చావేదికల్లో పాల్గొనేది. యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా నుంచి పొలిటికల్ సైన్స్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లలో పట్టా పుచ్చుకుంది. స్త్రీ సాధికారత, హక్కులకు సంబంధించి ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొనే నబీలా ఉద్యోగం కంటే ఉద్యమాలకే ప్రాధాన్యత ఇచ్చేది. ఈ క్రమంలోనే రాజకీయాలకు దగ్గరైంది. ‘ఎమిలీస్ లిస్ట్’తో కలిసి పనిచేసింది. ఎమిలీస్ లిస్ట్ అనేది డెమోక్రటిక్ మహిళా అభ్యర్థులు చట్ట సభకు ఎన్నిక కావడానికి ఉపకరించే పొలిటికల్ యాక్షన్ కమిటీ.‘నా విజయానికి ప్రధాన కారణం తమ తరపున పోరాడే, బలంగా గొంతు వినిపించే వ్యక్తిని ప్రజలు తమ ప్రతినిధిగా చట్టసభకు పంపాలనుకోవడం. వారి నమ్మకాన్ని నిలబెడతాను’ అంటోంది నబీలా.ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటి తలుపు తట్టిన నబీలా తనను గెలిపించిన వారికి కృతజ్ఞతలు తెలియజేయడానికి మళ్లీ ఇంటింటికీ వెళ్లనుంది. -
అగ్రరాజ్యంలో భారతీయ అమెరికన్లపై వివక్ష నిత్యకృత్యం
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాకు వలస వచ్చిన వారిలో భారతీయ అమెరికన్లదే రెండోస్థానం. అయినప్పటికీ వారిపై వివక్ష, వేధింపులు కొనసాగుతున్నట్లు తాజా సర్వే వెల్లడించింది. అమెరికాలో భారతీయ అమెరికన్లను వివక్షను ఎదుర్కోవడం నిత్యం సర్వసాధారణంగా మారిందని పేర్కొంది. ‘సోషల్ రియాలిటీస్ ఆఫ్ ఇండియన్ అమెరికన్స్’ పేరిట 2020లో కార్నెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్, జాన్స్ హాప్కిన్స్–ఎస్ఏఐఎస్, యూనివర్సిటీ పెన్సిల్వేనియా సంయుక్తంగా నిర్వహించిన ఈ సర్వే నివేదికను బుధవారం విడుదల చేశారు. సర్వేలో భాగంగా అమెరికాలో నివసించే 1,200 మంది భారతీయ అమెరికన్లను గత ఏడాది సెపె్టంబర్ 1 నుంచి 20వ తేదీ వరకూ ఆన్లైన్ ద్వారా ప్రశ్నించారు. అమెరికా గడ్డపై తాము వివక్షను ఎదుర్కొంటున్నామని ప్రతి ఇద్దరిలో ఒకరు చెప్పారు. ప్రధానంగా తమ చర్మం రంగుకు సంబంధించి అవహేళనకు గురవుతున్నామని తెలిపారు. భారతదేశంలో పుట్టి అమెరికాకు వచి్చన వారు మాత్రమే కాకుండా అమెరికాలోనే పుట్టిన భారత సంతతి ప్రజలకు కూడా ఇదే రకమైన చేదు అనుభవాలు ఎదురవుతుండడం గమనార్హం. భారతీయ తండ్రి–అమెరికా తల్లికి, భారతీయ తల్లి–అమెరికా తండ్రికి పుట్టిన వారు సైతం కొన్ని సందర్భాల్లో శ్వేత జాతిæఅమెరికన్ల నుంచి వివక్షను చవిచూడాల్సి వస్తోంది. వదలని కుల జాడ్యం భారతీయ అమెరికన్ల జీవితాల్లో మతం ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. నిత్యం ఒక్కసారైనా ప్రార్థన చేస్తామని 40% మంది చెప్పారు. వారంలో ఒక్కసారైనా మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటామని 27% మంది తెలిపారు. భారతీయ అమెరికన్లను తమ కులం గుర్తింపును వదులుకోవడం లేదు. సగం మంది హిందూ ఇండియన్ అమెరికన్లు తమ కులాన్ని సూచించే ఆనవాళ్లను కొనసాగిస్తున్నారు. అమెరికాలో పుట్టిన వారి కంటే ఇండియాలో పుట్టిన భారతీయ అమెరికన్లలో ఈ ధోరణి ఎక్కువ. అక్కడి మొత్తం హిందువుల్లో ప్రతి 10 మందిలో 8 మంది తమ కులంపై మమకారం చాటుకుంటున్నారు. ఇండియన్ అమెరికన్ అని చెప్పుకోవడం కూడా చాలామంది గర్వకారణంగా భావి స్తున్నారు. మొత్తం అమెరికా జనాభాలో ఇండియన్ అమెరికన్లు 1 శాతం కంటే ఎక్కువే ఉన్నారు. రిజిస్టరైన ఓటర్లలో 1 శాతం కంటే తక్కువగా ఉన్నారు. 2018 నాటి గణాంకాల ప్రకారం అమెరికాలో 42 లక్షల మంది భారతీయ అమెరికన్లు నివసిస్తున్నారు. -
అమెరికాలో భారతీయుల హవా
వాషింగ్టన్: నలుగురు భారతీయ అమెరికన్లు తాజాగా అమెరికాలో కీలక పదవులకు ఎన్నికయ్యారు. వారిలో ఒక ముస్లిం మహిళ, మరో వైట్ హౌజ్ మాజీ సాంకేతిక విధాన సలహాదారు కూడా ఉన్నారు. గజాలా హష్మీ వర్జీనియా స్టేట్ సెనెట్‌కు ఎన్నికైన తొలి ముస్లిం మహిళగా చరిత్ర సృష్టించారు. అలాగే, ఒబామా హయాంలో శ్వేత సౌధంలో టెక్నాలజీ పాలసీ అడ్వైజర్‌గా విధులు నిర్వహించిన సుహాస్ సుబ్రమణ్యం వర్జీనియా రాష్ట్ర ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు. గజాలా హష్మీ తొలిసారి ఈ ఎన్నికల్లో పోటీ చేశారు. ప్రస్తుతం రేనాల్డ్స్ కమ్యూనిటీ కాలేజ్‌లో సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ టీచింగ్ అండ్ లెర్నింగ్ విభాగానికి వ్యవస్థాపక డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. భారతీయ అమెరికన్లు ఎక్కువగా ఉండే లావుడన్ కౌంటీ నుంచి వర్జీనియా ప్రతినిధుల సభకు సుహాస్ సుబ్రమణ్యం ఎన్నికయ్యారు. 1979తో బెంగళూరుకు చెందిన వైద్యురాలైన తన తల్లితో కలిసి ఆయన అమెరికా వెళ్లారు. మరోవైపు, కాలిఫోర్నియాలో భారతీయ అమెరికన్ మనోహర్ రాజు శాన్ ఫ్రాన్సిస్కో పబ్లిక్ డిఫెండర్‌గా ఎన్నికయ్యారు. అలాగే, నార్త్ కరొలినాలో చార్లట్ సిటీ కౌన్సిల్‌కు డింపుల్ అజ్మీరా మరోసారి ఎన్నికయ్యారు. -
హాల్ ఆఫ్ ఫేమ్’లో ఇద్దరు భారతీయులు
వాషింగ్టన్: అమెరికా పేటెంట్ అండ్ ట్రేడ్‌మార్క్ ఆఫీస్ (యూఎస్‌పీటీఓ) ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్వెస్టర్స్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో భారత్‌కు చెందిన ప్రొఫెసర్ ఆరోగ్యస్వామి జోసెఫ్ పాల్‌రాజ్, సుమితా మిత్రాలకు చోటు దక్కింది. అత్యంత వేగంగా డేటాను ట్రాన్స్మిట్ చేయడంతో పాటు స్వీకరించేలా వైర్లెస్ టెక్నాలజీని రూపొందించినందుకు పాల్‌రాజ్ ఈ ఘనత సాధించారు. నానో కాంపోజిట్ డెంటల్ మెటీరియల్ అభివృద్ధికి కృషి చేసినందుకు సుమితా మిత్రాకు ఈ గౌరవం లభించింది. మే 3న వాషింగ్టన్లో ఈ అవార్డును పాల్‌రాజ్, సుమితాలకు అందిస్తారు. -
సీఎన్ఎన్ హీరోస్ రేసులో ఇద్దరు ఇండో అమెరికన్లు
వాషింగ్టన్: ప్రతిష్టాత్మక సీఎన్ఎన్ హీరోస్ జాబితాలో ఈ ఏడాది ఇద్దరు ఇండో అమెరికన్ల పేర్లు కనిపిస్తున్నాయి. అమెరికాలోని పిట్స్‌బర్గ్‌లో నివాసముంటున్న సమీర్ లఖానీ, టెక్సాస్‌లో నివాసముంటున్న మోనా పటేల్ తుది పదిమంది జాబితాలో చోటుదక్కించుకున్నారు. డిసెంబర్ 17న సీఎన్ఎన్ హీరోస్ వార్షిక అవార్డుల ప్రదానోత్సవం జరుగుతుంది. ఓ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటుచేసి, దాని ద్వారా కాంబోడియాలోని మారుమూల గ్రామాల్లోని ప్రజలకు సేవ చేస్తున్న లఖానీ సేవలు ప్రశంసించదగినవంటూ సీఎన్ఎన్ పేర్కొంది. ‘2014లో కాంబోడియా పర్యటనకు వెళ్లిన లఖానీ... ఆ దేశంలోని ప్రజలు కనీసం సబ్బు కూడా కొనుక్కోలేని దుస్థితిలో ఉన్నారని గుర్తించారు. అప్పటి నుంచి తాను ఏర్పాటు చేసిన స్వచ్ఛంద సంస్థ ద్వారా కాంబోడియాలోని గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సబ్బులను సరఫరా చేస్తూ, ఆరోగ్యం, వ్యక్తిగత శుభ్రతపై అవగాహన కల్పిస్తున్నార’ని సీఎన్ఎన్ పేర్కొంది. ‘నేను కాంబోడియా వెళ్లినప్పుడు చూశాను.. అప్పుడే పుట్టిన ఓ బిడ్డను తల్లి లాండ్రీ పౌడర్‌తో స్నానం చేయిస్తోంది. అది నన్ను ఎంతగానో కదిలించి, ఈ సాయం చేసేలా ప్రేరేపించింద’ని లఖానీ పేర్కొన్నారు. ఇక శాన్ ఆంటోనియో యాంపుటీ ఫౌండేషన్ ద్వారా వికలాంగులకు సేవ చేస్తూ గుర్తింపు సంపాదించుకున్నారు మోనా పటేల్. వికలాంగులు తమ కాళ్లపై తామే నిలబడేలా చేయూతనందిస్తూ ప్రతినెలా 30 నుంచి 60 మందికి సాయం చేస్తున్నారు. ఈ కృషిని గుర్తించిన సీఎన్ఎన్ మోనా పటేల్‌కు కూడా తుదిజాబితాలో చోటు కల్పించింది. మరి ‘హీరోస్’గా అవార్డును వీరు దక్కించుకుంటారా? లేదా? అనే ప్రశ్నలకు డిసెంబర్ 17న సమాధానం దొరుకుతుంది. -
సీఎన్ఎన్ హీరోల రేసులో ఇండో అమెరికన్లు
వాషింగ్టన్ : అమెరికాలో సేవలు అందించిన వారికి ఇచ్చే సీఎన్ఎన్ హీరోస్ అవార్డు-2017 రేసులో ఇద్దరు ఇండో-అమెరికన్లు నిలిచారు. పీటర్స్బర్గ్కు చెందిన సమీర్ లఖానీ, టెక్సాస్‌కు చెందిన మోనా పటేల్ సీఎన్ఎన్ హీరోస్ టాప్ టెన్ జాబితాలో నిలిచారు. స్టార్ హోటల్స్ నుంచి సేకరించిన సబ్బులను రీ సైకిల్ చేసి.. వాటిని కాంబోడియాలోని పేదప్రజలకు అందిస్తున్నారు. లఖానీ 2004 నుంచి సేవాకార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. సర్ఫ్‌ను నీటిలో కలిపి.. దానితో చిన్నారులకు స్నానం చేయించే సన్నివేశం నా జీవితాన్ని మార్చిందని లఖాని చెబుతున్నారు. ఇప్పటి వరకూ లఖానీ 6 లక్షల 50 వేలమందికి లఖానీ సహాయం చేసినట్లు సీఎన్ఎన్ వర్గాలు చెబుతున్నాయి. మోనా పటేల్ శాన్ అంటోనియో ఫౌండేషన్ నుంచి అంగవైకల్యంతో జన్మించిన పేద ప్రజలకు సహాయం అందిస్తున్నారు. వైకల్యం కలిగిన అవయవాలు అందించడంతో పాటు, చదువు చెప్పిస్తున్నారు. అంతేకాక వారికి ఆర్థిక సహకారాన్ని అందిస్తున్నారు. ప్రతి నెల 30 నుంచి 60 మందికి వైకల్యం కలిగిన అవయవాలను మోనా పటేల్ అందిస్తుండడం విశేషం. ఇంత చేస్తున్న మోనా వయసు కేవలం 17 ఏళ్లు కావడం విశేషం. -
అమెరికన్ డ్రీమర్స్‌పై ట్రంప్ కత్తి..
- బాల్యంలోనే అమెరికాకు వలసొచ్చిన వారిపై నిర్ణయం - వర్క్ పర్మిట్ల రద్దుపై మంగళవారం ప్రకటన చేయనున్న ప్రెసిడెంట్ - ప్రభావాన్ని ఎదుర్కొనేవాళ్లలో మనవాళ్లు ఏడువేల మంది సాక్షి, వాషింగ్టన్ : అమెరికాలో నివసించడానికి, పనిచేయడానికి అనుమతించే అధికారిక పత్రాలు లేని ఏడు వేల మంది భారతీయ అమెరికన్ యువకులు సహా దాదాపు 8 లక్షల మంది వర్క్ పర్మిట్లు రద్దుపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం ప్రకటన చేయనున్నారు. ఇతర దేశాల నుంచి తమ తల్లిదండ్రులతో పాటు వచ్చిన పిల్లలే ఈ యువకులు. వారిని అమెరికాలో డ్రీమర్లు(స్వాప్నికులు) అని పిలుస్తారు. ఇక్కడ జీవించడానికి, పనిచేయడానికి అవసరమైన డాక్యుమెంట్లు లేకున్నా ఈ పిల్లలు అమెరికాలోనే చదువుకుని, ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. వారిలో అత్యధికశాతం పొరుగుదేశమైన మెక్సికో, మధ్య, దక్షిణ అమెరికా దేశాల్లో పుట్టారు. ఇండియా, వియత్నాం వంటి ఆసియా దేశాలకు చెందిన ఇలాంటి యువకుల వాటా తొమ్మిది శాతానికి మించదని అంచనా. ఈ పిల్లల వల్ల స్థానిక అమెరికన్లకు హాని జరుగుతోందని, వారిలో కొందరు చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటున్నారనేది ట్రంప్ మద్దతుదారుల ఆరోపణ. తల్లిదండ్రుల కారణంగా అమెరికా వచ్చిన ఈ డ్రీమర్లు దేశ ఆర్థికవ్యవస్థ బలోపేతానికి కృష్టిచేస్తున్న కారణంగా వారిపై దయ చూపాలేగాని, శిక్షించరాదనే అభిప్రాయంతో ఏకీభవించిన మాజీ అధ్యక్షుడు బరాక్ఒబామా 2012లో వెసులుబాటు కల్పించారు. దేశంలో పెరిగి ఉద్యోగాలు చేస్తున్న స్వాప్నికులను వారు పుట్టిన దేశాలకు పంపకుండా కాపాడడానికి 'బాల్యంలోనే వచ్చినవారిపై చర్యల వాయిదా'(డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్‌హుడ్ అరైవల్స్-డాకా) అనే సహాయ కార్యక్రమాన్ని 2012 జూన్15న ఒబామా ప్రకటించారు. అమెరికా ఫెడరల్ సర్కారు నిధులతో అమలయ్యే ఈ కార్యక్రమం కింద లబ్ధి పొందడానికి దాదాపు 8 లక్షల మంది పెట్టుకున్న దరఖాస్తులను ఆమోదించారు. ఇలా అర్హత పొందిన యువతీయువకులు డాకా కింద ప్రతి రెండేళ్లకు తమ వర్క్ పర్మిట్లను పొడిగించకునే అవకాశం కల్పించారు. రెన్యూవల్ సౌకర్యం తొలగించి, వారు జన్మించిన దేశాలకు పంపించడానికి వీలుగా డాకాను రద్దుచేయాలనే డిమాండ్ రెండేళ్ల క్రితమే మొదలైంది. అమెరికన్లకు కష్టాలు వలసొచ్చినవారి వల్లేననే వాదనకు ట్రంప్ హయాంలో బలం చేకూరింది. అయితే, ఇన్ని లక్షల మందిని అర్ధంతరంగా వారెరగని దేశాలకు పంపడం అన్యాయమని అన్ని పార్టీలకు చెందిన చాలా మంది నేతలు గుర్తించారు. యాపిల్ సీఈవో టిమ్ కుక్, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యా నాదెళ్ల వంటి మెగా టెక్ కంపెనీల ఉన్నతాధికారులు డాకా ప్రోగ్రాం రద్దును వ్యతిరేకిస్తున్నారు. పాలకపక్షమైన రిపబ్లికన్ పార్టీకి చెందిన సెనెటర్లు, ప్రతినిధుల సభ సభ్యులు, స్పీకర్ కూడా డ్రీమర్లకు డాకా ద్వారా లభిస్తున్న సౌకర్యాలు రద్దుచేయకూడదనే కోరుతున్నారు. అందుకే మంగళవారం ట్రంప్ వెంటనే డాకా రద్దుచేయకుండా ఆరు నెలలు యధాతథ స్థితి కొనసాగడానికి అవకాశమిస్తారని భావిస్తున్నారు. వర్క్ పర్మిట్లు ఇక ముందు పొడిగించుకునే వీలులేకుండా దాని స్థానంలో కొత్త చట్టం చేయాలనిఅమెరికా కాంగ్రెస్‌ను ట్రంప్ కోరవచ్చని అమెరికా మీడియా సంస్థలు అంచనావేస్తున్నాయి. - (సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
ఇండియన్ అమెరికన్లకు కీలక పదవులు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇద్దరు భారతీయ అమెరికన్లను కీలక పదవులకు నామినేట్ చేశారు. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఎన్ఫోర్స్మెంట్ కోఆర్డినేటర్‌గా విశాల్ అమీన్‌ను, ఆఫీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ రెగ్యులేటరీ అఫైర్స్(ఓఆర్ఐఏ) అడ్మినిస్ట్రేటర్‌గా నియోమి రావును నామినేట్ ఎంపికచేశారు. విశాల్ అమీన్ ప్రస్తుతం హౌస్ జ్యుడీషియరీ కమిటీలో సీనియర్ న్యాయవాదిగా పనిచేస్తున్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జి డబ్ల్యూ బుష్ హయాంలో డొమెస్టిక్ పాలసీ అసోసియేట్ డైరెక్టర్‌గానూ ఆయన బాధ్యతలు నిర్వహించారు. జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ నుంచి న్యూరోసైన్స్ విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ, వాషింగ్టన్ యూనివర్సిటీ నుంచి న్యాయ పట్టా తీసుకున్నారు. ఇక ఓఆర్ఐఏ అడ్మినిస్ర్టేటర్‌గా నామినేట్ అయిన నియోమి రావు.. జార్జ్ మాసన్ యూనివర్సిటీలో రావు ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. జార్జి డబ్ల్యూ బుష్ హయాంలో కూడా ఆమె వివిధ హోదాల్లో పనిచేశారు. ఓఆర్ఐఏ.. ఫెడరల్ ఏజెన్సీల నిర్ణయాలను సమీక్షించే కీలక సంస్థ కావడం గమనార్హం. అధ్యక్షుడి లక్ష్యాలకు అనుగుణంగా లేని నిర్ణయాలను రద్దు చేసే అధికారం కూడా ఈ సంస్థకు ఉంటుంది. -
కన్సాస్ హీరోకు లక్ష డాలర్లు
భారీగా విరాళాలు సమకూర్చిన భారతీయులు హూస్టన్: కన్సాస్ కాల్పుల ఘటనలో తుపాకీకి వెరవకుండా అలోక్ మేడసాని ప్రాణాలను కాపాడిన అమెరికావాసి ఇయాన్ గ్రిల్లట్పై వెల్లువెత్తిన సానుభూతి... అతనిని లక్ష్మీదేవి రూపంలో వరించింది. స్వస్థలమైన కన్సాస్‌లో ఇంటిని కొనుగోలు చేసుకునేందుకు అమెరికాలోని భారతీయులంతా చేయిచేయి కలిపి లక్ష డాలర్ల మేర విరాళాలు సేకరించారు. గార్మిన్ కంపెనీలో పనిచేసే శ్రీనివాస్, అతని స్నేహితుడు మేడసాని అలోక్..ఫిబ్రవరి 22వ తేదీ రాత్రి కన్సాస్‌లోని ఓ బార్‌కు వెళ్లడం. అక్కడ నిందితుడు ఆడం పూరింటన్ వీరికి తారసపడడం తెలిసిందే. ‘మీరు మధ్యప్రాచ్యానికి చెందినవారు కదా. మా దేశం విడిచివెళ్లిపోండి’ అంటూ తొలుత శ్రీనివాస్, అలోక్‌లతో గొడవకు దిగాడు. ఆ తర్వాత బార్ నిర్వాహకులు అతనిని అక్కడి నుంచి బలవంతంగా బయటికి పంపగా కొద్దిసేపటి తర్వాత మళ్లీ అక్కడకు చేరుకుని ఆకస్మికంగా వీరిరువురిపై కాల్పులు జరపగా శ్రీనివాస్ చనిపోయాడు. నిందితుడిని అడ్డుకునేందుకు యత్నించిన గ్రిల్లట్‌తోపాటు అలోక్‌కు గాయాలవగా ఆస్పత్రికి తరలించగా వారిరువురు ప్రాణాలతో బయటపడడం తెలిసిందే. గ్రిల్లట్‌కు కృతజ్ఞతగా ఈ కానుకను అందజేస్తున్నామని తమ ఫేస్బుక్ పేజీలో ఇండియాహౌస్ హూస్టన్ పేర్కొంది. ఈ విరాళాల సేకరణకు హూస్టన్‌లోని భారత కాన్సులర్ జనరల్ డాక్టర్ అనుపమ్ రే చొరవ తీసుకోవడం గమనార్హం. అమెరికాలోని భారత రాయబారి నవ్‌తేజ్ సర్నా ఈ చెక్కును ఇయాన్కు అందజేశారు. -
వైట్ హౌస్‌కు భారత్ బెస్ట్ ఫ్రెండ్
అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇండియన్-అమెరిన్లకు కృతజ్ఞతలు చెప్పారు. తన విజయానికి కృషిచేసినందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు. అమెరికా ఎన్నికల్లో అనూహ్య భరితంగా విజయం సాధించడంతో కీలక రాష్ట్రాలైన ఓర్లాండ్, ఫ్లోరిడాలో ట్రంప్ కృతజ్ఞత ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి పెద్ద సంఖ్యలో హిందూ కమ్యూనిటీ హాజరైంది. తన విజయోత్సవ ప్రచారంలో పాల్గొనందుకు హిందూవులను గొప్పగా ట్రంప్ కొనియాడారు. మొదటిసారి ట్రంప్ తన విజయోత్సవంలో హిందూ కమ్యూనిటీ, ఇండియన్-అమెరికన్లు చేసిన కృషిని మెచ్చుకున్నారు. అందరికీ కృతజ్ఞతలు చెబుతున్నట్టు ప్రకటించారు. ''వారందరూ ఎక్కడున్నారు. వారికి నేను థ్యాంక్సూ చెప్పాలి. మీరు నాకు ఓటు వేయడం అమేజింగ్'' అంటూ పొగడ్తల వర్షం కురిపించారు. మరోవైపు ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్న ఆర్థికసంస్కరణలను కూడా ట్రంప్ మెచ్చుకున్నారు. భారత్-అమెరికా సంబంధాలను మంచిగా కొనసాగించేందుకు కృషిచేస్తానని ట్రంప్ ఈ సందర్భంగా వాగ్దానం చేశారు. వైట్‌హౌస్‌కు భారత్ బెస్ట్ ఫ్రెండ్ కాబోతుందని పేర్కొన్నారు. ''పెద్ద, సాహసోపేతమైన కలను కనండి. మిమ్మల్ని మీరు నమ్మండి. అమెరికాను నమ్మండి.. అందరం కలిసి అమెరికాను మళ్లీ ఉన్నతంగా తీర్చిదిదుద్దాం... అంటూ ట్రంప్ ఇండియన్ అమెరికన్లకు పిలుపునిచ్చారు. సర్వే అంచనాల ప్రకారం 60 శాతం కంటే ఎక్కువమంది ఈ సారి ట్రంప్‌కు ఓటేసినట్టు రిపబ్లికన్ హిందూ కొలిషన్ చైర్మన్ చెప్పారు -
అమెరికా అధ్యక్ష ఎన్నికలో భారతీయులు ఎటు?
న్యూయార్క్: పాకిస్థాన్ అంటే హిల్లరీ క్లింటన్‌కు సానుభూతి. ఆ దేశానికి వందల కోట్ల డాలర్ల ఆర్థిక సహాయం అందించారు. భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్థాన్ ఉపయోగిస్తున్న సైనిక ఆయుధాలు హిల్లరీ ఇచ్చినవే. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వీసాను అడ్డుకునేందుకు కూడా ఆమె ప్రయత్నించారు. రిపబ్లికన్ల అభ్యర్థిగా అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న డొనాల్డ్ ట్రంప్ వర్గం రూపొందించిన టీవీ యాడ్ ప్రచారం ఇది. 38 సెకండ్ల నిడివిగల ఈ టీవీ యాడ్‌ను అమెరికాలోని భారతీయ టీవీ ఛానళ్లలో శుక్రవారం నుంచి విస్తృతంగా ప్రసారం చేస్తున్నారు. క్రుక్డ్ క్లింటన్, వోట్ ఫర్ రిపబ్లికన్, వోట్ ఫర్ యూఎస్-ఇండియా రిలేషన్స్ అనే టైటిల్‌తో ఈ యాడ్‌ను రిపబ్లికన్ హిందూ కొహలిషన్(రిపబ్లికన్ హిందూ మత కూటమి) రూపొందించింది. హిల్లరీ క్లింటన్ ప్రధాన సహాయకురాలు హుమా హబేదిన్కు పాకిస్థాన్ మూలాలు ఉన్నాయని, క్లింటన్ అధికారంలోకి వస్తే ఆమెనే అమెరికా సైనిక దళాల ప్రధానాధికారిని చేస్తారని, హిల్లరీ భర్త బిల్ క్లింటన్ కూడా భారత్‌లోని కాశ్మీర్‌ను పాకిస్థాన్‌కు ఇచ్చి వేయాలని కోరుకుంటున్నారని కూడా టీవీ యాడ్ ఆరోపణలు చేసింది. పాకిస్థాన్ భూభాగంలో భారత్ సర్జికల్ దాడులు జరిపిన నాటి నుంచి అమెరికన్ భారతీయుల్లో పాకిస్థాన్ పట్ల వ్యతిరేకత, మోదీ ప్రభుత్వం పట్ల సానుకూలత పెరిగింది. అమెరికన్ భారతీయ ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఈ అంశాన్ని బాగా ఉపయోగించుకోవాలని ఇటు డొనాల్డ్ ట్రంప్, ఆయనకు మద్దతిస్తున్న హిందూ వర్గం భావిస్తోంది. అందులో భాగంగా టీవీ యాడ్ల ద్వారా ఊదరగొడుతున్నారు. 2012 లెక్కల ప్రకారం అమెరికాలో 30 లక్షల మంది భారతీయ ఓటర్లు ఉండగా, వారిలో సగం మంది హిందువులున్నారు. ట్రంప్‌ను బలపరుస్తున్న వారు రిపబ్లిక్ హిందూ కోహలిషన్గా, హిల్లరీని సమర్ధిస్తున్న వాళ్లు హిందూ డెమోక్రట్ గ్రూపులుగా వేరు పడ్డారు. పలు భారతీయ సంఘాల్లో భిన్నాభిప్రాయాలు గలవాళ్లు ఉన్నారు. హిందూ అమెరికన్ ఫౌండేషన్‌లో భిన్నాభిప్రాయాలు కలిగిన వాళ్లు ఉన్నప్పటికీ వారిలో ఎక్కువ మంది డెమోక్రట్ అభ్యర్థికే మద్దతు ఇస్తున్నారు. హిల్లరీని లక్ష్యంగా చేసుకొని భారతీయ టీవీలో ప్రసారం చేస్తున్న తాజా యాడ్‌ను వారు విమర్శిస్తున్నారు. విధానాలను కాకుండా వ్యక్తులను విమర్శించడం తగదని వారు అంటున్నారు. తాము భిన్నత్వంలో ఏకత్వాన్ని, ఇరుదేశాల మధ్య గౌరవ ప్రదమైన సంబంధాలను కోరుకుంటున్నామని చెప్పారు. ఆది నుంచి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అమెరికాలోని భారతీయులు డెమోక్రట్ అభ్యర్థులకే మద్దతిస్తూ వస్తున్నారు. కానీ ఈసారి రిపబ్లికన్ల తరఫున పోటీ చేస్తున్న ట్రంప్ ముస్లింలకు వ్యతిరేకంగా బహిరంగ విమర్శలు చేస్తుండడం, భారత్‌తో సంబంధాలకు ప్రాధాన్యత ఇస్తామని చెబుతుండడంతో ఓ వర్గం రిపబ్లికన్ల వైపు తిరిగారు. అయినప్పటికీ ఇటీవల నిర్వహించిన పలు సర్వేల్లో 60 శాతం మంది భారతీయులు అమెరికా అధ్యక్షుడిగా తాము ట్రంప్‌ను కోరుకోవడం లేదని వెల్లడైంది. అయితే అప్పటికి ఇప్పటికీ ట్రంప్‌కు భారతీయుల మద్దతు పెరిగినట్లు తెలుస్తోంది. కానీ అది ఎంత శాతమన్నది ఇప్పటికీ స్పష్టం కావడం లేదు. భారతీయులను మరింత ఆకర్షించడం కోసం అబ్ కీ బార్ ట్రంప్ సర్కార్ అనే నినాదం తీసుకొచ్చారు. 2014లో జరిగిన భారత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అబ్ కీ బార్ మోదీ సర్కార్ నినాదంతో అఖండ విజయం సాధించిన విషయం తెల్సిందే. మరి, ట్రంప్ నినాదం భారతీయులను ఏ మేరకు ప్రభావితం చేస్తుందో చూడాలి. -
హిల్లరీకి ఎన్నారైలు ఎన్ని నిధులిచ్చారో తెలుసా?
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ ఎన్నికల ప్రచారానికి ప్రవాస భారతీయులు భారీగా నిధులు సమకూర్చారు. 10 మిలియన్ డాలర్లు(సుమారు రూ. 66.9కోట్లు)పైగా నిధులు పోగుచేశారు. మేరీల్యాండ్ కు చెందిన ఫ్రాంక్ ఇస్లామ్, కాలిఫోర్నియాకు చెందిన రజ్దాన్ దుగ్గల్.. మిలియన్ డాలర్ల చొప్పున నిధులు సేకరించారని హిల్లరీ ప్రచార బృందం వర్గాలు వెల్లడించాయి. శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన అజయ్, వినిత భుటోరియా 5 లక్షల డాలర్లు పోగేశారు. 'హిల్ బ్లేజర్స్' పేరుతో బృందంగా ఏర్పడి ప్రవాస భారతీయులు విరాళాలు సేకరించారు. ఈ జాబితాలో లక్ష డాలర్లు ఇచ్చిన వారు, నిధులు సేకరించిన వారి పేర్లు ఉన్నాయి. గతేడాది ఏప్రిల్ 12 నుంచి హిల్లరీ కోసం ఎన్నారైలు నిధులు సేకరించడం మొదలుపెట్టారు. అనుకున్నదానికంటే పెద్ద మొత్తంలో ప్రవాసులు నిధులు పోగేశారని హిల్లరీ ప్రచార బృందం వర్గాలు తెలిపాయి. ఇజ్రాయిల్ అమెరికన్స్ తర్వాత అత్యధిక నిధులు సేకరించిన వారిగా ప్రవాస భారతీయులు గుర్తింపు పొందారు. కాగా, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ గెలవాలని అత్యధిక మంది ఇండియన్-అమెరికన్లు కోరుకుంటున్నట్టు సర్వేలు చెబుతున్నాయి. -
ఫోర్బ్స్ సంపన్నుల్లోని భారతీయ అమెరికన్లు వీరే
న్యూయార్క్: ఫోర్బ్స్ విడుదల చేసిన 'ది రిచెస్ట్ పీపుల్ ఇన్ అమెరికా 2016' జాబితాలో ఐదుగురు భారతీయ అమెరికన్లు చోటు దక్కించుకున్నారు. మైక్రోసాఫ్ట్ సహయజమాని బిల్ గేట్స్ 81 బిలియన్ డాలర్ల సంపదతో వరుసగా 23వ ఏటా ఫోర్బ్స్ జాబితాలో మొదటి స్ధానంలో నిలిచారు. మొత్తం 400మంది అమెరికా కుబేరుల జాబితాను ఫోర్బ్స్ విడుదల చేసింది. సింఫోని టెక్నాలజీ వ్యవస్ధాపకుడు రోమేశ్ వాద్వాని, సింటెల్ భారత్ ఔట్ సోర్సింగ్ కంపెనీ సహవ్యవస్ధాపకురాలు నీరజా దేశాయ్, ఎయిర్ లైన్స్ దిగ్గజం రాకేష్ గంగ్వాల్, జాన్ కపూర్, కవితాక్ రామ్ శ్రీరామ్ లు ఫోర్బ్స్ విడుదల చేసిన జాబితాలో ఉన్నారు. 69 ఏళ్ల వాద్వాని మూడు బిలియన్ డాలర్లతో జాబితాలో 222వ స్ధానంలో నిలిచారు. 2.5బిలియన్ డాలర్లతో దేశాయ్ 274వ స్ధానంలో నిలవగా, గంగ్వాల్ 2.2బిలియన్ డాలర్లతో 321వ స్ధానంలో, 2.1 బిలియన్ డాలర్లతో కపూర్ 335వ స్ధానంలో, 1.9 బిలియన్ డాలర్ల సంపదతో శ్రీరామ్ 361వ స్ధానంలో నిలిచారు. -
ట్రంప్ సలహా కమిటీలో భారతీయులు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గపడుతున్న క్రమంలో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అన్ని శక్తులనూ కూడగట్టుకొనే పనిలో నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా తన ‘ఆసియా పసిఫిక్ అమెరికా సలహా కమిటీ’ (ఏఏపీఐ)లో భారత సంతతి వారిని నియమించారు. మొత్తం 30 మంది ఉన్న ఈ కమిటీలో భారత సంతతికి చెందిన పునీత్ అహ్లూవాలియా (వర్జీనియా), కేవీ కుమార్ (కాలిఫోర్నియా), షలబ్ కుమార్ (ఇలియేయిస్) ఉన్నట్టు ట్రంప్ ప్రతినిధి తెలిపారు. షలబ్కుమార్ వ్యాపార దిగ్గజం. రిపబ్లికన్ హిందూ కొలియేషన్ వ్యవస్థాపక చైర్మన్. అహ్లూవాలియా వర్జీనియా ఏఏపీఐ సలహా మండలి సభ్యుడు. కేవీ కుమార్ గతంలో ప్రపంచ బ్యాంకులో పనిచేశారు. ట్రంప్ నాయకత్వంలో భారత్-అమెరికా సంబంధాలు నూతన శిఖరాలకు చేరతాయని షలబ్ కుమార్ విశ్వాసం వ్యక్తం చేశారు. -
వైట్‌హౌస్ కవిసమ్మేళనానికి భారత సంతతి యువత
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షభవనం వైట్‌హౌస్‌లో ఈ నెల 8వ తేదీన నిర్వహించే కవిసమ్మేళనానికి భారత సంతతికి చెందిన ఇద్దరు ఎంపికయ్యారు. అమెరికా ప్రథమ మహిళ, ఒబామా సతీమణి మిషెల్లీ ఒబామా ఈ వర్ధమాన యువ కవులకు స్వయంగా స్వాగతం పలకనున్నారని వైట్‌హౌస్ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం జార్జియాలో ఉంటున్న మాయా ఈశ్వరన్‌తోపాటు టెక్సాస్‌లోని డల్లాస్‌లో నివాసముంటున్న గోపాల్ రామన్.. సమ్మేళనంలో తమ కవితాసంపత్తిని ప్రదర్శించనున్నారు. వీరిద్దరి వయసు 20 ఏళ్ల లోపే కావడం గమనార్హం. వీరితోపాటు మరో ముగ్గురు యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. 2011 నుంచి ‘నేషనల్ స్టూడెంట్స్ పొఝెట్స్ ప్రోగ్రామ్’పేరుతో అమెరికా అధ్యక్ష భవనంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కళలు, రచనల్లో దేశవ్యాప్తంగా విశేష ప్రతిభ కనబర్చిన యువకులకు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నారు. కార్యక్రమం అనంతరం నేషనల్ స్కాలస్టిక్ ఆర్ట్ అండ్ రైటింగ్ అవార్డును అందజేస్తారు. -
కలాం మృతిపై భారతీయ అమెరికన్ల సంతాపం
వాషింగ్టన్: భారత రత్న పురస్కార గ్రహిత, మాజీ రాష్ట్రపతి, ప్రఖ్యాత శాస్త్రవేత్త అయిన ఏపీజీ అబ్దుల్ కలాం మరణవార్త విన్న భారతీయ అమెరికన్ల సంఘం సంతాపం వ్యక్తం చేసింది. మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(ఐఐఎం)లో సోమవారం జరిగిన ఒక కార్యక్రమంలో ప్రసంగిస్తూ సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో తీవ్ర గుండెపోటుతో ఏపీజే అబ్దుల్ కలాం(83) కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన ఇక లేడనే విషయాన్ని తాము జీర్ణించుకోలేకపోతున్నామని వారు విచారం వ్యక్తం చేశారు. నిరాడంబరత, వినయంతో కూడిన కలాం వ్యక్తిత్వం యువ హృదయాలకు కదిలించేలా చేసిందని కొనియాడారు. ఇటీవల కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన రాష్ట్రపతిగా అభివర్ణించారు. కలాం ప్రేరణ కలిగించే తన ప్రసంగాలతో దేశవ్యాప్తంగా పిల్లలు, యువ హృదయాలలో స్ఫూర్తి ప్రదాతగా సుస్థిరమైన స్థానాన్ని సంపాదించారని ప్రశంసించారు. భారతదేశ ప్రజలు, పిల్లలు అమితంగా ఇష్టపడే ఇలాంటి మహోన్నత వ్యక్తి అవసరం దేశానికి ఎంతైనా ఉందని పేర్కొన్నారు. ప్రపంచంలో నలుమూలల్లో ఉన్న ప్రతి భారతీయుడు గర్వంచదగ్గ మహోన్నత వ్యక్తి అబ్దుల్ కలాం అని చెప్పారు. భారత్ ఓ మహోన్నత వ్యక్తిని కోల్పోయిందని భారతీయ అమెరికన్ ఒకరు పేర్కొన్నారు. కలాం మృతి దేశానికి తీరని లోటు అని, ఆయన స్థానాన్ని భర్తీ చేయడం చాలా కష్టతరమైనదంటూ నాట్స్ పేర్కొంది. కలాంకు తెలుగువాళ్లతో ప్రత్యేకమైన అనుబంధం ఉందని, ఆయన జీవితంలో ఎక్కువ సమయం మన తెలుగుప్రజలతో గడిపారంటూ తానా అసోసియేషన్ ఆనాటి స్మృత్తులను గుర్తుచేసుకుంది. -
ఇంటెల్ సైన్స్ టాలెంట్ సెర్చ్‌లో ఎన్నారై విద్యార్థుల హవా
న్యూయార్క్ : ఇంటెల్ సైన్స్ టాలెంట్ సెర్చ్ నిర్వహించిన పరీక్షలో ఇండో - అమెరికన్ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. ఈ అవార్డులలో తెలుగు తేజం ప్రేమ్ బాబు (ఇన్నోవేషన్) రెండోస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. మరో తెలుగుతేజం కిషోర్ శశావత్ (బేసిక్ రీసెర్చ్) మూడో స్థానంలో నిలవగా, అన్విత (గుప్తా గ్లోబెల్ గూడ్) మూడో స్థానంలో నిలిచారు. గురువారం అమెరికా అధ్యక్షడు ఒబామా చేతుల మీదగా వీరంతా అవార్డులు అందుకున్నారు. మొత్తం 40 అవార్డుల్లో ఏకంగా 13 పురస్కారాలను ఇండో అమెరికన్ విద్యార్థులు దక్కించుకోవడం విశేషం. -
అమెరికా కుబేరుల్లో ఐదుగురు ఇండియన్స్
మెల్బోర్న్: అమెరికా శ్రీమంతుల జాబితాలో ఐదుగురు ఇండియన్-అమెరికన్లు చోటు సంపాదించారు. ఎన్నారై వ్యాపారవేత్తలు భరత్ దేశాయ్, జాన్ కపూర్, రొమేష్ వద్వానీ, రామ్ శ్రీరామ్, వినోద్ ఖోస్లా ఈ జాబితాలో ఉన్నారు. 400 మంది అమెరికా కుబేరుల పేర్లతో ఫోర్బ్స్ రూపొందించిన 'ద రిచెస్ట్ట్ పీపుల్ ఇన్ అమెరికా 2014' జాబితాలో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ అగ్రస్థానంలో నిలిచారు. ఈ 400 మంది అమెరికా కుబేరుల సంపద 2.29 ట్రిలియన్ డాలర్లుగా ఫోర్బ్స్ లెక్కగట్టింది. గతేడాది కంటే 270 బిలియన్ డాలర్లు సంపద పెరిగిందని వెల్లడించింది. -
యూఎస్‌లో మూడో స్థానంలో భారతీయ అమెరికన్లు
యూఎస్‌లో నివసిస్తున్న ఆసియా అమెరికన్ వాసుల్లో భారతీయ అమెరికన్లు మూడో స్థానంలో నిలిచారని సెంటర్ ఫర్ అమెరికన్ ప్రోగ్రస్ వెల్లడించింది. చైనా అమెరికన్లు, ఫిలిప్పీన్స్ అమెరికన్లు మొదటి రెండు స్థానాలలో నిలిచారని తెలిపింది. యూఎస్‌లో నివసిస్తున్న ఆసియా అమెరికన్ వాసులకు సంబంధించిన గణాంకాలతో కూడిన నివేదికను సెంటర్ ఫర్ అమెరికన్ ప్రోగ్రస్ గురువారం వాషింగ్టన్లో విడుదల చేసింది. 4.1 మిలియన్ల మందితో యూఎస్‌లో నివసిస్తూ అతి పెద్ద ఆసియా అమెరికన్ వాసులుగా చైనీయులు అవతరించారని, ఆ తర్వాత స్థానాన్ని 3.59 మిలియన్లతో ఫిలిప్పీన్స్ నిలిచారని వివరించింది. 3.34 మిలియన్ల మంది భారతీయులతో మూడో స్థానాన్ని ఆక్రమించారని పేర్కొంది. ఆ తర్వాత స్థానాలను వరుసగా వియాత్నాం, కొరియా, జపాన్ వాసులు ఉన్నారని పేర్కొంది. యూఎస్‌లో 56 శాతం ఆసియా అమెరికన్ కమ్యూనిటీ కాలిఫోర్నియా, న్యూయార్క్, టెక్సాస్, న్యూజెర్సీ, హవాయి రాష్ట్రాలలో నివసిస్తున్నారని సెంటర్ ఫర్ అమెరికన్ ప్రోగ్రస్ తన నివేదికలో తెలిపింది. -
అమెరికా ఎన్నికల్లో పది మంది ఎన్నారైలు!!
అమెరికాలో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఎనిమిది నెలల సమయం ఉంది. అయినా, ఇప్పటికే పది మంది భారత సంతతి పౌరులు ఈ ఎన్నికల్లో పోటీపడేందుకు సిద్ధం అయిపోతున్నారు. వరుసగా మూడుసార్లు ఎన్నికైన ఏకైక భారత అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు అమీ బెరా మరోసారి కాలిఫోర్నియా నుంచి బరిలోకి దిగుతున్నారు. కాలిఫోర్నియా అటార్నీ జనరల్ పదవికి మళ్లీ పోటీ చేస్తానని కమలా హారిస్ చెబుతున్నారు. కాలిఫోర్నియా గవర్నర్ పదవికి రిపబ్లికన్ నీల్ కష్కరీ రంగంలోకి దిగుతున్నారు. ఒకవేళ ఎన్నికైతే.. బాబీ జిందాల్, నిక్కీ హేలీల తర్వాత ఏకైక భారతీయ గవర్నర్ ఈయనే అవుతారు. అయితే.. ఈసారి అందరి కళ్లూ మాత్రం ఒబామా యంత్రాంగంలో వాణిజ్యశాఖ డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీ రో ఖన్నా మీదే ఉన్నాయి. తన పార్టీకే చెందిన మైక్ హోండాకు ఆయన గట్టి సవాలు విసిరి.. 17వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్‌కు పోటీ పడుతున్నారు. ఒబామా ఎన్నికకు ఖన్నా భారీ మొత్తంలో విరాళాలు సేకరించడమే కాక, ప్రచారంలో కూడా గట్టిగా పాల్గొన్నారు. ఇదే స్థానంలో మరో భారతీయ అమెరికన్ కూడా పోటీలో ఉన్నారు. వనీలా మాథుర్ సింగ్ అనే మెడికల్ ప్రొఫెసర్ కూడా రంగంలో ఉన్నా, గెలిచే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. కానీ ఒకే స్థానానికి ఇద్దరు ఎన్నారైలు పోటీపడటం మాత్రం ఇదే తొలిసారి అవుతుంది. న్యూజెర్సీ అసెంబ్లీలో ఎన్నారై ప్రతినిధిగా ఉన్న చివుకుల ఉపేంద్ర ఈసారి న్యూజెర్సీ 12వ కాంగ్రెషనల్ జిల్లా నుంచి హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌కు పోటీ పడనున్నట్లు చెప్పారు. ఇరాక్ యుద్ధంలో పాల్గొన్న మానన్ త్రివేదీ, ఇంకా పాల్ ర్యాన్, అమర్దీప్ కలేకా, స్వాతి దండేకర్, మంజు గోయల్ కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. -
ఇంటెల్ సైన్స్ పోటీలో 8మంది భారతీయ అమెరికన్లు
వాషింగ్టన్: అమెరికాలోని వాషింగ్టన్లో ప్రతిష్టాత్మకంగా జరగనున్న ఇంటెల్ సైన్స్ టాలెంట్ సర్చ్ కాంపీటీషన్లో 40 మంది సైన్స్ టాలెంట్ ఫైనలిస్టు విద్యార్థులు పోటీపడుతుండగా, వారిలో 8మంది భారతీయ అమెరికన్ విద్యార్ధులు ఉన్నారు. వాషింగ్టన్లో మార్చి 7నుంచి 13వరకు జరిగే వాషింగ్టన్ టాలెంట్ సర్చ్ కాంపీటీషన్లో ఈ 40మంది విద్యార్థులు పోటీపడుతున్నారు. అయితే వీరిలో టాప్ విజేతగా నిలిచే విద్యార్థికి ఇంటెల్ ఫౌండేషన్ తరపునా లక్ష డాలర్ల బహుమతిని అందజేస్తారు. సైన్స్ టాలెంట్ ఫైనలిస్టులుగా పోటీపడుతున్న 8మంది భారతీయ అమెరికన్ విద్యార్థులలో విష్ణు శంకర్, శ్రియా మిశ్రాలు కాలిఫోర్నియాకు చెందినవారు, చికాగో నుంచి రాహుత్ సిద్ధార్థ మెహతా, జార్జీయాకు చెందిన అనంద్ శ్రీనీవాసన్, మస్కట్ నుంచి అజయ్ సైనీ, న్యూయార్క్ నుంచి అనుభావ్ గుహా, ప్రితీ కాకానీలు ఉన్నారు. ఇదిలా ఉండగా, అమెరికాలో 40 ఉన్నత పాఠశాలలకు సీనియర్లు కావాలని, భవిష్యత్తులో ప్రపంచ అత్యుత్తమ సవాళ్లు ఎదుర్కోవడానికి వీరి సహాయం అవసరమవుతుందనే ఉద్దేశ్యంతో ఈ కాంపీటీషన్ నిర్వహించనున్నట్టు ఇంటెల్ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెండీ హకీన్స్ పేర్కొన్నారు. అయితే ఈ పోటీకి మొత్తం 1,700మంది పోటీపడగా, సెమీఫైనల్లో 300మంది విద్యార్థులను ఎంపికచేసినట్టు చెప్పారు. వారిలో 40మంది విద్యార్థులను మాత్రమే ఫైనల్‌కు ఎంపిక చేసినట్టు ఇంటెల్ నివేదిక వెల్లడించింది. శాస్త్రీయపరమైన విధానాలపై అభివృద్ధి సాధించడం, భవిష్యత్తులో రాబోయో సమస్యలను ఎలా పరిష్కరించాలి అనే అంశాలపై నైపుణ్యాన్ని సంపాదించేలా ది ఇంటెల్ సైన్స్ టాలెంట్ సర్చ్ విద్యార్థులను ప్రోత్సహిస్తోంది. ఈ పోటీలో పాల్గొనే అభ్యర్థుల శాస్త్రీయ పరిశోధన నైపుణ్యంపై, వారు సాధించిన విజయాలు, నాయకత్వ లక్షణాలను ఆధారంగా ఇంటెల్ నిర్వహణ అధికారులు ఎంపిక చేస్తారు.