సీఎన్‌ఎన్‌ హీరోస్‌ రేసులో ఇద్దరు ఇండో అమెరికన్లు | CNN Heroes of the Year: Two Indian-Americans in race | Sakshi
Sakshi News home page

సీఎన్‌ఎన్‌ హీరోస్‌ రేసులో ఇద్దరు ఇండో అమెరికన్లు

Published Fri, Dec 8 2017 10:12 PM | Last Updated on Fri, Dec 8 2017 10:12 PM

CNN Heroes of the Year: Two Indian-Americans in race - Sakshi

వాషింగ్టన్‌: ప్రతిష్టాత్మక సీఎన్‌ఎన్‌ హీరోస్‌ జాబితాలో ఈ ఏడాది ఇద్దరు ఇండో అమెరికన్ల పేర్లు కనిపిస్తున్నాయి. అమెరికాలోని పిట్స్‌బర్గ్‌లో నివాసముంటున్న సమీర్‌ లఖానీ, టెక్సాస్‌లో నివాసముంటున్న మోనా పటేల్‌ తుది పదిమంది జాబితాలో చోటుదక్కించుకున్నారు. డిసెంబర్‌ 17న సీఎన్‌ఎన్‌ హీరోస్‌ వార్షిక అవార్డుల ప్రదానోత్సవం జరుగుతుంది. ఓ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటుచేసి, దాని ద్వారా కాంబోడియాలోని మారుమూల గ్రామాల్లోని ప్రజలకు సేవ చేస్తున్న లఖానీ సేవలు ప్రశంసించదగినవంటూ సీఎన్‌ఎన్‌ పేర్కొంది. ‘2014లో కాంబోడియా పర్యటనకు వెళ్లిన లఖానీ... ఆ దేశంలోని ప్రజలు కనీసం సబ్బు కూడా కొనుక్కోలేని దుస్థితిలో ఉన్నారని గుర్తించారు. అప్పటి నుంచి తాను ఏర్పాటు చేసిన స్వచ్ఛంద సంస్థ ద్వారా కాంబోడియాలోని గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సబ్బులను సరఫరా చేస్తూ, ఆరోగ్యం, వ్యక్తిగత శుభ్రతపై అవగాహన కల్పిస్తున్నార’ని సీఎన్‌ఎన్‌ పేర్కొంది.

‘నేను కాంబోడియా వెళ్లినప్పుడు చూశాను.. అప్పుడే పుట్టిన ఓ బిడ్డను తల్లి లాండ్రీ పౌడర్‌తో స్నానం చేయిస్తోంది. అది నన్ను ఎంతగానో కదిలించి, ఈ సాయం చేసేలా ప్రేరేపించింద’ని లఖానీ పేర్కొన్నారు. ఇక శాన్‌ ఆంటోనియో యాంపుటీ ఫౌండేషన్‌ ద్వారా వికలాంగులకు సేవ చేస్తూ గుర్తింపు సంపాదించుకున్నారు మోనా పటేల్‌. వికలాంగులు తమ కాళ్లపై తామే నిలబడేలా చేయూతనందిస్తూ ప్రతినెలా 30 నుంచి 60 మందికి సాయం చేస్తున్నారు. ఈ కృషిని గుర్తించిన సీఎన్‌ఎన్‌ మోనా పటేల్‌కు కూడా తుదిజాబితాలో చోటు కల్పించింది. మరి ‘హీరోస్‌’గా అవార్డును వీరు దక్కించుకుంటారా? లేదా? అనే ప్రశ్నలకు డిసెంబర్‌ 17న సమాధానం దొరుకుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement