అమెరికా అధ్యక్ష ఎన్నికలో భారతీయులు ఎటు?
అమెరికా అధ్యక్ష ఎన్నికలో భారతీయులు ఎటు?
Published Sat, Nov 5 2016 8:37 PM | Last Updated on Thu, Apr 4 2019 4:25 PM
న్యూయార్క్: పాకిస్థాన్ అంటే హిల్లరీ క్లింటన్‌కు సానుభూతి. ఆ దేశానికి వందల కోట్ల డాలర్ల ఆర్థిక సహాయం అందించారు. భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్థాన్ ఉపయోగిస్తున్న సైనిక ఆయుధాలు హిల్లరీ ఇచ్చినవే. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వీసాను అడ్డుకునేందుకు కూడా ఆమె ప్రయత్నించారు. రిపబ్లికన్ల అభ్యర్థిగా అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న డొనాల్డ్ ట్రంప్ వర్గం రూపొందించిన టీవీ యాడ్ ప్రచారం ఇది.
38 సెకండ్ల నిడివిగల ఈ టీవీ యాడ్‌ను అమెరికాలోని భారతీయ టీవీ ఛానళ్లలో శుక్రవారం నుంచి విస్తృతంగా ప్రసారం చేస్తున్నారు. క్రుక్డ్ క్లింటన్, వోట్ ఫర్ రిపబ్లికన్, వోట్ ఫర్ యూఎస్-ఇండియా రిలేషన్స్ అనే టైటిల్‌తో ఈ యాడ్‌ను రిపబ్లికన్ హిందూ కొహలిషన్(రిపబ్లికన్ హిందూ మత కూటమి) రూపొందించింది. హిల్లరీ క్లింటన్ ప్రధాన సహాయకురాలు హుమా హబేదిన్‌కు పాకిస్థాన్ మూలాలు ఉన్నాయని, క్లింటన్ అధికారంలోకి వస్తే ఆమెనే అమెరికా సైనిక దళాల ప్రధానాధికారిని చేస్తారని, హిల్లరీ భర్త బిల్ క్లింటన్ కూడా భారత్‌లోని కాశ్మీర్‌ను పాకిస్థాన్‌కు ఇచ్చి వేయాలని కోరుకుంటున్నారని కూడా టీవీ యాడ్ ఆరోపణలు చేసింది.
పాకిస్థాన్ భూభాగంలో భారత్ సర్జికల్ దాడులు జరిపిన నాటి నుంచి అమెరికన్ భారతీయుల్లో పాకిస్థాన్ పట్ల వ్యతిరేకత, మోదీ ప్రభుత్వం పట్ల సానుకూలత పెరిగింది. అమెరికన్ భారతీయ ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఈ అంశాన్ని బాగా ఉపయోగించుకోవాలని ఇటు డొనాల్డ్ ట్రంప్, ఆయనకు మద్దతిస్తున్న హిందూ వర్గం భావిస్తోంది. అందులో భాగంగా టీవీ యాడ్ల ద్వారా ఊదరగొడుతున్నారు.
2012 లెక్కల ప్రకారం అమెరికాలో 30 లక్షల మంది భారతీయ ఓటర్లు ఉండగా, వారిలో సగం మంది హిందువులున్నారు. ట్రంప్‌ను బలపరుస్తున్న వారు రిపబ్లిక్ హిందూ కోహలిషన్‌గా, హిల్లరీని సమర్ధిస్తున్న వాళ్లు హిందూ డెమోక్రట్ గ్రూపులుగా వేరు పడ్డారు. పలు భారతీయ సంఘాల్లో భిన్నాభిప్రాయాలు గలవాళ్లు ఉన్నారు. హిందూ అమెరికన్ ఫౌండేషన్‌లో భిన్నాభిప్రాయాలు కలిగిన వాళ్లు ఉన్నప్పటికీ వారిలో ఎక్కువ మంది డెమోక్రట్ అభ్యర్థికే మద్దతు ఇస్తున్నారు. హిల్లరీని లక్ష్యంగా చేసుకొని భారతీయ టీవీలో ప్రసారం చేస్తున్న తాజా యాడ్‌ను వారు విమర్శిస్తున్నారు. విధానాలను కాకుండా వ్యక్తులను విమర్శించడం తగదని వారు అంటున్నారు. తాము భిన్నత్వంలో ఏకత్వాన్ని, ఇరుదేశాల మధ్య గౌరవ ప్రదమైన సంబంధాలను కోరుకుంటున్నామని చెప్పారు.
ఆది నుంచి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అమెరికాలోని భారతీయులు డెమోక్రట్ అభ్యర్థులకే మద్దతిస్తూ వస్తున్నారు. కానీ ఈసారి రిపబ్లికన్ల తరఫున పోటీ చేస్తున్న ట్రంప్ ముస్లింలకు వ్యతిరేకంగా బహిరంగ విమర్శలు చేస్తుండడం, భారత్‌తో సంబంధాలకు ప్రాధాన్యత ఇస్తామని చెబుతుండడంతో ఓ వర్గం రిపబ్లికన్ల వైపు తిరిగారు. అయినప్పటికీ ఇటీవల నిర్వహించిన పలు సర్వేల్లో 60 శాతం మంది భారతీయులు అమెరికా అధ్యక్షుడిగా తాము ట్రంప్‌ను కోరుకోవడం లేదని వెల్లడైంది. అయితే అప్పటికి ఇప్పటికీ ట్రంప్‌కు భారతీయుల మద్దతు పెరిగినట్లు తెలుస్తోంది. కానీ అది ఎంత శాతమన్నది ఇప్పటికీ స్పష్టం కావడం లేదు.
భారతీయులను మరింత ఆకర్షించడం కోసం అబ్ కీ బార్ ట్రంప్ సర్కార్ అనే నినాదం తీసుకొచ్చారు. 2014లో జరిగిన భారత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అబ్ కీ బార్ మోదీ సర్కార్ నినాదంతో అఖండ విజయం సాధించిన విషయం తెల్సిందే. మరి, ట్రంప్ నినాదం భారతీయులను ఏ మేరకు ప్రభావితం చేస్తుందో చూడాలి.
Advertisement