చేసిన పాపాలు శాపాలై వెంటాడతాయంటారు. అఫ్గానిస్తాన్‌లో రెండు దశాబ్దాలుగా తప్పు మీద తప్పు చేసుకుంటూ పోయిన అమెరికా అటువంటి స్థితినే ఎదుర్కొంటున్నది. ఆ దేశానికి అన్ని రకాలుగా తోడ్పడిన పాకిస్తాన్ వర్తమాన దుఃస్థితి చెప్పనవసరమే లేదు. అఫ్గాన్ నుంచి 2021 ఆగస్టు 15న అమెరికా సైన్యం కంగారుగా, బాధ్యతారహితంగా, పరమ అరాచకంగా వెనక్కొచ్చిన ఉదంతంపై బుధవారం అమెరికన్ కాంగ్రెస్ విదేశాంగ శాఖ కమిటీ ముందు పలువురు మాజీ సైనికాధికారులు, సైనికులు ఇచ్చిన వాంగ్మూలాలు అందరినీ దిగ్భ్రాంతిలో ముంచెత్తాయి.
అదే రోజు మహిళా దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ మాట్లాడుతూ అఫ్గానిస్తాన్ మహిళలు ప్రపంచంలోనే అత్యంత దారుణమైన మానవ హక్కుల ఉల్లంఘనను చవిచూస్తున్నారని ప్రకటించారు. వెనకా ముందూ చూసుకోకుండా తాలిబన్‌లతో ఆదరా బాదరాగా ఒప్పందం కుదుర్చుకుని అక్కడినుంచి వెనుదిరిగిన అమెరికాయే ఈ పరిస్థితికి కూడా బాధ్యత వహించాల్సి వుంటుంది.
నిష్క్రమణ రోజు కాబూల్‌లోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒకదాని వెంబడి ఒకటి చోటుచేసుకున్న ఉదంతాలు ఎవరూ మరువలేరు. తాలిబన్‌ల పునఃప్రవేశం, అమెరికా సైన్యం నిష్క్రమణ ఖాయమని నిర్ధారించుకున్నాక వేలాదిమంది అఫ్గాన్ పౌరులు ఆ విమానాశ్ర యానికి తరలివచ్చారు. అలా దాదాపు లక్షా 24 వేలమంది విమానాశ్రయంలో తలదాచుకోగా అంతకు రెట్టింపుమంది అప్పటికే దాదాపు 40 శాతం భూభాగం సొంతం చేసుకున్న తాలిబన్‌ల పడగ నీడలో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని తమ విముక్తి కోసం ఎదురుచూశారు.
నడిరోడ్లపై పడి గాపులు పడ్డారు. వీరంతా దాదాపు ఇరవైయ్యేళ్లుగా అమెరికా సైన్యానికి అండదండలందించినవారే. వీరిలో అనేకమంది పౌరులపై తాలిబన్‌లు దౌర్జన్యాలకు దిగటం ప్రారంభించారు. నిలదీసినవారిలో కొందరినైతే అక్కడికక్కడే కాల్చిచంపారు. పరిస్థితిని చక్కదిద్దటానికీ, నిష్క్రమణ సాఫీగా సాగటానికీ తాలిబన్‌లతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్న సీనియర్ అధికారులు వీటిల్లో చాలా ఉదంతాలను చూసీచూడనట్టు వదిలేశారు.
కొన్నింటిని లేవనెత్తినా ‘అది మా ఆంతరంగిక సమస్య’ అంటూ తాలిబన్‌లు బదులిచ్చినప్పుడు మౌనంగా ఉండిపోయారు. ఈలోగా భారీయెత్తున పేలుడు సంభ వించి 200మంది అఫ్గాన్ పౌరులతోపాటు 13 మంది అమెరికన్ సైనికులు మరణించారు. అనేకులు వికలాంగులుగా మిగిలిపోయారు. సుశిక్షితమైన సైన్యం, అత్యాధునిక సాంకేతికత ఉండి, ప్రత్యర్థులతో సంప్రదింపులు జరిపేటపుడు అనుకున్నది సాధించేవరకూ పట్టుదలగా వ్యవహరిస్తుందని గుర్తింపు పొందిన అమెరికా అఫ్గాన్ చిట్టచివరి అధ్యాయంలో బేలగా మిగిలిపోయింది.
యుద్ధకాలంలో సహకరించినవారిని చిట్టచివర నట్టేట ముంచుతుందన్న అపఖ్యాతి అమెరికాకు ఉన్నదనీ, అఫ్గాన్ పౌరుల విషయంలో అది మరోసారి రుజువైందనీ కమిటీ ముందు ఒక మాజీ సైనికాధికారి వాపోయిన తీరు ఆనాటి పరిస్థితులకు అద్దం పడుతుంది. ఆండ్రూస్ అనే మాజీ మెరైన్ ఒకరు 200 మంది దుర్మరణం పాలైన ఘటన గురించి చెప్పిన అంశాలు దిగ్భ్రాంతి కలిగిస్తాయి. మానవ బాంబులుగా అనుమానించిన ఇద్దరు జన సమూహంవైపు రావటం చూసిన ఆండ్రూస్, అతని సహచర సైనికుడు వారిపై చర్య తీసుకునేందుకు కమాండర్ అనుమతి కోరారట.
కానీ ఆయన నిరాకరించారు. మరికాస్సేపటికి మానవ బాంబులు తమను తాము పేల్చుకున్నారు. చిత్రమేమంటే ఆ తర్వాత మరో మూడు రోజులకు విమానాశ్రయానికి దగ్గర్లో ఒకరిని మానవబాంబుగా అను మానించి అమెరికా సైనికులు డ్రోన్ దాడి ద్వారా మట్టుబెట్టే ప్రయత్నం చేశారు. తీరా ఆ దాడిలో ఒక అఫ్గాన్ కుటుంబంలోని ముగ్గురు పెద్దలు, ఏడుగురు పిల్లలు మరణించారు. ఇలా తప్పు మీద తప్పు చేస్తూ పోయిన అమెరికా అఫ్గాన్ పౌరులకు మాత్రమే కాదు... తన సైనికులకు కూడా అన్యాయం చేసింది.
ఆ యుద్ధంలో పాల్గొన్న అనేకమంది సైనికులు ప్రస్తుతం అనేక మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో అమెరికా పరువుప్రతిష్ఠలు కోల్పోయింది. దాదాపు 2,500 మంది సైనికులను పోగొట్టుకుని, 2 లక్షల కోట్ల డాలర్ల సొమ్ము వృథా వ్యయం చేసింది. కానీ అఫ్గాన్ దేశానికీ, పౌరులకూ కలిగిన నష్టం అపారం. అదిప్పుడు శిథిలాల గుట్టగా మారింది. ఆ దేశ పౌరుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది.
80వ దశకంలో సోవియెట్ దురాక్రమణను ఎదుర్కొనే నెపంతో పాకిస్తాన్ ద్వారా అఫ్గాన్‌లో మతమౌఢ్యం పెంచి అల్ కాయిదా, తాలిబన్ వంటివి ఏర్పడటానికి దోహదపడింది అమెరికాయే. ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ వేదికల ద్వారా సంక్షోభాన్ని పరిష్కరించే ప్రయత్నం చేస్తే ఇంత చేటు ఉపద్రవం దాపురించేది కాదు. అక్కడ జోక్యం చేసుకోవటం ఎంత తప్పో, బాధ్యతారహితంగా నిష్క్రమించటం కూడా అంతే నేరం.
అమెరికా నిర్వాకానికి ఇప్పుడు రెండున్నర కోట్లమంది మహిళలు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. మొదట్లో తమ పాలనకు అంతర్జాతీయ గుర్తింపు పొందటానికి మహిళలకు అన్ని రకాల హక్కులూ ఇస్తామని నమ్మబలికిన తాలిబన్‌లు ఇప్పుడు అన్ని రంగాల నుంచీ వారిని వెళ్లగొట్టారు. చదువులకు దూరం చేశారు.
ట్రంప్ ఏలుబడినుంచీ వారిపై అమెరికాకు మంచి అభిప్రాయం కలగ జేసిన పాకిస్తాన్‌కు సైతం వారిప్పుడు కొరకరాని కొయ్యలయ్యారు. అమెరికన్ కాంగ్రెస్ కమిటీ ముందు వెల్లడైన అభిప్రాయాలు, ఇప్పుడు అఫ్గాన్ మహిళలు అనుభవిస్తున్న నరక యాతనలు ఆ దేశం కళ్లు తెరిపించాలి. జవాబుదారీతనాన్నీ, బాధ్యతాయుత ప్రవర్తననూ అలవర్చాలి.
అఫ్గాన్ విషాద సంగీతం
Published Fri, Mar 10 2023 12:23 AM | Last Updated on Fri, Mar 10 2023 5:02 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment