హిల్లరీకి ఎన్నారైలు ఎన్ని నిధులిచ్చారో తెలుసా?
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ ఎన్నికల ప్రచారానికి ప్రవాస భారతీయులు భారీగా నిధులు సమకూర్చారు. 10 మిలియన్ డాలర్లు(సుమారు రూ. 66.9కోట్లు)పైగా నిధులు పోగుచేశారు. మేరీల్యాండ్ కు చెందిన ఫ్రాంక్ ఇస్లామ్, కాలిఫోర్నియాకు చెందిన రజ్దాన్ దుగ్గల్.. మిలియన్ డాలర్ల చొప్పున నిధులు సేకరించారని హిల్లరీ ప్రచార బృందం వర్గాలు వెల్లడించాయి. శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన అజయ్, వినిత భుటోరియా 5 లక్షల డాలర్లు పోగేశారు.
'హిల్ బ్లేజర్స్' పేరుతో బృందంగా ఏర్పడి ప్రవాస భారతీయులు విరాళాలు సేకరించారు. ఈ జాబితాలో లక్ష డాలర్లు ఇచ్చిన వారు, నిధులు సేకరించిన వారి పేర్లు ఉన్నాయి. గతేడాది ఏప్రిల్ 12 నుంచి హిల్లరీ కోసం ఎన్నారైలు నిధులు సేకరించడం మొదలుపెట్టారు. అనుకున్నదానికంటే పెద్ద మొత్తంలో ప్రవాసులు నిధులు పోగేశారని హిల్లరీ ప్రచార బృందం వర్గాలు తెలిపాయి. ఇజ్రాయిల్ అమెరికన్స్ తర్వాత అత్యధిక నిధులు సేకరించిన వారిగా ప్రవాస భారతీయులు గుర్తింపు పొందారు. కాగా, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ గెలవాలని అత్యధిక మంది ఇండియన్-అమెరికన్లు కోరుకుంటున్నట్టు సర్వేలు చెబుతున్నాయి.