కన్సాస్ హీరోకు లక్ష డాలర్లు
భారీగా విరాళాలు సమకూర్చిన భారతీయులు
హూస్టన్: కన్సాస్ కాల్పుల ఘటనలో తుపాకీకి వెరవకుండా అలోక్ మేడసాని ప్రాణాలను కాపాడిన అమెరికావాసి ఇయాన్ గ్రిల్లట్‌పై వెల్లువెత్తిన సానుభూతి... అతనిని లక్ష్మీదేవి రూపంలో వరించింది. స్వస్థలమైన కన్సాస్‌లో ఇంటిని కొనుగోలు చేసుకునేందుకు అమెరికాలోని భారతీయులంతా చేయిచేయి కలిపి లక్ష డాలర్ల మేర విరాళాలు సేకరించారు.
గార్మిన్ కంపెనీలో పనిచేసే శ్రీనివాస్, అతని స్నేహితుడు మేడసాని అలోక్..ఫిబ్రవరి 22వ తేదీ రాత్రి కన్సాస్‌లోని ఓ బార్‌కు వెళ్లడం. అక్కడ నిందితుడు ఆడం పూరింటన్ వీరికి తారసపడడం తెలిసిందే. ‘మీరు మధ్యప్రాచ్యానికి చెందినవారు కదా. మా దేశం విడిచివెళ్లిపోండి’ అంటూ తొలుత శ్రీనివాస్, అలోక్‌లతో గొడవకు దిగాడు. ఆ తర్వాత బార్ నిర్వాహకులు అతనిని అక్కడి నుంచి బలవంతంగా బయటికి పంపగా కొద్దిసేపటి తర్వాత మళ్లీ అక్కడకు చేరుకుని ఆకస్మికంగా వీరిరువురిపై కాల్పులు జరపగా శ్రీనివాస్ చనిపోయాడు.
నిందితుడిని అడ్డుకునేందుకు యత్నించిన గ్రిల్లట్‌తోపాటు అలోక్‌కు గాయాలవగా ఆస్పత్రికి తరలించగా వారిరువురు ప్రాణాలతో బయటపడడం తెలిసిందే. గ్రిల్లట్‌కు కృతజ్ఞతగా ఈ కానుకను అందజేస్తున్నామని తమ ఫేస్‌బుక్ పేజీలో ఇండియాహౌస్ హూస్టన్ పేర్కొంది. ఈ విరాళాల సేకరణకు హూస్టన్‌లోని భారత కాన్సులర్ జనరల్ డాక్టర్ అనుపమ్ రే చొరవ తీసుకోవడం గమనార్హం. అమెరికాలోని భారత రాయబారి నవ్‌తేజ్ సర్నా ఈ చెక్కును ఇయాన్‌కు అందజేశారు.