స్త్రీ శక్తి: మడమ తిప్పలేదు... అడుగు ఆపలేదు | Womens Empowerment: Indian-Americans script history in US midterms | Sakshi
Sakshi News home page

స్త్రీ శక్తి: మడమ తిప్పలేదు... అడుగు ఆపలేదు

Published Tue, Nov 15 2022 12:34 AM | Last Updated on Tue, Nov 15 2022 7:44 AM

Womens Empowerment: Indian-Americans script history in US midterms - Sakshi

అరుణా మిల్లర్‌, పరిమళా జయపాల్‌, నబీలా సయ్యద్‌

పౌరహక్కుల నుంచి పర్యావరణం వరకు ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నారు. జాత్యహంకార బెదిరింపులు ఎన్ని ఎదురైనా ధైర్యమే వజ్రాయుధంగా ముందుకు కదిలారు. కొత్త అడుగుతో చరిత్ర సృష్టించారు. అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ఘన విజయం సాధించి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచిన మన వాళ్ల గురించి..

అరుణా మిల్లర్‌
మేరీలాండ్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా గెలిచిన అరుణా మిల్లర్‌ హైదరాబాద్‌లో పుట్టింది. భారత సంతతికి చెందిన వ్యక్తి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కావడం ఇదే మొదటిసారి. ఈ విషయంలో అరుణ చరిత్ర సృష్టించింది. మేరీలాండ్‌కు తొలి భారతీయ–అమెరికన్‌ డెలిగేట్‌గా తన ప్రత్యేకత చాటుకుంది. మిస్సోరీ యూనివర్శిటీలో సివిల్‌ ఇంజనీరింగ్‌ చేసిన అరుణ ట్రాన్స్‌పోర్టేషన్‌ ప్లానర్‌గా, ట్రాఫిక్‌ ఇంజనీర్‌గా వివిధ ప్రాంతాలలో పనిచేసింది. మిస్సోరీ ఫైర్‌బ్రాండ్‌గా గుర్తింపు పొందిన అరుణ ఆరోగ్య సంరక్షణ నుంచి పర్యావరణ పరిరక్షణ వరకు ఎన్నో కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించింది.

పరిమళా జయపాల్‌
పరిమళా జయపాల్‌ యూఎస్‌ హౌజ్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌(ప్రతినిధుల సభ)కు ఎంపికైన తొలి భారతీయ–అమెరికన్‌ మహిళ. తాజాగా 7వ డిస్ట్రిక్ట్‌(వాషింగ్టన్‌) నుంచి ప్రతినిధుల సభకు ఎంపికైంది. రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి క్లిఫ్‌మూన్‌పై విజయం సాధించింది. చెన్నైలో పుట్టిన పరిమళా జయపాల్‌ ఇండోనేషియా, మలేసియాలో పెరిగింది. తల్లి రచయిత్రి. తండ్రి మార్కెటింగ్‌ రంగంలో పనిచేశారు. పదహారు సంవత్సరాల వయసులో అమెరికాకు వెళ్లింది పరిమళ. జార్జ్‌టౌన్‌ యూనివర్శిటీ నుంచి బీఏ, కెలాగ్‌ స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ నుంచి ఎంబీఏ పట్టాలు పుచ్చుకుంది. చదువు పూర్తయిన తరువాత ఒక ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకులో ఫైనాన్షియల్‌ ఎనలిస్ట్‌గా పనిచేసింది.
రాజకీయాల్లోకి అడుగుపెట్టడానికి ముందు పౌరహక్కుల ఉద్యమాల్లో చురుగ్గా పనిచేసింది. ‘హేట్‌ ఫ్రీ జోన్‌’ అనే సంస్థను ప్రారంభించి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించింది. పరిమళ మంచి రచయిత్రి కూడా. ‘పిల్‌గ్రిమేజ్‌: వన్‌ వుమెన్స్‌ రిటర్న్‌ టు ఏ ఛేంజింగ్‌ ఇండియా’ అనే పుస్తకం రాసింది.
‘నువ్వు మీ దేశానికి వెళ్లి పో’ అంటూ ఆమెకు ఎన్నోసార్లు బెదిరింపు కాల్స్‌ వచ్చాయి. అయితే ఆమె వాటిని ఎప్పుడూ ఖాతరు చేయలేదు. వెనక్కి తగ్గలేదు.

నబీలా సయ్యద్‌
అమెరికాలో జరిగిన మధ్యంతర ఎన్నికలలో ఇల్లినాయి జనరల్‌ అసెంబ్లీకి ఎన్నిక కావడం ద్వారా 23 ఏళ్ల ఇండియన్‌–అమెరికన్‌ నబీలా సయ్యద్‌ చరిత్ర సృష్టించింది. డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన నబీలా 51వ డిస్ట్రిక్ట్‌లో రిపబ్లిక్‌ పార్టీకి చెందిన క్రిస్‌ బోస్‌పై ఘన విజయం సాధించింది. ఇల్లినాయి రాష్ట్రంలోని పాలై్టన్‌ విలేజ్‌లో పుట్దింది నబీలా. హైస్కూల్‌ రోజుల నుంచి ఉపన్యాస పోటీల్లో చురుగ్గా పాల్గొనేది. వాటి ద్వారా రకరకాల సామాజిక విషయాలను లోతుగా తెలుసుకునే అవకాశం వచ్చింది. కాలేజిలో ఎన్నో చర్చావేదికల్లో పాల్గొనేది. యూనివర్శిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా నుంచి పొలిటికల్‌ సైన్స్, బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌లలో పట్టా పుచ్చుకుంది. స్త్రీ సాధికారత, హక్కులకు సంబంధించి ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొనే నబీలా ఉద్యోగం కంటే ఉద్యమాలకే ప్రాధాన్యత ఇచ్చేది. ఈ క్రమంలోనే రాజకీయాలకు దగ్గరైంది. ‘ఎమిలీస్‌ లిస్ట్‌’తో కలిసి పనిచేసింది. ఎమిలీస్‌ లిస్ట్‌ అనేది డెమోక్రటిక్‌ మహిళా అభ్యర్థులు చట్ట సభకు ఎన్నిక కావడానికి ఉపకరించే పొలిటికల్‌ యాక్షన్‌ కమిటీ.‘నా విజయానికి ప్రధాన కారణం తమ తరపున పోరాడే, బలంగా గొంతు వినిపించే వ్యక్తిని ప్రజలు తమ ప్రతినిధిగా చట్టసభకు పంపాలనుకోవడం. వారి నమ్మకాన్ని నిలబెడతాను’ అంటోంది నబీలా.ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటి తలుపు తట్టిన నబీలా తనను గెలిపించిన వారికి కృతజ్ఞతలు తెలియజేయడానికి మళ్లీ ఇంటింటికీ వెళ్లనుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement