ఏ షేర్లు పెరుగుతాయో ముందే తెలుసుకొని..
న్యూయార్క్: షేర్ విలువ ముందే తన భార్య ద్వారా తెలుసుకొని ఆ విషయం మిత్రులతో పంచుకొని ఓ భారత సంతతి వ్యక్తి జైలు పాలయ్యాడు. చట్ట విరుద్ధంగా షేర్ మార్కెట్లో ఇన్‌సైడర్ ట్రేడింగ్ పాల్పడిన అతడికి ఇరవై నెలల జైలు శిక్ష పడింది. అంతేకాకుండా రెండు లక్షల అమెరికన్ డాలర్ల జరిమానా విధించడంతోపాటు వంద గంటలు కమ్యూనిటీ సేవ చేయాలని జిల్లా కోర్టు న్యాయమూర్తి నతనెయిల్ గార్టన్ తీర్పిచ్చారు.
అమిత్ కనోడియా (49) అనే వ్యక్తి గతంలో ఓ ప్రైవేట్ ఇక్విటీలో పెట్టుబడులు పెట్టేవాడు. అతడి భార్య అపోలో టైర్స్ (భారత ఆధారిత కంపెనీ)లో జనరల్ కౌన్సిల్‌లో పనిచేస్తోంది. తన భార్య ద్వారా ఆ కంపెనీ న్యూయార్క్ స్టాక్ ఎక్చేంజ్ లో షేర్ విలువల విషయాలు తెలుసుకున్న గార్టన్, 2013లో తన మిత్రులు ఇఫ్తికర్ అహ్మద్, స్టివెన్లతో పంచుకుని అనంతరం షేర్లు కొనుగోలు చేశారు. వారికి ముందుగా తెలిసిన ప్రకారమే ఆ రోజు కూపర్ టైర్ కంపెనీ షేర్ విలువ అమాంతం 41 శాతం పెరిగింది. దీంతో వెంటనే వారు కొన్న షేర్లను అమ్మేశారు. ఇలా చేయడం ద్వారా వారికి ఒక మిలియన్ యూస్ డాలర్లు వచ్చాయి.
అక్రమాలకు పాల్పడటం ద్వారా వారు ఈ సొమ్మును ఆర్జించారని అనంతరం గుర్తించిన పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన విచారణ గతేడాది అక్టోబర్ నుంచి కొనసాగింది. తాజాగా గురువారం జ్యూరి సభ్యులు అమిత్ ను దోషిగా తేల్చారు. నవంబర్లో అహ్మద్ కు రెండేళ్ల శిక్షతో పాటు, 25వేల అమెరికన్ డాలర్ల జరిమానా విధించారు.