నాలుగు నెలలుగా సౌదీ జైలులో మగ్గుతున్న వలస కార్మికులు
ఆదుకోవాలంటూ ‘న్యూస్‌లైన్’కు ఫోన్ చేసిన బాధితులు
కామారెడ్డి, న్యూస్‌లైన్: బతుకుదెరువు కోసం ఎడారి దేశాలకు వెళ్లిన యువకులు అక్కడి ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలతో నాలుగు నెలలుగా జైళ్లలో మగ్గుతున్నారు. తమను ఎవరూ పట్టించుకోవడం లేదంటూ బాధితులు ఫోన్‌లో తమ గోడును వెళ్లబోసుకున్నారు. నిజామాబాద్ జిల్లా మాచారెడ్డి మండలం లచ్చాపేటకు చెందిన మిరిదొడ్డి అనిల్ గురువారం ‘న్యూస్‌లైన్’తో ఫోన్‌లో మాట్లాడారు. ‘నతాఖత్’ చట్టం అమలులోకి రావడంతో పలు కంపెనీలు చాలా మంది కార్మికులను బయటకు పంపించాయి.
ఈ నేపథ్యంలో అనుమతి లేకుండా సౌదీలో ఉంటున్నారంటూ తనతోపాటు దాదాపు రెండు వందల మంది జైలులో వేశారని తెలిపారు. మాచారెడ్డి మండలం రాజఖాన్‌పేటకు చెందిన విజయ్, ఎల్లంపేటకు చెందిన మోహన్, సదాశివనగర్ మండలం కన్నాపూర్‌కు చెందిన భిక్షపతి, తాడ్వాయి మండలం అర్గొండకు చెందిన సాయిలు, కొండాపూర్‌కు చెందిన రాంచందర్‌తోపాటు వివిధ ప్రాంతాలవారు ఇందులో ఉన్నారని వివరించారు. జైలులో సరైన తిండి లేక ఇబ్బందులు పడుతున్నామని, తమ గోడును భారత రాయబార కార్యాలయం అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాము పడుతున్న ఇబ్బందుల గురించి నాయకులకు ఫోన్‌లు చేసి చెప్పినా ఎవరూ పట్టించుకోలేదన్నారు. తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు.
కారా‘ఘోరం’.. సౌదీ జైలులో వలస కార్మికులు
Published Fri, May 2 2014 3:09 AM | Last Updated on Sat, Sep 2 2017 6:47 AM
Advertisement