Nitaqat law
-
కారా‘ఘోరం’.. సౌదీ జైలులో వలస కార్మికులు
నాలుగు నెలలుగా సౌదీ జైలులో మగ్గుతున్న వలస కార్మికులు ఆదుకోవాలంటూ ‘న్యూస్‌లైన్’కు ఫోన్ చేసిన బాధితులు కామారెడ్డి, న్యూస్‌లైన్: బతుకుదెరువు కోసం ఎడారి దేశాలకు వెళ్లిన యువకులు అక్కడి ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలతో నాలుగు నెలలుగా జైళ్లలో మగ్గుతున్నారు. తమను ఎవరూ పట్టించుకోవడం లేదంటూ బాధితులు ఫోన్లో తమ గోడును వెళ్లబోసుకున్నారు. నిజామాబాద్ జిల్లా మాచారెడ్డి మండలం లచ్చాపేటకు చెందిన మిరిదొడ్డి అనిల్ గురువారం ‘న్యూస్‌లైన్’తో ఫోన్లో మాట్లాడారు. ‘నతాఖత్’ చట్టం అమలులోకి రావడంతో పలు కంపెనీలు చాలా మంది కార్మికులను బయటకు పంపించాయి. ఈ నేపథ్యంలో అనుమతి లేకుండా సౌదీలో ఉంటున్నారంటూ తనతోపాటు దాదాపు రెండు వందల మంది జైలులో వేశారని తెలిపారు. మాచారెడ్డి మండలం రాజఖాన్పేటకు చెందిన విజయ్, ఎల్లంపేటకు చెందిన మోహన్, సదాశివనగర్ మండలం కన్నాపూర్‌కు చెందిన భిక్షపతి, తాడ్వాయి మండలం అర్గొండకు చెందిన సాయిలు, కొండాపూర్‌కు చెందిన రాంచందర్‌తోపాటు వివిధ ప్రాంతాలవారు ఇందులో ఉన్నారని వివరించారు. జైలులో సరైన తిండి లేక ఇబ్బందులు పడుతున్నామని, తమ గోడును భారత రాయబార కార్యాలయం అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాము పడుతున్న ఇబ్బందుల గురించి నాయకులకు ఫోన్లు చేసి చెప్పినా ఎవరూ పట్టించుకోలేదన్నారు. తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు. -
నతాఖా బాధితులకు ఊరట
రియాద్ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: సౌదీ అరేబియా తీసుకొచ్చిన నూతన కార్మిక చట్టం(నతాఖా) బాధితులకు వెసులుబాటు(అఖామాల రెన్యువల్) కల్పిస్తూ.. వారు తమ పత్రాలను సరిచేసుకోవడానికి నెలరోజులపాటు సౌదీ ప్రభుత్వం గడువు ఇచ్చింది. ఈ మేరకు సౌదీ కార్మిక శాఖ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో ఆంధ్రప్రదేశ్ నుంచి సౌదీ అరేబియాకు వెళ్లిన కార్మికులకు కొద్దిపాటి ఊరట లభించినట్లయింది. సౌదీ అరేబియాలోని భవన నిర్మాణం, వ్యాపారాలు, స్థానిక కర్మాగారాలు, హోటళ్లు, రెస్టారెంట్లలో పనిచేస్తున్న తెలుగువారికి ఈ ఉత్తర్వుల ద్వారా లబ్ధి చేకూరనుంది. స్థానిక కంపెనీలు, భవన నిర్మాణ, షాపింగ్‌మాల్, చిన్న కంపెనీల యజమానులు కూడా తమ వద్ద పనిచేసున్న ఉద్యోగుల పత్రాలను సరిచేసుకునే అవకాశమిచ్చింది. విదేశీ కార్మికులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించింది. వ్యాపారసంస్థలు, ఫ్యాక్టరీలు, హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులు తమ వద్ద పనిచేస్తున్న విదేశీయుల అఖామా(వర్క్ పర్మిట్)లను సరిచేయించాలని కోరింది. కార్మికశాఖ ద్వారా గుర్తింపు పొందిన అఖామాలు కలిగి ఉన్న విదేశీయుల్నే పనిలో నియమించుకోవాలని, లేనిపక్షంలో ఆయా సంస్థలు, వ్యాపార సముదాయాలపై కేసులు పెడతామని సౌదీ ప్రభుత్వం హెచ్చరించింది. దాడులు కొనసాగుతాయని, అఖామా రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకున్న పత్రాలను చూపినట్లయితే ఎలాంటి అరెస్టులు ఉండబోవని స్పష్టం చేసింది. -
నతాఖా బాధితులకు ఊరట!
రియాద్ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: నతాఖా చట్టం బాధితులకు కొంత ఊరట కలిగించేలా సౌదీ ఆరేబియా ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అక్రమంగా సౌదీలో నివాసం ఉంటున్న వారి స్థితి ధృవీకరణృ క్రమబద్ధీకరణకు మరోమారు వెసులుబాటు కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అక్రమంగా నివసిస్తున్న కార్మికుల చట్టబద్ధత కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుం దని ప్రకటించింది. అయితే నతాఖా చట్టం గడువులోగా ధృవీకరణలు క్రమబద్దీకరణ చేసుకోనందున జరిమానా, శిక్షలు తప్పవని స్పష్టం చేసింది. అక్రమంగా నివసించే కార్మికుల కోసం తనిఖీలు యథావిధిగా కొనసాగుతాయని అక్కడి మంత్రిత్వశాఖ డెరైక్టర్ జనరల్ ఆఫ్ ఇన్స్పెక్షన్స్ అధికారి ఫైసల్ అల్ ఓటాబీ వెల్లడించారు. నతాఖా చట్టం కింద నివాస ప్రతిపత్తిని సరిచేసుకోవడం లేదా దేశం విడిచి వెళ్లి పోయేందుకు ఇచ్చిన ఏడు నెలల గడువు ముగియడంతో వారం రోజులుగా అరెస్టులు కొనసాగుతున్న విషయం విదితమే. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వేలాదిమంది తెలుగువారు ఇప్పటికే అరెస్ట్ ఆయ్యారు. మరి కొందరు స్వదేశానికి తిరిగి వచ్చేందుకు ఎగ్జిట్ పాస్‌లు పొంది నిరీక్షిస్తున్నారు. గడువు కంటే ముందుగా దరఖాస్తు చేసుకున్న వారికి సైతం ఎగ్జిట్ పర్మిట్ జారీ ప్రక్రియ నత్తలను తలపిస్తోంది. ఆదివారం ధమామ్, రియాద్, జెడ్డా, తైఫ్, ఆల్ఖుబర్, మదీ నా తదితర ప్రాంతాల్లోని ముమ్మర తనిఖీలు కొనసాగాయి. కాగా, సౌదీలో నివాస ప్రతిపత్తి లేని కార్మికులు తమకు తెలిసిన వారితో నివాస ప్రతిపత్తి క్రమబద్ధీకరణ కోసం ప్రయత్నిస్తున్నారు. సౌదీలోని కపీల్స్లకు సైతం గుబులు పట్టుకుంది. విదేశాల నుంచి పనికోసం సౌదీ అరేబియా చేరుకున్న వారే కాకుండా వారికి వీసా ఇచ్చి పిలిపించుకున్న స్థానికులు, పనిలో పెట్టుకున్నవారు ముగ్గురూ శిక్షార్హులేనని అక్కడి కార్మిక శాఖ అదేశాలు జారీ చేయడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. దీంతో తమవద్ద అక్రమంగా పనిలో పెట్టుకున్న వారిని అక్కడి వ్యాపారులే వర్క్‌పర్మిట్ రెన్యువల్ కోసం విడుదల చేస్తున్నారు. కంపెనీలపై దృష్టి: నతాఖా చట్టం కింద అక్రమ కార్మికుల కోసం రోడ్లపై తనిఖీలు కొనసాగిస్తున్న పోలీసు, కార్మిక శాఖాధికారులు సోమవారం నుంచి కంపెనీలపై దృష్టి సారించారు. ముమ్మర తనిఖీల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. రియాద్‌లో 55, జిద్దాలో 64, అల్ఖుబార్లో 45 బృందాలను ఏర్పాటు చేశారు. ప్రతి బృందానికి ఇద్దరు ఇన్స్పెక్టర్లతోపాటు సెక్యూరిటీ అధికారులను నియమించారు. కంపెనీలపై ఏ క్షణమైనా దాడులు జరిగే అవకాశం ఉంది. పని గంటలతో సంబంధం లేకుండా ఏ క్షణంలోనైనా తని ఖీలు చేసేందుకు సిద్ధంగా ఉండాలని కార్మికశాఖ అదేశాలు జారీ చేసింది. ప్రైవేట్ కంపెనీలకు నోటీసులు జారీ చేసింది. రియాద్, జెడ్డాలో ప్రత్యేక కౌంటర్లు : నతాఖా చట్టం బాధితులను స్వదేశానికి సురక్షితంగా తీసుకువచ్చేందుకు భారత ప్రభుత్వం సహాయక చర్యలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. రియాద్, జెడ్డా, ధమామ్లో ప్రత్యేక ఎయిర్ కౌంటర్లను ఏర్పాటు చేస్తునట్లు రియాద్‌లో ఎయిర్ ఇండియా మేనేజర్ ప్రభుచంద్ర తెలిపారు. స్తంభించిన వ్యాపారం, వాణిజ్యం సౌదీలోవాణిజ్య, వ్యాపార రంగాలపై నతాఖా తీవ్ర ప్రభావం చూపుతోంది. సౌదీ అరేబియాలో వారం రోజుల నుంచి జనజీవనం స్తంభించిపోయింది. వ్యాపార సంస్థలు, పాఠశాలలు, కార్యాలయాలు ఆదివారం కూడా తెరుచుకోలేదు. ప్రతినిత్యం సందడిగా ఉండే ప్రధాన కేంద్రాలు జనం లేక బోసిపోతున్నాయి. ఇప్పటికే పలు కంపెనీలతోపాటు వందలాది వ్యాపార, వాణిజ్య కేంద్రాలు మూత పడ్డాయి. షాపింగ్ కాంపెక్స్‌లు తెరుచుకొలేదు. పండ్లు, కూరగాయల మార్కెట్లో ఎగుమతి, దిగుమతి నిలిచిపోయింది. తక్షణమే చర్యలు చేపట్టాలి నతాఖా చట్టం బాధితులను సురక్షితంగా స్వదేశానికి తెచ్చేందుకు ప్రభుత్వం యుద్ధప్రాతిప్రధికన చర్యలు చేపట్టాలి. ఉపాధి కొల్పోయి చేతిలో చిల్లిగవ్వ లేక తెలుగువారు తల్లడిల్లుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సౌదీకి ఒక బృందాన్ని పంపించి సహాయక చర్యలు చేపట్టాలి. - కె.నర్సింహనాయుడు, గల్ఫ్ బాధితుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు, హైదరాబాద్ -
సౌదీలో నతాఖా.. తడాఖా
వందల సంఖ్యలో తెలుగువారి అరెస్టులు సాక్షి, హైదరాబాద్: సౌదీ అరేబియా ప్రభుత్వం ‘నతాఖా’ చట్టం కింద అక్రమంగా నివసిస్తున్న విదేశీయులపై కొరడా ఝళిపిస్తోంది. సౌదీకి వివిధ దేశాల నుంచి వచ్చి అక్రమంగా ఉంటున్న వారు తమ నివాస ప్రతిపత్తి(అఖామా)ని సరిచేసుకోవడం.. లేదా, దేశం విడిచి వెళ్లేందుకు ఇచ్చిన ఏడు మాసాల గడువు ముగియడంతో అక్కడి అధికారులు పెద్ద ఎత్తున తనిఖీలు ముమ్మరం చే శారు. మొదటి రోజు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తెలుగువారు పెద్దగా అరెస్ట్ కాలేదు. కానీ, మంగళవారం మాత్రం వందల సంఖ్యలో అరెస్టు అయినట్లు తెలుస్తోంది. ముఖ్య నగరాలైన ధమామ్, రియాద్, జిద్దా, తైఫ్, ఆల్ఖుబర్, మదీనా తదితర ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు నిర్వహించగా, వందల సంఖ్యలో తెలుగువాళ్లు పట్టుబడినట్లు అక్కడి పోలీసు ప్రతినిధి నవాఫ్ ఆల్ బెట్ ధ్రువీకరించారు. అవుట్ పాస్‌లు కలిగి ఉన్నవారిని వదిలేసి నివాస ధ్రువీకరణ పత్రాలు లేనివారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. కనిపించిన వారిని కనిపించినట్లే అరెస్ట్ చేసి బలవంతంగా ప్రత్యేక పోలీసు వాహనాల్లో జైళ్లకు తరలించినట్లు సమాచారం. రోడ్లతో పాటు ప్రధాన వీధుల్లో ముమ్మర తనిఖీలు కొనసాగుతుండటంతో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కార్మికులు గదుల్లోంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. పర్మిట్ల కోసం పడరాని పాట్లు సౌదీ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చేందుకు ఎగ్జిట్ పర్మిట్ల కోసం తెలుగువాళ్లు పడరాని పాట్లు పడుతున్నారు. గడువు కంటే ముందుగా దరఖాస్తు చేసుకున్న వారికి సైతం సకాలంలో ఎగ్జిట్ పర్మిట్ లభించలేదు. గడువు ముగియడంతో మరికొందరు చాటుమాటుగా వెళ్లి పర్మిట్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసినా.. ఫలితం లేకుండా పోతోంది. దీంతో ప్రధాన కార్యాలయాల సమీపంలో తమకు తెలిసిన వారి నివాసాల్లో పోలీసుల కంటబడకుండా తలదాచుకుంటున్నారు. కొందరికి అవుట్ పాస్‌లు లభించినా.. చేతిలో చిల్లి గవ్వలేక, అప్పులు లభించక తల్లడిల్లుతున్నారు. మరికొందరు డబ్బులు సమకూర్చుకున్నప్పటికీ హజ్ యాత్రికుల తిరుగు ప్రయాణం నేపథ్యంలో విమానాల టికెట్ల రేట్లు అధికమయ్యాయి. దీంతో వారి పరిస్థితి దిక్కుతోచకుంది. అంతా నిశ్శబ్దం దేశంలోని ప్రధాన నగరాల్లో ప్రతినిత్యం సందడిగా ఉండే కేంద్రాల్లో నిశ్శబ్దం ఆవరించింది. కార్మికులు లేకపోవడంతో వందలాది వ్యాపార, వాణిజ్య కేంద్రాలు మూతపడ్డాయి. వినియోగదారుల రద్దీ పూర్తిగా తగ్గిపోయింది. రియాద్‌లో సిటీ సెంటర్, జిద్దా తదితర నగరాల్లోని వాణిజ్య సముదాయాలు పూర్తిగా బోసిపోయాయి. పండ్లు, కూరగాయల మార్కెట్లు సైతం వెలవెలబోయాయి. సరుకుల ఎగుమతి, దిగుమతులకు కార్మికుల కొరత నెలకొంది. భవన నిర్మాణ రంగం పూర్తిగా స్తంభించిపోయింది. పాఠశాలలు మూతపడ్డాయి. ఎంబసీ ముందు ప్రైవేటు మహిళా టీచర్లు ఆందోళనకు దిగారు. స్పందించని ప్రభుత్వాలు సౌదీలో ప్రభుత్వ నూతన కార్మిక చట్టం నతాఖా కారణంగా వేలాది మంది తెలుగువాళ్లు ఉపాధి కోల్పోయి భయం గుప్పిట్లో ఉన్నప్పటికీ ప్రభుత్వాల నుంచి వారికి కనీస భరోసా లభించడం లేదు. ఒక సారి అరెస్ట్ అయి జైలుకు వెళ్లితే మాత్రం జడ్జిమెంట్ వచ్చేంతవరకు అందులోనే మగ్గాల్సి ఉంటుందని ఇక్కడి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఇంత జరుగుతున్నా ఇక్కడి ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. వెనక్కొచ్చే వారికి పూర్తి సాయం: వయలార్ రవి న్యూఢిల్లీ: సౌదీ అరేబియాలో కొత్త కార్మిక చట్టం నతాఖా కారణంగా స్వదేశానికి పయనమయ్యే భారతీయులందరికీ పూర్తి సాయం అందిస్తామని ప్రవాస వ్యవహారాల మంత్రి వయలార్ రవి చెప్పారు. సౌదీలో పరిస్థితిని భారత్ సునిశితంగా గమనిస్తోందని, పలు అసోసియేషన్లతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. తెలుగువారిని ఆదుకోవాలి సౌదీలో నివాస ప్రతిపత్తి లేని వారిని సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. నతాఖా చట్టం కృరణంగా కంపెనీలు పని నుంచి తీసివేయడంతో చేతిలో చిల్లిగవ్వ లేకుండాపోయింది. తక్షణమే ప్రభుత్వం ఒక బృందాన్ని అక్కడికి పంపించి ప్రత్యేక విమానాల్లో వారికి తీసుకుని వచ్చేందుకు చర్యలు చేపట్టాలి. -కోటపాటి నర్సింహానాయుడు, రాష్ట్ర అధ్యక్షుడు, గల్ఫ్ బాధితుల హక్కుల పోరాట సమితి -
భయం గుప్పిట్లో తెలుగోళ్లు
సౌదీలోఎగ్జిట్ పర్మిట్ల కోసం అగచాట్లు 16 వేల మందికి నిష్ర్కమణ సర్టిఫికెట్లు మిగతావారి పరిస్థితి అగమ్యగోచరం గడుపు పొడిగించని సౌదీ ప్రభుత్వం నేటి నుంచి కార్మిక శాఖ అధికారుల తనిఖీలు సాక్షి, హైదరాబాద్ సిటీబ్యూరో/ సౌదీ నుంచి న్యూస్‌లైన్ విలేకరి: సౌదీ అరేబియాలో తెలుగువాళ్లు భయం గుప్పెట్లో బతుకీడుస్తున్నారు. అక్కడి ప్రభుత్వం నతాఖా చట్టం కింద విధించిన గడువు ఆదివారంతో ముగిసింది. దీంతో అక్కడి కార్మిక శాఖ అధికారులు సోమవారం నుంచే ప్రైవేటు కంపెనీలపై విస్తృతంగా దాడులు నిర్వహించి.. అక్రమ వలసవాదులను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే కార్మిక మంత్రిత్వశాఖ నతాఖా చట్టం కింద తనిఖీలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. సౌదీ ప్రభుత్వం గడువు పొడిగింపుపై ఎలాంటి ప్రకటన చేయని కారణంగా దేశం విడిచి వెళ్లేందుకు సుమారు 16 వేలకు పైగా కార్మికులు అక్కడి రాయబార కార్యాలయం నుంచి అత్యవసర సర్టిఫికెట్లు(ఈసీఎస్)లను పొందారు. ఆదివారం సైతం రియాద్‌లోని పాస్‌పోర్టు కార్యాలయం ముందు బారులు తీరారు. మరోవైపు సౌదీలోని దమ్మామ్, జిద్దా, ఆల్సత్, జూలైల్, మదీనా ప్రాం తాల్లో సైతం కార్మికశాఖ అధికారులకు నిష్ర్కమణ కోసం దరఖాస్తు చేసుకొని అత్యవసర ధ్రువీకరణ కోసం కార్మికులు ఎదురుచూస్తున్నారు. నతాఖా గడువు ముగిసినప్పటికీ అత్యవసర ధ్రువీకరణ పత్రాలు ఉన్న వారికి అరెస్టు, జరిమానాల నుంచి కొంత ఊరట ఉంటుంది. అయితే వీరు ఎగ్జిట్ పర్మిట్ లభించగానే దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుంది. చేతిలో చిల్లిగవ్వ లేక... సౌదీ నుంచి అవుట్ పాస్ లభించిన తెలుగువారు చేతిలో చిల్లిగవ్వ లేక తల్లడిల్లిపోతున్నారు. తెలిసిన వారి వద్ద అప్పో, సప్పో చేసి టికెట్ కోసం డబ్బులు సమకూర్చుకునే పనిలో పడ్డారు. డబ్బులు లభించని వారి పరిస్థితి మరింత దయనీయంగా మారింది. గడువు ముగియడంతో జైలు తప్పదని తలదాచుకునే పనిలో పడ్డారు. కంపెనీ వీసాలు లభించక విజిట్ వీసాపై వెళ్లిన వారు ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ‘నతాఖా’ చట్టం ప్రకారం సౌదీకి వెళ్లిన వ్యక్తి తప్పనిసరిగా తనకు వీసా ఇచ్చిన స్థానికుడి వద్ద ఏ పనికి అనుమతి ఉందో అదే పని చేయాల్సి ఉంటుంది. వేరేచోట పని చేయడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వీల్లేదు. దీంతో ఇతర కంపెనీల్లో.. ఇతర ప్రాంతాల్లో పని చేస్తున్న వారు పనికి స్వస్తి చెప్పడంతో వారి ఉపాధికి గండిపడింది. ఈ క్రమంలో తమకు వీసా ఇచ్చి పిలిపించిన కఫిల్(యజమాని) వద్ద ఆశ్రయం కోసం పడరాని పాట్లు పడుతున్నారు. కఫాలత్ పేరుతో దశలవారీగా కొంత సొమ్మును వసూలు చేసిన కఫిల్స్ మాత్రం ఆశ్రయం ఇచ్చేందుకు పెద్దగా ఆసక్తి కనబర్చడం లేదు. పైతా ఇప్పటి వరకు తమకు రావాల్సిన కఫాలత్ సొమ్మును రాబట్టుకునే పనిలో పడ్డారు. పాస్‌పోర్టులు వారి చేతుల్లోనే ఉండడంతో కార్మికులు తిప్పలు పడక తప్పని పరిస్థితి నెలకొంది. కంపెనీలకూ నతాఖా భయం.. అక్రమంగా సౌదీలో ఉంటున్న వారిని వెనక్కి పంపించేందుకు, స్థానికంగా ఉద్యోగావకాశాలు పెంచేందుకు ఉద్దేశించిన ఈ చట్టం అమలులోకి వస్తుండడంతో అక్కడి కంపెనీలకూ భయం పట్టుకుంది. ఈ చట్టం ప్రకారం అక్రమంగా సౌదీలో ఉంటున్న వారితో పాటు, వారికి పని కల్పించిన కంపెనీలు, యజమానులకూ పెద్ద ఎత్తున జరిమానా విధించనున్నారు. దీంతో పలు కంపెనీలు ఇప్పటికే అలాంటి వారిని పనిలో నుంచి తొలగించాయి. కార్మిక శాఖ అధికారులు సైతం సోమవారం నుంచి ముమ్మరంగా తనిఖీలు చేపట్టి అక్రమంగా ఉంటున్న వారిని అరెస్టు చేసి, జైలుకు పంపించనున్నారు. సౌదీలో లక్షలాది మంది... సౌదీ అరేబియాలోని ధమామ్, రియాద్, జిద్దా, అయిల్, తైఫ్ వంటి ప్రదేశాల్లో రాష్ట్రానికి చెందిన సుమారు ఆరు లక్షల మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. ఇందులో నాలుగు లక్షల మంది కార్మికులు విజిట్ వీసా, ఇతర వీసాపై వెళ్లి, గడువు ముగిసిన తర్వాత కూడా కొందరు దొంగచాటుగా పని చేస్తున్నారు. మేలో నతాఖా తీసుకువచ్చిన ప్రభుత్వం అక్రమ వలసదారులు వెళ్లిపోయేందుకు జూలై 3 వరకు గడువు విధించింది. దీంతో కొందరు కార్మికులు స్వదేశాలకు తిరిగి వెళ్లగా, చాలా మంది సౌదీలోనే చిక్కుకుపోయారు. దీంతో భారత ప్రభుత్వం ఒత్తిడి తీసుకురాగా, సౌదీ రాజు గడువును నవంబర్ నాలుగు వరకు పొడిగించారు. ఈ గడువూ ముగియనుండడంతో ఇంకా మన రాష్ర్టంలోని కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, వైఎస్సార్, కృష్ణా, నల్లగొండ జిల్లాలకు చెందిన సుమారు నాలుగు లక్షల మంది సౌదీలోనే ఉన్నారు. నతాఖా తీసుకొచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 12 వేల మంది మాత్రమే స్వగ్రామాలకు చేరారు. పొడిగించే ప్రసక్తే లేదు... సౌదీ అరేబియాలో నివాసముంటున్న కార్మికులకు ఇచ్చిన గడువు ముగియడంతో...ఇకపై గడువును పెంచేది లేదని సౌదీ అరేబియా కార్మిక శాఖ తేల్చి చెప్పింది. సౌదీ ప్రభుత్వం ఆఖమా వర్క్ పర్మిట్ కోసం గడువు పొడిగిస్తుందని జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని కార్మిక శాఖ అధికార ప్రతినిధి హుతుబుల్ అంజీన్ తెలిపారు. ఇప్పటి వరకు కార్మికులకు నాలుగు నెలల గడువు ఇచ్చామని, ఇందులో 4 వేల మిలియన్ల కార్మికులు వర్క్ పర్మిట్ పొందారని, కేవలం లక్ష మంది మాత్రమే అక్రమంగా నివాసముంటున్నారని తేలిందన్నారు. ఆదివారంతో ఈ గడువు ముగుస్తుందన్నారు. ఇక ప్రభుత్వం తన పని తాను చేస్తుందన్నారు. చట్ట వ్యతిరేకంగా ఉంటున్న వారిపై కఠినంగా వ్యవహరిస్తుందని... 4వ తేదీ నుంచి తనిఖీలు నిర్వహించి అక్రమంగా నివాసముంటున్న వారిని అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు. ఒకవేళ వర్క్ పర్మిట్ కోసం దరఖాస్తు చేసుకొని తుది గడియల్లో ఉన్న వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. చట్ట వ్యతిరేకంగా నివాసముంటున్న వారికి రెండేళ్ల జైలు శిక్ష, లక్ష సౌదీ రియాల్ ఉంటుందన్నారు. ఎవరైతే ఉమ్రా, హజ్ యాత్ర కోసం వచ్చి ఇక్కడ స్థిరపడ్డారో వారికి కూడా ఈ చట్టాలే వర్తిస్తాయన్నారు. ప్రభుత్వం స్పందించాలి సౌదీలో నతాఖా గడువు ముగియడంపై ప్రభుత్వం స్పందించాలి. అక్కడ ఉన్న కార్మికులను గుర్తించి తక్షణమే తిరిగి స్వదేశాలకు రప్పిం చేందుకు ప్రయత్నించాలి. ప్రభుత్వం ఒక బృందాన్ని అక్కడికి పంపించి సహాయ చర్యలు చేపట్టాలి. - కె. నర్సింహనాయుడు, రాష్ట్ర అధ్యక్షుడు, గల్ఫ్ బాధితుల హక్కుల పోరాట సమితి