భయం గుప్పిట్లో తెలుగోళ్లు
సౌదీలోఎగ్జిట్ పర్మిట్ల కోసం అగచాట్లు
16 వేల మందికి నిష్ర్కమణ సర్టిఫికెట్లు
మిగతావారి పరిస్థితి అగమ్యగోచరం
గడుపు పొడిగించని సౌదీ ప్రభుత్వం
నేటి నుంచి కార్మిక శాఖ అధికారుల తనిఖీలు
సాక్షి, హైదరాబాద్ సిటీబ్యూరో/ సౌదీ నుంచి న్యూస్‌లైన్ విలేకరి: సౌదీ అరేబియాలో తెలుగువాళ్లు భయం గుప్పెట్లో బతుకీడుస్తున్నారు. అక్కడి ప్రభుత్వం నతాఖా చట్టం కింద విధించిన గడువు ఆదివారంతో ముగిసింది. దీంతో అక్కడి కార్మిక శాఖ అధికారులు సోమవారం నుంచే ప్రైవేటు కంపెనీలపై విస్తృతంగా దాడులు నిర్వహించి.. అక్రమ వలసవాదులను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే కార్మిక మంత్రిత్వశాఖ నతాఖా చట్టం కింద తనిఖీలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. సౌదీ ప్రభుత్వం గడువు పొడిగింపుపై ఎలాంటి ప్రకటన చేయని కారణంగా దేశం విడిచి వెళ్లేందుకు సుమారు 16 వేలకు పైగా కార్మికులు అక్కడి రాయబార కార్యాలయం నుంచి అత్యవసర సర్టిఫికెట్లు(ఈసీఎస్)లను పొందారు. ఆదివారం సైతం రియాద్‌లోని పాస్‌పోర్టు కార్యాలయం ముందు బారులు తీరారు. మరోవైపు సౌదీలోని దమ్మామ్, జిద్దా, ఆల్‌సత్, జూలైల్, మదీనా ప్రాం తాల్లో సైతం కార్మికశాఖ అధికారులకు నిష్ర్కమణ కోసం దరఖాస్తు చేసుకొని అత్యవసర ధ్రువీకరణ కోసం కార్మికులు ఎదురుచూస్తున్నారు. నతాఖా గడువు ముగిసినప్పటికీ అత్యవసర ధ్రువీకరణ పత్రాలు ఉన్న వారికి అరెస్టు, జరిమానాల నుంచి కొంత ఊరట ఉంటుంది. అయితే వీరు ఎగ్జిట్ పర్మిట్ లభించగానే దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుంది.
చేతిలో చిల్లిగవ్వ లేక...
సౌదీ నుంచి అవుట్ పాస్ లభించిన తెలుగువారు చేతిలో చిల్లిగవ్వ లేక తల్లడిల్లిపోతున్నారు. తెలిసిన వారి వద్ద అప్పో, సప్పో చేసి టికెట్ కోసం డబ్బులు సమకూర్చుకునే పనిలో పడ్డారు. డబ్బులు లభించని వారి పరిస్థితి మరింత దయనీయంగా మారింది. గడువు ముగియడంతో జైలు తప్పదని తలదాచుకునే పనిలో పడ్డారు. కంపెనీ వీసాలు లభించక విజిట్ వీసాపై వెళ్లిన వారు ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ‘నతాఖా’ చట్టం ప్రకారం సౌదీకి వెళ్లిన వ్యక్తి తప్పనిసరిగా తనకు వీసా ఇచ్చిన స్థానికుడి వద్ద ఏ పనికి అనుమతి ఉందో అదే పని చేయాల్సి ఉంటుంది. వేరేచోట పని చేయడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వీల్లేదు.
దీంతో ఇతర కంపెనీల్లో.. ఇతర ప్రాంతాల్లో పని చేస్తున్న వారు పనికి స్వస్తి చెప్పడంతో వారి ఉపాధికి గండిపడింది. ఈ క్రమంలో తమకు వీసా ఇచ్చి పిలిపించిన కఫిల్(యజమాని) వద్ద ఆశ్రయం కోసం పడరాని పాట్లు పడుతున్నారు. కఫాలత్ పేరుతో దశలవారీగా కొంత సొమ్మును వసూలు చేసిన కఫిల్స్ మాత్రం ఆశ్రయం ఇచ్చేందుకు పెద్దగా ఆసక్తి కనబర్చడం లేదు. పైతా ఇప్పటి వరకు తమకు రావాల్సిన కఫాలత్ సొమ్మును రాబట్టుకునే పనిలో పడ్డారు. పాస్‌పోర్టులు వారి చేతుల్లోనే ఉండడంతో కార్మికులు తిప్పలు పడక తప్పని పరిస్థితి నెలకొంది.
కంపెనీలకూ నతాఖా భయం..
అక్రమంగా సౌదీలో ఉంటున్న వారిని వెనక్కి పంపించేందుకు, స్థానికంగా ఉద్యోగావకాశాలు పెంచేందుకు ఉద్దేశించిన ఈ చట్టం అమలులోకి వస్తుండడంతో అక్కడి కంపెనీలకూ భయం పట్టుకుంది. ఈ చట్టం ప్రకారం అక్రమంగా సౌదీలో ఉంటున్న వారితో పాటు, వారికి పని కల్పించిన కంపెనీలు, యజమానులకూ పెద్ద ఎత్తున జరిమానా విధించనున్నారు. దీంతో పలు కంపెనీలు ఇప్పటికే అలాంటి వారిని పనిలో నుంచి తొలగించాయి. కార్మిక శాఖ అధికారులు సైతం సోమవారం నుంచి ముమ్మరంగా తనిఖీలు చేపట్టి అక్రమంగా ఉంటున్న వారిని అరెస్టు చేసి, జైలుకు పంపించనున్నారు.
సౌదీలో లక్షలాది మంది...
సౌదీ అరేబియాలోని ధమామ్, రియాద్, జిద్దా, అయిల్, తైఫ్ వంటి ప్రదేశాల్లో రాష్ట్రానికి చెందిన సుమారు ఆరు లక్షల మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. ఇందులో నాలుగు లక్షల మంది కార్మికులు విజిట్ వీసా, ఇతర వీసాపై వెళ్లి, గడువు ముగిసిన తర్వాత కూడా కొందరు దొంగచాటుగా పని చేస్తున్నారు. మేలో నతాఖా తీసుకువచ్చిన ప్రభుత్వం అక్రమ వలసదారులు వెళ్లిపోయేందుకు జూలై 3 వరకు గడువు విధించింది. దీంతో కొందరు కార్మికులు స్వదేశాలకు తిరిగి వెళ్లగా, చాలా మంది సౌదీలోనే చిక్కుకుపోయారు. దీంతో భారత ప్రభుత్వం ఒత్తిడి తీసుకురాగా, సౌదీ రాజు గడువును నవంబర్ నాలుగు వరకు పొడిగించారు. ఈ గడువూ ముగియనుండడంతో ఇంకా మన రాష్ర్టంలోని కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, వైఎస్సార్, కృష్ణా, నల్లగొండ జిల్లాలకు చెందిన సుమారు నాలుగు లక్షల మంది సౌదీలోనే ఉన్నారు. నతాఖా తీసుకొచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 12 వేల మంది మాత్రమే స్వగ్రామాలకు చేరారు.
పొడిగించే ప్రసక్తే లేదు...
సౌదీ అరేబియాలో నివాసముంటున్న కార్మికులకు ఇచ్చిన గడువు ముగియడంతో...ఇకపై గడువును పెంచేది లేదని సౌదీ అరేబియా కార్మిక శాఖ తేల్చి చెప్పింది. సౌదీ ప్రభుత్వం ఆఖమా వర్క్ పర్మిట్ కోసం గడువు పొడిగిస్తుందని జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని కార్మిక శాఖ అధికార ప్రతినిధి హుతుబుల్ అంజీన్ తెలిపారు. ఇప్పటి వరకు కార్మికులకు నాలుగు నెలల గడువు ఇచ్చామని, ఇందులో 4 వేల మిలియన్ల కార్మికులు వర్క్ పర్మిట్ పొందారని, కేవలం లక్ష మంది మాత్రమే అక్రమంగా నివాసముంటున్నారని తేలిందన్నారు. ఆదివారంతో ఈ గడువు ముగుస్తుందన్నారు.
ఇక ప్రభుత్వం తన పని తాను చేస్తుందన్నారు. చట్ట వ్యతిరేకంగా ఉంటున్న వారిపై కఠినంగా వ్యవహరిస్తుందని... 4వ తేదీ నుంచి తనిఖీలు నిర్వహించి అక్రమంగా నివాసముంటున్న వారిని అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు. ఒకవేళ వర్క్ పర్మిట్ కోసం దరఖాస్తు చేసుకొని తుది గడియల్లో ఉన్న వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. చట్ట వ్యతిరేకంగా నివాసముంటున్న వారికి రెండేళ్ల జైలు శిక్ష, లక్ష సౌదీ రియాల్ ఉంటుందన్నారు. ఎవరైతే ఉమ్రా, హజ్ యాత్ర కోసం వచ్చి ఇక్కడ స్థిరపడ్డారో వారికి కూడా ఈ చట్టాలే వర్తిస్తాయన్నారు.
ప్రభుత్వం స్పందించాలి
సౌదీలో నతాఖా గడువు ముగియడంపై ప్రభుత్వం స్పందించాలి. అక్కడ ఉన్న కార్మికులను గుర్తించి తక్షణమే తిరిగి స్వదేశాలకు రప్పిం చేందుకు ప్రయత్నించాలి. ప్రభుత్వం ఒక బృందాన్ని అక్కడికి పంపించి సహాయ చర్యలు చేపట్టాలి.
- కె. నర్సింహనాయుడు,
రాష్ట్ర అధ్యక్షుడు, గల్ఫ్ బాధితుల హక్కుల పోరాట సమితి