నతాఖా బాధితులకు ఊరట | Relief for Nitaqat victims | Sakshi
Sakshi News home page

నతాఖా బాధితులకు ఊరట

Published Tue, Nov 19 2013 4:57 AM | Last Updated on Sat, Sep 2 2017 12:44 AM

Relief for Nitaqat victims

 రియాద్ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి:  సౌదీ అరేబియా తీసుకొచ్చిన నూతన కార్మిక చట్టం(నతాఖా) బాధితులకు వెసులుబాటు(అఖామాల రెన్యువల్) కల్పిస్తూ.. వారు తమ పత్రాలను సరిచేసుకోవడానికి నెలరోజులపాటు సౌదీ ప్రభుత్వం గడువు ఇచ్చింది. ఈ మేరకు సౌదీ కార్మిక శాఖ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో ఆంధ్రప్రదేశ్ నుంచి సౌదీ అరేబియాకు వెళ్లిన కార్మికులకు కొద్దిపాటి ఊరట లభించినట్లయింది. సౌదీ అరేబియాలోని భవన నిర్మాణం, వ్యాపారాలు, స్థానిక కర్మాగారాలు, హోటళ్లు, రెస్టారెంట్‌లలో పనిచేస్తున్న తెలుగువారికి ఈ ఉత్తర్వుల ద్వారా లబ్ధి చేకూరనుంది.

స్థానిక కంపెనీలు, భవన నిర్మాణ, షాపింగ్‌మాల్, చిన్న కంపెనీల యజమానులు కూడా తమ వద్ద పనిచేసున్న ఉద్యోగుల పత్రాలను సరిచేసుకునే అవకాశమిచ్చింది. విదేశీ కార్మికులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించింది. వ్యాపారసంస్థలు, ఫ్యాక్టరీలు, హోటళ్లు, రెస్టారెంట్‌ల నిర్వాహకులు తమ వద్ద పనిచేస్తున్న విదేశీయుల అఖామా(వర్క్ పర్మిట్)లను సరిచేయించాలని కోరింది. కార్మికశాఖ ద్వారా గుర్తింపు పొందిన అఖామాలు కలిగి ఉన్న విదేశీయుల్నే పనిలో నియమించుకోవాలని, లేనిపక్షంలో ఆయా సంస్థలు, వ్యాపార సముదాయాలపై కేసులు పెడతామని సౌదీ ప్రభుత్వం హెచ్చరించింది. దాడులు కొనసాగుతాయని, అఖామా రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకున్న పత్రాలను చూపినట్లయితే ఎలాంటి అరెస్టులు ఉండబోవని స్పష్టం చేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement