పంకజ్, రాధిక (ఫైల్)
మెల్ బోర్న్: భారతీయ బిలియనీర్ పంకజ్ ఓస్వాల్ పై ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్ బ్యాంకింగ్ గ్రూప్ (ఏఎన్జెడ్) అధికారి దాడి చేశారని స్థానిక మీడియా వెల్లడించింది. ఏఎన్జెడ్ కు చెందిన చీఫ్ రిస్క్ ఆఫీసర్ క్రిస్ పేజ్.. ఓస్వాల్ పై దాడి చేయడమే కాకుండా ఆయనను బెదిరించారని తెలిపింది. 2009లో ఈ ఘటన చోటు చేసుకుందని పేర్కొంది.
రుణాల చెల్లింపుల కోసం ఓస్వాల్ పై సమావేశమైన క్రిస్ ఆయుధంతో ఓస్వాల్ ను బెదిరించాడు. ఓస్వాల్ మెడపై ఆయుధం పెట్టి 'సంతకం పెట్టు లేకపోతే నిన్ను నాశనం చేస్తా' అని హెచ్చరించాడని పంకజ్ భార్య రాధిక తరపు ప్రతినిధి గ్యారీ రిచ్ తెలిపారు. పంకజ్ కు ప్రాణాపాయం ఉందని ఆమె ఆందోళన చెందుతున్నట్టు వెల్లడించారు.
మూసివేయబడిన వెస్ట్ ఆస్ట్రేలియన్ ఫెర్జిలైజేషన్ కంపెనీలో తమ షేర్లను తక్కువ ధరకు అక్రమంగా విక్రయించారని ఆరోపిస్తూ ఏఎన్జెడ్ పై ఓస్వాల్ దంపతులు దాదాపు రూ. 6733 కోట్లకు విక్టోరియా సుప్రీంకోర్టులో దావా వేశారు. పంకజ్, రాధిక మోసానికి పాల్పడ్డారని ఏఎన్జెడ్ వాదిస్తోంది. 900 మిలియన్ డాలర్లు బకాయి పడ్డారని, అప్పు చెల్లించకుండా నాటకాలు ఆడుతున్నారని ఆరోపించింది.