
ఆస్ట్రేలియాలో భారత మహిళ హత్య
మెల్‌బోర్న్: ఆస్ట్రేలియాలో ఓ భారత మహిళా ఐటీ కన్సల్టెంట్ దారుణ హత్యకు గురయ్యారు. సిడ్నీ శివారులోని వెస్ట్‌మీడ్ పారామట్టా పార్కులో శనివారం రాత్రి తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో ప్రభా అరుణ్ కుమార్(40) అనే ఐటీ కన్సల్టెంట్‌ను గుర్తు తెలియని దుండగులు కత్తులలో విచక్షణారహితంగా పొడిచారు. వెంటనే పోలీసులు ఆస్పత్రికి తరలించినా అప్పటికే ఆమె మృతి చెందింది. ఈ ఘటనపై పారామట్ట పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఘటనకు సంబంధించిన సమాచారం తెలిస్తే ఎవరైనా తమకు తెలియజేసి కేసు దర్యాప్తునకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభ ఆఫీస్ విధులు ముగించుకొని నడుచుకుంటూ ఇంటికి వస్తుండగా ఈ ఘటన జరిగిందని ఆమె మేనల్లుడు త్రిజేష్ తెలిపారు.
ఆమె బెంగళూరులోని తన భర్త అరుణ్‌తో ఫోన్‌లో మాట్లాడుకుంటూ వస్తుండగా దుండగుడు తనను వెంబడిస్తున్నాడని చెప్పిందని తెలిపారు. ‘నన్ను వెళ్లనివ్వండి, కావాలంటే నా బ్యాగ్ తీసుకోండి, ఇంకా ఏమి కావాలన్నా ఇస్తాను’ అని చెబుతుండగానే ఆమె ఫోన్ స్విచ్చాఫ్ అయిందని చెప్పారు. ఆమె ఇంటికి 300 మీటర్ల దూరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అప్పటికే అర్వాంద్ అమిరియన్ అనే స్థానికుడు ఇచ్చిన సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో ఉన్న ఆమెను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందింది. సిడ్నిలోని భారత కాన్సులేట్ జనరల్ వెంటనే అప్రమత్తమయ్యారని, ఘటనపై తగిన చర్యలు తీసుకుంటున్నారని విదేశాంగ శాఖ ప్రతినిధి పేర్కొన్నారు. వీసా గడువు ముగియగానే స్వదేశానికి తిరిగి వెళ్లాలని ఆమె భావించిందని, ఇంతలోనే ఘోరం జరిగిపోయిందని ప్రభ ఇరుగుపొరుగు వారు చెప్పారు. ప్రభ భర్త ఆస్ట్రేలియాకు బయల్దేరారు.