అమెరికన్లకు ఉద్యోగాలిస్తున్నదే భారతీయులు | Indians have helped create a lot of jobs in America | Sakshi
Sakshi News home page

అమెరికన్లకు ఉద్యోగాలిస్తున్నదే భారతీయులు

Published Sat, Aug 19 2017 5:06 PM | Last Updated on Tue, May 29 2018 1:10 PM

అమెరికన్లకు ఉద్యోగాలిస్తున్నదే భారతీయులు - Sakshi

అమెరికన్లకు ఉద్యోగాలిస్తున్నదే భారతీయులు

అమెరికాలో అమెరికన్ల ఉద్యోగాలను భారతీయులు కొల్లగొడుతున్నారనే దుష్ప్రచారం ఎక్కువగా ఉంది. వాస్తవానికి ఇది పూర్తి విరుద్ధం.

సాక్షి, న్యూఢిల్లీ: అమెరికాలో అమెరికన్ల ఉద్యోగాలను భారతీయులు కొల్లగొడుతున్నారనే దుష్ప్రచారం ఎక్కువగా ఉంది. వాస్తవానికి ఇది పూర్తి విరుద్ధం. భారతీయులే ఎక్కువ మంది అమెరికాలోని సిలికాన్‌ వ్యాలీలో ఎక్కువగా కంపెనీలను ఏర్పాటు చేసి భారతీయులతోపాటు అమెరికన్లకు, విదేశీయులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నారు. కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌లో పేరెన్నికగన్న 'సన్‌ మైక్రో సిస్టమ్స్‌' నుంచి ఈ మెయిల్‌ దిగ్గజం 'హాట్‌ మెయిల్‌' వరకు ఎన్నో ప్రసిద్ధ కంపెనీలకు ప్రాణంపోసి అమెరికన్లకు ఉద్యోగాలిచ్చిందీ భారతీయ వ్యాపారవేత్తలే. 
 
భారత్‌లోని బెంగళూరు నుంచి అమెరికాలోని కాలిఫోర్నియా వరకు విస్తరించిన వెంచర్‌ క్యాపిటల్‌ సంస్థ 'ఇన్వెంటస్‌ క్యాపిటల్‌ పార్టనర్స్‌' డైరెక్టర్‌ మను రేఖి ఇటీవల విడుదల చేసిన ఓ నివేదికలో అమెరికాలో ఉద్యోగావకాశాలను పెంచిన భారత వ్యాపార దిగ్గజాల గురించి మరిన్ని వివరాలు పొందుపరిచారు. ఈరోజు అందరికి సుపరిచితులైన గూగుల్‌కు చెందిన సుందర్‌ పిచాయ్, మైక్రోసాఫ్ట్‌కు చెందిన సత్య నాదెండ్ల, పెప్సీ సీఈవో ఇంద్రా నూయీ, అడోబ్స్‌కు చెందిన శంతను నారాయెణ్‌లు దశాబ్దాల క్రితమే అనేక భారతీయ సంస్థలకు బీజం వేశారు.
 
తొలితరం భారతీయ వ్యాపారవేత్తలు 1980 దశకంలో అమెరికాకు రావడం ప్రారంభమైంది. కన్వల్‌ రేఖి, వినోద్‌ ఖోస్లా, నరేన్‌ గుప్తా, ప్రభూ గోయల్, సుహాస్‌ పాటిల్‌ లాంటి వారెందరో సిలికాన్‌ వ్యాలీలో ప్రవేశించి సన్‌ మైక్రోసిస్టమ్స్‌ (తర్వాత ఓరాకిల్‌ స్వాధీనం చేసుకొంది), ఎక్సిలాన్, సైరస్‌ లాజిక్‌ లాంటి కంపెనీలను ఏర్పాటు చేసి ఎంతో మంది అమెరికన్లను ఉద్యోగావకాశాలను కల్పించాయని మను రేఖి తన నివేదికలో పేర్కొన్నారు. అమెరికాలో వినియోగదారుడి మనస్తత్వం ఎలా ఉంటుందో తెలియని దశలోనే అనేక మంది భారతీయ వ్యాపారవేత్తలు అమెరికాలోకి అడుగుపెట్టారు. కాలక్రమంలో వినియోగదారుడిని ఆకట్టుకోవడమే ప్రధాన లక్ష్యంగా భారతీయులు కంపెనీలను ఏర్పాటు చేయడం, విదేశీ విద్యార్థులకు ఉద్యోగావకాశాలు కల్పించడం ప్రారంభించారు. 
 
ఈ దశలో సబీర్‌ భాటియా 1996లో హాట్‌మెయిల్‌ డాట్‌ కామ్‌ ఏర్పాటు చేయడం విప్లవాత్మక మార్పులు తెచ్చిందనడంలో సందేహం లేదు. ఆయన ఈ సంస్థను స్థాపించక ముందు భారత్‌లోని బిట్స్‌ బిలానీలో ఇంజనీరింగ్‌ డిగ్రీ చేసి, అమెరికాలోని స్టాన్‌ఫర్డ్‌ యూనివర్శిటీలో ఎంఎస్‌ చేశారు. అనంతరం ఆపిల్‌ కంపెనీలో పనిచేసి, సొంతంగా హాట్‌ మెయిల్‌ కంపెనీని స్థాపించారు. 1990వ దశకంలోనే భారత సంతతికి చెందిన ఎంతోమంది వ్యాపారవేత్తలు సిలికాన్‌ వ్యాలీలో దిగ్గజాలుగా పైకొచ్చారు. 'నెట్‌స్కేలర్' అభివృద్ధికి ఎంతో కృషి చేసిన బీవీ జగదీష్, 2000 సంవత్సరంలో ఆ కంపెనీకి సీఈవో అయ్యారు. ఆయన ఇప్పటికీ కూడా కాజ్‌ వెంచర్స్‌లో మేనేజింగ్‌ పార్టనర్‌గా ఉంటూ అనేక స్టార్టప్‌ కంపెనీల్లో పెట్టుబడులు పెడుతున్నారు. మరోపక్క స్టార్టప్‌ కంపెనీలను ప్రోత్సహించేందుకు శాంటా క్లారా యూనివర్శిటీలో ప్రొఫెసర్‌గా స్టార్టప్‌ కంపెనీలపై విద్యార్థులకు క్లాసులు తీసుకుంటున్నారు. 
 
గూగుల్‌ తొలి పెట్టుబడిదారుల్లో ఒకరై ఆ కంపెనీలో 130 కోట్ల డాలర్ల షేర్లు కలిగిన వెంచర్‌ క్యాపిటలిస్ట్‌ రామ్‌ శ్రీరామ్‌ అమెరికాలో అనేక స్టార్టప్‌ కంపెనీలకు చేయూతనిస్తున్నారు. నాస్‌డాగ్‌ ఐపీఓ జాబితాలో గత ఐదేళ్లుగా కొనసాగుతున్న ప్రముఖ కంపెనీల జాబితాలో 17 కంపెనీలు భారతీయులు స్థాపించిన లేదా సహ వ్యవస్థాపకులుగా ఉన్న కంపెనీలే కావడం ఇక్కడ విశేషం. ఈ కంపెనీల మార్కెట్‌ షేర్ల విలువ 2,600 కోట్ల డాలర్లకు పైమాటే. నేడు అమెరికాలోని 261 యూనికార్న్స్‌ (వంద కోట్ల డాలర్లకు మించిన ప్రైవేటు కంపెనీలు)లలో 14 కంపెనీలు భారత సంతతి వారివే. ఈ కంపెనీల షేర్ల విలువ 3,550 కోట్ల డాలర్లు. ఇవి కాకుండా ఫార్మాస్యూటికల్స్, బయో టెక్నాలజీ, లైఫ్‌ సైన్సెస్‌ రంగాల్లో, మానవ వనరులను ఔట్‌ సోర్సింగ్‌ ఇచ్చే కంపెనీల్లో కూడా భారతీయ వ్యాపారవేత్తలు ఎంతో మంది ఉన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement