
జకర్తా : రద్దీగా ఉన్న రైలులో ఒక్కసారిగా పాము కనిపించింది. ఇంకేముంది ప్రయాణికుల అరుపులతో రైల్లో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. దీంతో అత్యవసరంగా ట్రైన్‌ను ఆపివేశారు. సెక్యురిటీ సిబ్బంది వచ్చి ప్రయాణికులు బ్యాగులు పెట్టే స్థలంలో పాము ఎక్కడుందో నిధానంగా స్టిక్‌తో తనిఖీ చేయసాగారు. ఇదంతా గమనిస్తున్న పక్కనే ఉన్న ఓ ప్రయాణికుడు ఇలాకాదని క్షణాల్లో సీటుపై కాలుపెట్టి, పైభాగంలో ఉన్న పామును ఒంటి చేత్తో పట్టుకున్నాడు. అంతేనా పామును లాగి బయటకు తీసి ఒక్క రౌండ్ గాల్లో తిప్పి గట్టిగా ట్రైన్‌లో కింద కొట్టేశాడు. ఈ హఠాత్పరిణామానికి ప్రయాణికులు ఒక్కసారిగా కేకలు వేశారు. సదరు యువకుడు తర్వాత పాము ఇంకా బతికుందా లేదా అని చూసి మరీ రైల్లో నుంచి కింద పడేశాడు. ఇండోనేషియాలోని ఓ అర్బన్ ట్రైన్‌లో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రైలు బోగోర్ నుంచి జకర్తా వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. పామును చాకచక్యంగా పట్టుకొని ప్రయాణికులను కాపాడినందుకు సదరు యువకున్ని కొందరు హీరో అంటూ కొనియాడితుంటే, జంతు ప్రేమికులు మాత్రం పామును మరీ అంత క్రూరంగా చంపాలా అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఇండోనేషియాలో అర్బన్ ప్రాంతాల్లో జంతువులను రైల్లో తీసుకువెళ్లడం నిషేధం. అయినా ట్రైన్‌లోకి పాము రావడంపై రైల్వే సిబ్బంది ప్రయాణికులకు క్షమాపణలు చెప్పింది. ఎవరైనా ప్రయాణికులు బ్యాగులో పామును తీసుకువచ్చి ఉంటారని అధికారులు అనుమానం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment