‘సెల్ఫీ దొంగల’ పట్ల జాగ్రత్త!
లండన్: సెల్‌ఫోన్ యూజర్లలో సెల్ఫీల పిచ్చి నానాటికి పెరిగిపోతున్న విషయం తెల్సిందే. ఇదే సదావకాశం అనుకుంటున్న దొంగలు సెల్ఫీల సందర్భంగా ఫోన్లను కొట్టేసి తుర్రుమంటున్నారు. ఇలా పోయిన తమ ఫోన్లకు బీమా సొమ్ము చెల్లించాలంటూ బ్రిటన్ ఫోన్ యూజర్ల డిమాండ్లను బ్రిటన్ బీమా కంపెనీలు నిర్ద్వంద్వంగా త్రోసిపుచ్చాయి. ‘మీ అజాగ్రత్త వల్ల సెల్ ఫోన్లు పోగొట్టుకుంటే అందుకు మేమెలాగా సొమ్ము చెల్లిస్తాం! చెల్లించే ప్రసక్తే లేదు. చేతులు ముందుకు చాపి సెల్ ఫోన్లను పట్టుకునే బదులు ప్రస్తుతం మార్కెట్లలో లభిస్తున్న పటిష్టమైన సెల్ఫీ రాడ్స్‌ను ఉపయోగించండి’ అంటూ ఉచిత సలహాలిచ్చి పంపించాయి.
ఈ విషయాన్ని లండన్‌లోని ‘ఇండిపెండెంట్ ఫైనాన్సియల్ అంబూడ్స్‌మేన్ సర్వీస్’ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా వారు కూడా ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోలేమంటూ చేతులెత్తేశారు. సెల్ఫీల సందర్భంగా తగిన జాగ్రత్తలు తీసుకోవడమే సమంజసమని వారు కూడా సలహాలిచ్చారు. 2000 తరానికి చెందిన సెల్‌ఫోన్ యూజర్లలో 95 శాతం మంది సెల్ఫీలు తీసుకుంటున్నారని, వారు తమ జీవిత కాలంలో సరాసరి 25 వేల సెల్ఫీలు తీసుకుంటారని ఇటీవల ఓ సర్వే వెల్లడించింది.