విశ్వవ్యాప్తంగా..
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శిబిరాలు
న్యూఢిల్లీ: తొలి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఆదివారం దాదాపు అన్ని రాష్ట్రాల్లో భారీ ప్రదర్శనలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో పలువురు ముఖ్యమంత్రులు, గవర్నర్లు, కేంద్ర మంత్రులు, రాష్ర్ట మంత్రులు, ఉన్నతాధికారులు, ఇతర ప్రముఖులతోపాటు సామాన్యులు కూడా ఆసనాలు వేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు యోగా డేని ప్రతిష్టాత్మకంగా తీసుకొని భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహించాయి. గుజరాత్‌లో 29 వేల ప్రాంతాల్లో 1.25 కోట్ల మంది ఆసనాలు వేశారు.
హైదరాబాద్‌లో జరిగిన యోగా డేలో కేంద్ర మంత్రి జేపీ నడ్డా, మరో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ పాలుపంచుకున్నారు. పట్నాలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా నేతృత్వంలోని జరిగిన శిబిరంలో పెద్దఎత్తున రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. లక్నోలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆధ్వర్యంలో జరిగిన శిబిరంలో 15 వేలమందికిపైగా పాల్గొన్నారు. ఇక్కడ పెద్ద ఎత్తున ముస్లింలు కూడా ఆసనాలు వేశారు. హర్యానా ప్రభుత్వం వెయ్యి గ్రామాల్లో యోగ, వ్యాయామశాలలను నెలకొల్పుతూ నిర్ణయం తీసుకుంది. జైపూర్‌లో 25వేల మందితో నిర్వహించిన కార్యక్రమం ఆకట్టుకుంది.
ప్రపంచవ్యాప్తంగా ఘనంగా యోగా డే
లండన్: అంతర్జాతీయ యోగా డే ప్రారంభ వేడుకలను పురస్కరించుకొని ఆదివారం ప్రపంచవ్యాప్తంగా వేలాది ఔత్సాహికులు ప్రాచీన భారతీయ యోగ కళను అభ్యసించారు. యోగా సార్వజనీనతను చాటుతూ వివిధ రకాల ఆసనాలను వేసి చూపారు. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ నగరంలో 500 మందికిపైగా ఔత్సాహికులు సూర్య నమస్కారాలు చేశారు.
లండన్‌లో థేమ్స్ నది ఒడ్డున వందలాదిప్రజలు యోగా డే వేడుకల్లో పాల్గొన్నారు. చైనాలోని ప్రఖ్యాత పెకింగ్ యూనివర్సిటీ, గీలీ యూనివర్సిటీలలో యోగా కార్యక్రమాలు నిర్వహించారు. సింగపూర్‌లో నిర్వహించిన యోగా కార్యక్రమంలో 4 వేల మందికిపైగా ప్రజలు పాల్గొన్నారు. థాయ్‌లాండ్, నేపాల్, వియత్నాం, జపాన్, ఫ్రాన్స్, మలేసియా, ఫిలిప్పీన్స్ తదితర దేశాల్లోనూ యోగా డేను పాటించారు.