టెహ్రాన్: అమెరికా కవ్వింపు చర్యలకు పాల్పడితే సహించే ప్రసక్తే లేదని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ హెచ్చరించింది. 110 యుద్ధ నౌకలు నావికాదళంలో చేరిన నేపథ్యంలో ఈ మేరకు హెచ్చరికలు జారీ చేసింది. ‘‘అమెరికన్లు ఎక్కడెక్కడ ఉంటారో.. వారి పక్కనే మేం కూడా ఉంటాం. గతంలో కంటే మరింత ఎక్కువగా వారు మా ఉనికిని ఆస్వాదిస్తారు’’అని గార్డ్స్ నేవీ చీఫ్ రేర్ అడ్మిరల్ అలీరెజా తంగ్సిరి కీలక వ్యాఖ్యలు చేశారు. అదే విధంగా గార్డ్స్ కమాండర్ మేజర్ జనరల్ హుస్సేన్ సలామీ మాట్లాడుతూ.. ‘‘రక్షణ చర్యలను పటిష్టం చేసే దిశగా మరింత ముందుకు సాగుతున్నాం. శత్రుసైన్యానికి ఇరాన్ ఎన్నడూ తలొగ్గదు’’ అని పేర్కొన్నారు.
కాగా ఇరాన్ నావికా దళంలో కొత్తగా అసుర- క్లాస్ స్పీడ్‌బోట్స్, జోల్ఫాఘర్ కోస్టల్ పెట్రోలింగ్ బోట్లు, తారేఘ్ సబ్‌మెరైన్లు వచ్చి చేరినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఇక సముద్రంలో తమ ఓడలకు అడ్డుతగిలితే ఇరాన్ నౌకలను ధ్వంసం చేయాలని ఆదేశాలిచ్చినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఇరాన్- అమెరికా మధ్య దశాబ్దాల కాలంగా వైరం కొనసాగుతున్న విషయం తెలిసిందే. 2000లో ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేస్తోందనే ఆరోపణలపై అమెరికా ఆంక్షలు విధించి.. ఇరాక్, ఉత్తరకొరియాతోపాటు ఇరాన్‌ను తమ దుష్టత్రయం(2002)లో చేర్చింది.(హాంకాంగ్‌పై చైనా పెత్తనం.. షాకిచ్చిన ట్రంప్!)
ఈ క్రమంలో లో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తన పదవీ కాలంలో ఇరాన్‌తో సంబంధాలు మెరుగుపరచుకున్నారు. ఇందులో భాగంగా 2015లో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సు, రష్యా, చైనా, జర్మనీలు ఇరాన్‌తో అణు ఒప్పందం కుదుర్చుకున్నాయి. అయితే అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ట్రంప్... 2019లో అణు ఒప్పందం నుంచి ఏకపక్షంగా వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఇక అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment