‘ఇలా ఉండడం...నా ఇష్టం’
దుబాయ్: ఇరాన్‌కు చెందిన ప్రముఖ సినీ తార సదాఫ్ తహేరియాన్ జుట్టు కనిపించేలా తాను దిగిన పలు ఫొటోలను ఫేస్‌బుక్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిపోయింది. బయటకు వెళ్లినప్పుడు తప్పనిసరిగా సంప్రదాయబద్ధమైన ‘హిజాబ్’ ధరించాలనే ఇరాన్ ఇస్లామిక్ చట్టాన్ని ఉల్లంఘించావంటూ ఇరాన్ సాంస్కృతిక శాఖ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సినీ తార చర్యను ‘అనైతికం’ అని ప్రకటించడమే కాకుండా సామాజిక వెబ్‌సైట్లలోని ఆమె ఫొటోలకు గ్రాఫిక్స్ ద్వారా హిజాబ్‌ను తగిలించారు. అంతేకాకుండా ఇంకేమాత్రం సినిమాల్లో నటించరాదంటూ హుకుం జారీ చేశారు. ప్రజల నుంచి నిరసన వ్యక్తం అవడంతో ఆమె ప్రస్తుతం దుబాయ్‌లో ప్రవాస జీవితం గడుపుతోందని ఇరాన్ అధికారులు తెలిపారు.
మాతృదేశమైన ఇరాన్ నుంచి ఇలాంటి రియాక్షన్ వస్తుందని తాను ఊహించలేదని, అయినా తనకు తన చర్య పట్ల ఏమాత్రం విచారం లేదని సదాఫ్ సోషల్ వెబ్‌సైట్లలో వాపోయారు. ‘ఇరాన్ రియాక్షన్ చూసి నేను విచారించడం తప్ప, నేను చెప్పడానికి ఏమీ లేదు. నేను జీవించాలనుకున్న చోట, నేను ఆనందంగా ఎలా ఉండగలననుకుంటే అలాగే ఉంటాను. అది నాయిష్టం’ అని వ్యాఖ్యానించారు. మహిళలు బయటకు వెళ్లినప్పుడు జట్టు కనిపించకుండా ‘హిజాబ్’ తప్పకుండా ధరించాలనే చట్టాన్ని ఇరాన్ 1979లో తీసుకొచ్చింది.
‘నా వృత్తిలో కూడా నాపై లైంగిక వేధింపులు ఎక్కువయ్యాయి’ అంటూ ఆమె సినీ రంగంపై కూడా విమర్శలు గుప్పించారు. నేను నటిస్తున్నప్పుడు దర్శకుడు నన్ను తప్ప నా యాక్షన్‌ను చూడడం లేదు. ఎప్పుడు సీన్ అయిపోతుందా ? ఎప్పుడు నా చెవిలో గుసగుసలు పెడదామా అని చూస్తుంటాడు. దర్శకుల్లో ఎక్కువ మంది ఇలాగే ఉన్నారు. కళ్ల ముందు ఐదారు కాంట్రాక్టులు పెడతారు. ఒక్క నెల వారితో గడిపితే కాంట్రాక్టులు ఇస్తామంటారు’