పక్కా భారతీయుడు!   | Irish Prime minister Is A Typical Indian | Sakshi
Sakshi News home page

Published Wed, May 2 2018 9:13 PM | Last Updated on Wed, May 2 2018 9:13 PM

Irish Prime minister Is A Typical Indian - Sakshi

ఐర్లండ్ ప్రధాని లియో వారడ్కర్ను(ఫైల్‌ ఫోటో)

భారత సంతతికి చెందిన ఐర్లండ్ ప్రధాని లియో వారడ్కర్ను బ్రిటన్ హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యుడొకరు ‘పక్కా భారతీయుడు’ అని నిందాపూర్వకంగా అభివర్ణించడం ఇంగ్లండ్‌లో వివాదానికి దారితీసింది. ఐర్లండ్ భూభాగం(దీవి)తో కలిసి ఉన్న ఉత్తర ఐర్లండ్ బ్రిటన్‌లో అంతర్భాగం. ఈ ప్రాంతంలో పర్యటనకు వెళ్లే ముందు వారడ్కర్ అక్కడి అధికారులకు ఆయన తన ప్రయాణం గురించి తెలియజేయకపోవడంతో ఆగ్రహించిన బ్రిటిష్ లార్డ్ కిల్క్లూనీ(జాన్ డేవిడ్ టేలర్) ఇలా ట్విటర్లో వ్యాఖ్యానించాక, వ్యతిరేక స్పందన రావడంతో తన మాటలు ఉపసంహరించుకున్నారు. సోమవారం ఉత్తర ఐర్లండ్ సందర్శించిన వారడ్కర్ ప్రొటొకాల్ పాటించలేదని మొదట విమర్శలు వెల్లువెత్తాయి. ఐరిష్ ప్రధానిని భారతీయుడని ముద్రవేయడంతో ‘అసంతృప్తి, అపార్థాల’కు దారితీయడంతో తన మాటలు వాపసు తీసుకుంటున్నట్టు కిల్క్లూనీ తెలిపారు.  

వారడ్కర్ తండ్రి మహరాష్ట్రీయుడు, తల్లి ఐరిష్‌ దేశీయురాలు. ముంబైలో పుట్టిన ఆయన తండ్రి అశోక్ వైద్యవిద్య పూర్తిచేసుకుని ఐర్లండ్ వచ్చి స్థిరపడ్డారు. ఐర్లండ్ క్రైస్తవ కాథలిక్ కుటుంబంలో జన్మించిన తల్లి మిరియం నర్సుగా శిక్షణ పొంది ఓ ఆస్పత్రిలో అశోక్‌తో కలిసి పనిచేస్తుండగా వారి పరిచయం పెళ్లికి దారితీసింది. తల్లిదండ్రులు లియోను కాథలిక్‌గానే పెంచారు. తర్వాత రాజకీయాల్లోకి వచ్చాక తాను ఓ ఇంటర్వ్యూలో స్వలింగ సంపర్కుడైన ‘గే’ అని ప్రకటించుకున్నారు. ‘‘అంటే నన్ను స్వలింగసంపర్కునిగానే చూడకండి. అదొక్కటే వాస్తవం కాదు. నేను సగం భారతీయుడైన డాక్టర్ ,రాజకీయవేత్తను కూడా ’’ అంటూ ఆధునిక ఐరోపా సంస్కృతికి ప్రతినిధిగా మాట్లాడారు. 

ఆయన జీవిత భాగస్వామి మాథ్యూ బ్యారట్ కూడా వైద్యుడే. ఇలాంటి నేపథ్యమున్న లియోను పక్కా భారతీయుడని వర్ణించడంతో లార్డ్ కిల్క్లూనీపై విమర్శల వర్షం కురిసింది. హౌస్ లార్డ్స్ మరో సభ్యుడైన కరణ్ బిలిమోరియా ఈ పరిణామంపై వ్యాఖ్యానిస్తూ, ‘‘లియో తల్లి ఐరిష్ మహిళ. అతను ఐర్లండ్లోనే పుట్టాడు. ఆయన స్థానికుడు కాకపోతే మరెవరు?’’అని ప్రశ్నించారు. ప్రసిద్ధ కోబ్రా బీర్ కంపెనీ స్థాపకుడైన బిలిమోరియా హైదరాబాద్‌లో పుట్టిపెరిగారు. వారడ్కర్తో పాటు భారత మూలాలున్న మరో నేత ఆంటోనియా కోస్టా ప్రస్తుతం మరో ఐరాపా దేశం పోర్చగల్ ప్రధాని. ఇంకా భారత సంతతికి చెందిన నేతలు అనేక దేశాలకు అధ్యక్ష, ప్రధాని పదవులు చేపట్టారు. 

సింగపూర్ తాత్కాలిక అధ్యక్షునిగా అనేకసార్లు చేసిన జేవై పిళ్లై
దేశాధ్యక్షుడు విదేశీ పర్యటనకు వెళ్లినప్పుడల్లా సింగపూర్ తాత్కాలిక అధ్యక్ష పదవి చేపట్టిన జేవై పిళ్లై కూడా భారత సంతతికి చెందిన ఉన్నతాధికారి. 1981-85 మధ్య ఈ దేశాధ్యక్షునిగా పనిచేసిన సీవీ దేవేన్ నాయర్ కేరళలో పుట్టి పదేళ్ల వయసులో తల్లిదండ్రులతో కలిసి సింగపూర్ వచ్చి స్థిరపడ్డారు. సింగపూర్ మూడో అధ్యక్షుడిగా పనిచేసిన నాయర్ 1979లో పార్లమెంటుకు ఎన్నికయ్యారు. 1953లో బ్రిటిష్ గయానా చీఫ్ మినిస్టర్‌గా ఎన్నికైన చెడ్డీ జగన్ ఉత్తర భారతంలో మూలాలున్న కుటుంబంలో పుట్టారు. ఆయన 1961-64 మధ్య అదే పదవి నిర్విహించి, 1992-97 మధ్యకాలంలో దేశాధ్యక్షునిగా ఉన్నారు. జగన్ పార్టీ పీపుల్స్ ప్రోగ్రెసివ్ పార్టీకే చెందిన భారత్ జగ్దేవ్ కూడా భారత హిందీ ప్రాంత మూలాలున్న నేత. 

ఆయన 1999-2011 మధ్య రెండు సార్లు గయానా అధ్యక్షునిగా పనిచేశారు. వెస్టిండీస్‌లోని మరో దేశం ట్రినిడాడ్-టొబాగో అధ్యక్షునిగా 1995-2001 కాలంలో పనిచేసిన బాసుదేవ్ పాండే పూర్వీకులు నేటి బిహార్ ప్రాంతం నుంచి బ్రిటిష్ పాలనలోని కరీబియా ప్రాంతంలోని చెరుకు తోటల్లో పనిచేయడానికి వెళ్లారు. దక్షిణ ట్రినిడాడ్లో పుట్టిన మరో భారతీయ సంతతి నేత కమలా ప్రసాద్ బిసేసార్ కూడా ట్రినిడాడ్-టొబాగో అధ్యక్షునిగా 2010-2015 మధ్య పనిచేశారు. హరియాణా మూలాలున్న జాట్ కుటుంబంలో జన్మించిన మహేంద్రపాల్ చౌధరీ పసిఫిక్ మహాసముద్రదేశమైన ఫిజీ ప్రధానిగా 1999-2000 మధ్య కొద్దికాలం పనిచేశారు. తర్వాత జరిగిన సైనిక తిరుగబాటులో ఆయన అధికారం కోల్పోయారు. 

మలేషియా అధ్యక్షునిగా సుదీర్ఘకాలం పనిచేసిన మహతీర్ మహ్మద్ మలయాళీయే
ఆగ్నేయాసియా దేశమైన మలేషియా అధ్యక్షునిగా సుదీర్ఘకాలం పదవిలో ఉన్న మహతీర్ మహ్మద్ పూర్వీకులు కేరళ నుంచి వలసపోయారు. ఆయన 1981 నుంచి 2003 వరకూ పదవిలో కొనసాగారు. హిందూ మహాసముద్రంలోని మారిషస్ అధ్యక్షునిగా, ప్రధానిగా అనేకసార్లు కొనసాగిన అనిరూధ్ జగన్నాథ్ పూర్వీకులు కూడా ఇండియా నుంచి వలసవెళ్లినవారే. ఆయన 1982లో దేశ ప్రధానిగా ఎన్నికయ్యారు. 2003-2008, 2008-20012 మధ్యకాలంలో ఆయన అధ్యక్షునిగా పనిచేశారు. 2014లో ఆరోసారి అధ్యక్షునిగా ఎన్నికయ్యాక ఈ ఏడాది ఆరంభంలో కొడుకు ప్రవీంద్కు పదవి అప్పగిచ్చేందుకు రాజీనామా చేశారు. భారతీయ మూలాలున్న మరో నేత రామ్సేవక్ శంకర్ దక్షిణ అమెరికా దేశమైన సూరినామ్ నాలుగో అధ్యక్షునిగా 1988-90 మధ్య పనిచేశారు. హిందీ ప్రాంతాల నుంచి వలసపోయిన భారత సంతతి జనం చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్న ఈ డచ్ వలస దేశంలో సైనిక తిరుగుబాటులో శంకర్ పదవీచ్యుతులయ్యారు. 

-సాక్షి నాలెడ్జ్ సెంటర్
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement