
సాక్షి, న్యూఢిల్లీ : క్లైమేట్ ఛేంజ్‌పై ఆందోళన వ్యక్తం చేస్తూ పర్యావరణ పరిస్థితుల పరిరక్షణకు పిలుపునిస్తూ ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఆందోళనలు చేస్తుంటే.. జిహాదీలో భాగంగా అమెరికా, యూరప్ దేశాల్లో అడవులను తగులబెట్టండంటూ ఐఎస్‌ఐఎస్ (ఐసిస్) క్యాడర్‌కు దాని ప్రచార సంస్థ ‘ఖురేశ్’ పిలుపునిచ్చింది. కాలిఫోర్నియా, స్పెయిన్‌లో ఇటీవల చెలరేగిన కార్చిచ్చు పట్ల ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమైన నేపథ్యంలో అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ దేశాల్లో అడవులను తగులబెట్టి ప్రజల్లో భయాందోళనలను రేపాలని, పర్యావరణ పరిస్థితులను మరింత దిగజార్చాలని సోషల్ మీడియా ద్వారా విడుదల చేసిన పోస్టర్లలో ఖురేశ్ ఐసిస్) సానుభూతిపరులకు విజ్ఞప్తి చేసింది.
సిరియాలో గత నెల ఐఎస్‌ఐఎస్ చీఫ్ అబు బకర్ అల్ బాగ్దాదిని అమెరికా సైనికులు హతమార్చినప్పటికీ ఐసిస్ సోషల్ మీడియా ద్వారా ఖలీఫా రాజ్యం గురించి ప్రచారం సాగిస్తూనే ఉంది. పారిస్‌లోని నాత్రే డ్యామ్ కథడ్రల్ గత ఏప్రిల్‌లో మంటల్లో చిక్కుకోవడం క్రైస్తవుల శాపంగా, తమ విజయంగా ఐసిస్) ప్రచారం చేసుకుంటోంది. అప్పటినుంచే అడవులను తగులబెట్టాలంటూ అప్పుడప్పుడు పిలుపునిస్తోంది.